దుబ్బాక: మధ్యాహ్నానికి 50 శాతం దాటిన పోలింగ్
ABN, First Publish Date - 2020-11-03T20:37:22+05:30
దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది.
సిద్దిపేట జిల్లా: దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. మధ్యాహ్నం ఒంటిగంట దాటే సమయానికి 50 శాతానికిపైగా పోలింగ్ నమోదయింది. ఉదయం 10 గంటల సమయానికే దాదాపు 30 శాతం పోలింగ్ నమోదయింది. ఉదయం నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాల ముందు బారులు తీరారు. పోటీలో 23 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ ప్రధాన పోటీ టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్యే జరుగుతుంది. ముక్కోణపు పోరులో టీఆర్ఎస్ నుంచి సోలిపేట సుజాత, బీజేపీ నుంచి రఘునందన్‌రావు, కాంగ్రెస్ నుంచి శ్రీనివాసరెడ్డి భవితవ్యంపై ప్రజలు తీర్పు ఇవ్వనున్నారు.
హోరాహోరిగా జరిగిన ప్రచారంతోపాటు ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఈ ఎన్నికపై ఆసక్తి నెలకొంది. ప్రతి ఒక్కరూ పోలింగ్ సరళిపై ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 85 శాతం పోలింగ్ నమోదయింది. కరోనా కాలంలో రాష్ట్రంలో జరుగుతున్న తొలి ఎన్నిక కావడంతో పూర్తిస్థాయి జాగ్రత్తలు తీసుకుని ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
Updated Date - 2020-11-03T20:37:22+05:30 IST