దుబ్బాక: ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద భారీ భద్రత
ABN, First Publish Date - 2020-11-03T15:21:27+05:30
దుబ్బాకలో ఉపఎన్నిక పోలింగ్ మంగళవారం ఉదయం ప్రారంభమైంది. ఈ సందర్భంగా..
సిద్దిపేట జిల్లా: దుబ్బాకలో ఉపఎన్నిక పోలింగ్ మంగళవారం ఉదయం ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఉదయం కొంచెం మందకొడిగా పోలింగ్ ప్రారంభమైనప్పటికీ తర్వాత ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. కరోనా నేపథ్యంలో ప్రతి పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు సామాజిక దూరం పాటించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. టెంపరేచర్ చెక్ చేసిన తరువాత మాత్రమే ఓటు వేసేందుకు అధికారులు అనుమతిస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా 315 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాటిలో 89 సమస్యత్మకమైన పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. ఆయా కేంద్రాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. నియోజకవర్గం వ్యాప్తంగా 315 ఈవీఎంలు ఉండగా అదనంగా మరో 120 ఈవీఎంలను ఏర్పాటు చేశారు.
దుబ్బాక నియోజక వర్గంలో మొత్తం 1,98,807 మంది ఓటర్లు ఉండగా, వారిలో 97,978 మంది పురుషులు కాగా, 1,00,778 మంది మహిళలు ఉన్నారు. 51 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారు. ఇవాళ సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఉపఎన్నిక సందర్భంగా దుబ్బాకలో 144 సెక్షన్ విధించారు.
Updated Date - 2020-11-03T15:21:27+05:30 IST