దుబ్బాక దంగల్!
ABN, First Publish Date - 2020-11-03T07:30:09+05:30
భర్త అడుగు జాడల్లో నడవాలని ఒకరు! తండ్రి వారసత్వాన్ని నిలబెట్టాలని మరొకరు! ఈసారైనా అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఇంకొకరు!
నేడే ఉప ఎన్నిక పోలింగ్.. ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు
కొవిడ్ దృష్ట్యా గంట సమయం పెంపు
కరోనా జాగ్రత్తల మధ్య కట్టుదిట్టంగా ఏర్పాట్లు
ముక్కోణపు పోరుపై సర్వత్రా ఉత్కంఠ
హైదరాబాద్, సిద్దిపేట, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): భర్త అడుగు జాడల్లో నడవాలని ఒకరు! తండ్రి వారసత్వాన్ని నిలబెట్టాలని మరొకరు! ఈసారైనా అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఇంకొకరు! దాదాపు నెల రోజులుగా హోరాహోరీగా తలపడ్డారు! ఇప్పుడు ప్రజా తీర్పునకు వేళయింది! దుబ్బాక ఉప ఎన్నిక మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ జరగనుంది. కొవిడ్ రూల్స్ నేపథ్యంలో ఈసారి అదనంగా గంట సమయాన్ని పెంచారు. పోటీలో 23 మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ ప్రధాన పోటీ టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్యనే! ముక్కోణపు పోరులో టీఆర్‌ఎస్ నుంచి సోలిపేట సుజాత, బీజేపీ నుంచి రఘునందన్‌రావు, కాంగ్రెస్ నుంచి శ్రీనివాసరెడ్డి భవితవ్యంపై ప్రజలు తీర్పు ఇవ్వనున్నారు.
రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ చూసినా దుబ్బాక ఉప ఎన్నిక హాట్ టాపిక్‌గా మారింది. హోరాహోరీగా సాగిన ప్రచారంతోపాటు ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో ఈ ఎన్నికపై ఆసక్తి నెలకొంది. ప్రతి ఒక్కరూ పోలింగ్ సరళిపై ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 85 శాతం పోలింగ్ నమోదైంది. కరోనా సమయంతోపాటు ఉప ఎన్నిక కావడంతో పోలింగ్ తగ్గుతుందా? పెరుగుతుందా? అనే మీమాంస నెలకొంది.
ఇక, కరోనా కాలంలో రాష్ట్రంలో జరుగుతున్న తొలి ఎన్నిక కావడంతో పూర్తిస్థాయి జాగ్రత్తలు తీసుకుని ఎన్నికను నిర్వహిస్తున్నారు. మాస్కు లేనిదే పోలింగ్ కేంద్రంలో అడుగు పెట్టొద్దని ఓటర్లకు సూచిస్తున్నారు. ఒకవేళ మాస్కు లేకపోతే, కేంద్రంలోనే మాస్కుతోపాటు గ్లౌజులు ఉచితంగా అందజేస్తారు. ప్రవేశ ద్వారం వద్దే థర్మల్ స్ర్కీనింగ్ చేస్తారు. జ్వరం లక్షణాలు ఉంటే చివరి గంటలో అంటే, సాయంత్రం 5 గంటల తర్వాత ఓటేసేందుకు రావాలని సూచిస్తున్నారు. ఆరు అడుగులకు ఒక మార్కింగ్ వేసి సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నారు.
ప్రతి పోలింగ్ కేంద్రంలో మూడు చోట్ల శానిటైజర్లు, సబ్బునీళ్ల సౌకర్యం ఏర్పాటు చేశారు. ఎన్నికల సిబ్బందికి ఈవీఎం కిట్లతోపాటు కొవిడ్ కిట్లనూ అందజేశారు. వాటిలో మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్, ఫేస్‌షీల్డ్ ఉన్నాయి. కరోనాతో పాటించాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేకంగా పోస్టర్లు తయారు చేయించారు.
భారీగా పోలీస్ బందోబస్తు
నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి అన్ని పార్టీలు ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. మూడు పార్టీల నడుమ మాటల యుద్ధాలు నడిచాయి. వాగ్వాదాలు, తోపులాటలు చోటుచేసుకున్నాయి. దుబ్బాక, సిద్దిపేట పట్టణాల్లో ఉద్రిక్త పరిస్థితులూ ఏర్పడ్డాయి. దీంతో, ఎన్నికల వేళ అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
తొలిసారిగా పోలీసుల పర్యవేక్షకుడిగా తమిళనాడుకు చెందిన ఐపీఎస్ అధికారి సరోజ్‌కుమార్ ఠాకూర్‌ను ఇక్కడికి పంపించారు. ఒక సీఆర్‌పీఎఫ్, మూడు ఏపీఎస్పీ కంపెనీల బలగాలను రప్పించారు. తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి 1500 మంది వివిధ స్థాయి పోలీస్ అధికారులు, సిబ్బందిని నియమించారు. దాదాపు 2015 మంది పోలీసులు ఈ ఉప ఎన్నికలో విధులు నిర్వహిస్తున్నారు. ఇక, ఉప ఎన్నిక విధులు నిర్వహించడానికి 400 మంది ప్రిసైడింగ్; 400 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్; 800 మంది అదనపు పోలింగ్ అధికారులను నియమించారు.
రెండో ఉప ఎన్నిక
శాసనసభకు ముందస్తుగా 2018లో ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత జరుగుతున్న రెండో ఉపఎన్నిక ఇదే. సాధారణ ఎన్నికల్లో హుజూర్‌నగర్ నుంచి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (కాంగ్రెస్) గెలిచారు. నల్లగొండ ఎంపీగానూ గెలవడంతో అసెంబ్లీకి రాజీనామా చేశారు. అక్కడి ఉపఎన్నికలో టీఆర్‌ఎస్ గెలిచింది.
మొత్తం ఓటర్లు 1,98,807
పురుషులు 98,028
మహిళలు 1,00,779
పోలింగ్ కేంద్రాలు 315
సమస్యాత్మక కేంద్రాలు 89
పోలింగ్ కేంద్రాల్లో కొవిడ్ జాగ్రత్తలు
ప్రతి ఒక్కరికీ మాస్కు తప్పనిసరి
6 అడుగులకు ఒకరు చొప్పున మార్కింగ్
ప్రవేశ ద్వారం వద్దే థర్మల్ స్ర్కీనింగ్
అందుబాటులో శానిటైజర్, సబ్బు నీళ్లు
జ్వరం ఉంటే చివరి గంటలో ఓటింగ్
ఎన్నికల సిబ్బందికి కొవిడ్ కిట్లు
Updated Date - 2020-11-03T07:30:09+05:30 IST