ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డబ్బుల్‌ దందా

ABN, First Publish Date - 2020-11-28T07:44:01+05:30

పేద ప్రజలకు పూర్తి ఉచితంగా నిర్మించి ఇచ్చేందుకు ప్రభుత్వం సంకల్పించిన డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల పథకం, కొందరు దళారులకు వరంగా మారింది. బడుగు జీవుల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దళారులకు వరంగా మారిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పథకం

సచివాలయం, రెవెన్యూలో పరిచయాలున్నాయని గొప్పలు వారి కనుసన్నల్లోనేనని.. 

90శాతం వాటా వారికేనని బురిడీ

డ్రా తీసినా మీ పేర్లే.. మాదీ పూచీ అంటూ భరోసా 

ఇంటికి రూ.1.5 లక్షలు.. సైబరాబాద్‌లో ఒకే ముఠా 4.5కోట్లు   

హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో మరో ముఠా రూ.2కోట్లు  

వరంగల్‌ అర్బన్‌లో ఇంటికి రూ.5 లక్షల రేటు ఫిక్స్‌ 

అడ్వాన్స్‌లతో బాండ్‌ పేపర్ల మీద ఒప్పందాలు

ఆదిలాబాద్‌ జిల్లాలో 50 ఇళ్లకు ఓ టీఆర్‌ఎస్‌ నేత టెండర్‌ 


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

 పేద ప్రజలకు పూర్తి ఉచితంగా నిర్మించి ఇచ్చేందుకు ప్రభుత్వం సంకల్పించిన డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల పథకం, కొందరు దళారులకు వరంగా మారింది. బడుగు జీవుల సొంతింటి కలను ఆసరాగా చేసుకొని ఇళ్లు ఇప్పిస్తాం అని వారికి ఆశపెట్టి లక్షల్లో వసూలు చేస్తున్నారు. పరిమిత ఇళ్ల కోసం అపరిమితంగా దరఖాస్తులు ఉండటంతో డబ్బిస్తే కచ్చితంగా ఇల్లొస్తుందనే నమ్మకంతో అప్పు చేసి.. ఉన్న కాస్త బంగారం అమ్మి మరీ ఆ డబ్బంతా దళారుల చేతుల్లో పోస్తున్నారు. తీరా ఇల్లు రాదని తెలిసి.. కలల సౌథం కుప్పకూలి.. వారికి కన్నీళ్లు మిగిలితే.. ఇష్టారీతిన చేసిన వసూళ్లతో దళారులు రూ. కోట్లలో కూడబెట్టుకుంటున్నారు.


రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల ఈ దందా నడుస్తోంది. ప్రభుత్వం కట్టించిన ఇళ్లు, పేదల చేతికి ఎప్పుడొస్తాయో ఏమో గానీ డబుల్‌ బెడ్‌రూం పథకం మాత్రం అక్రమార్కులకు కాసుల పంట పండిస్తోంది. సొంతిటి కల నెరవేరడం దుర్లభమైన హైదరాబాద్‌లో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లపై సామాన్య జనాలకు ఉన్న ఆశలను సొమ్ము చేసుకొనేందుకు  ఎన్నో ముఠాలు వెలిశాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో లక్ష డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కట్టి.. పేదలకు పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఎంపిక చేసిన చోట్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. వీటి కోసం లక్షల మంది దరఖాస్తులు పెట్టుకున్నారు. ఈ ఆర్జీలు పెట్టుకున్నవారికి దళారులు గాలం వేస్తున్నారు.

సచివాలయంలో ఉన్న పెద్ద పెద్ద ప్రభుత్వ అధికారులకు తాము అనుచరులమని, వారికి తాము ఎంత చెబితే అంత అని, తాము చెప్పిన వాళ్లకే ఇళ్లు కేటాయిస్తారని నమ్మిస్తున్నారు. ఇలా వందల మంది నుంచి లక్షల్లో వసూలు చేస్తున్నారు. ఈ మేరకు మూడు కమిషనరేట్‌ పరిధిలో ఇప్పటికే పలు ముఠాల ఆగడాలకు పోలీసులు చెక్‌ పెట్టారు. వెలుగులోకి రాని ముఠాలు ఇంకొన్ని నగరంలో ఉన్నాయనే విషయం పోలీసుల దృష్టికి వచ్చింది. 



సచివాలయంలో పరిచయాలని చెప్పి.. 

మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ఆలె లక్ష్మి బతుకుదెరువుకోసం నగరానికొచ్చి సూరారం కాలనీలో టిఫిన్‌ సెంటర్‌ నడుపుతోంది. కుత్బుల్లాపూర్‌ వెంకట్రామ్‌నగర్‌కు చెందిన వెలిసెట్టి వెంకట సత్య కృష్ణ వరప్రసాద్‌, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఇప్పిస్తున్నాడని తెలిసి సంప్రదించింది. అతడికి రూ. 1.5లక్షలు చెల్లించింది. కొన్నాళ్లకు అతడు  నకిలీ కేటాయింపు పత్రాన్ని ఇస్తే తెచ్చుకుంది. ‘ఇంకెవరైనా ఉంటే చెప్పు.. వారికీ ఇళ్లు ఇప్పిద్దాం’ అని లక్ష్మికి సత్యకృష్ణ వరప్రసాద్‌ కమిషన్‌ ఆశ చూపాడు. ఆమె మాటలను నమ్మి కొందరు అతడికి డబ్బిచ్చారు.


ఈ దందాలో సత్యకృష్ణ ప్రసాద్‌ మామ ఆదూరి మురళీ కృష్ణమూర్తి, పాలకొల్లు శ్రీనివాస్‌, నాగళ్ల కృష్ణారావు, కె. శ్రీనివాసరావు కూడా ఉన్నారు. అంతా కలిసి 169 మంది నుంచి 2.26 కోట్లను కొల్లగొట్టారు. సత్యకృష్ణ వరప్రసాద్‌ ఈ దందాను తన మామ మురళీ కృష్ణమూర్తిని ముందుపెట్టి కొనసాగించినట్లు పోలీసులు గుర్తించారు. జ్యోతిషుడిగా పనిచేసిన 75 ఏళ్ల మురళి కృష్ణ, ఎదుటివారిని ఆకట్టుకోవడంలో నేర్పరి. వరప్రసాద్‌కు ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో.. ఎలాగైనా సులభంగా డబ్బు సంపాదించాలని పక్కాగా స్కెచ్‌ వేశాడు. తన మామకు సెక్రటేరియట్‌లో పెద్ద పెద్ద అధికారులతో మంచి సంబంధాలున్నాయని, పేదలను నమ్మించి వసూళ్లకు పాల్పడ్డాడు. ఓసారి జైలుకెళ్లి వచ్చాక కూడా ఈ సత్యకృష్ణ ప్రసాద్‌ ముఠా దందా ఆగలేదు.


డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పేరుతో ఈ ముఠా మరో 89 మందిని మోసం చేసి రూ. 1.03కోట్లు.. ఇంకొందరి నుంచి రూ.1.1 కోట్లు కొల్లగొట్టింది. కేవలం 8 నెలల్లోనే ఈ ముఠా రూ.4.5 కోట్లు దోచుకుంది. కాగా హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో పదుల సంఖ్యలో పేదలను మోసం చేసి రూ. 2కోట్లు కొల్లగొట్టిన రెండు ముఠాలను హైదరాబాద్‌ సిటీ పోలీసులు ఈ గత సెప్టెంబరులో అరెస్టు చేశారు.

ఇక నగరంలోని ఉప్పుగూడకు చెందిన ఏలగపల్లి రాకేశ్‌ యాదవ్‌ అలియాస్‌ శ్రీనివాస్‌ ఎలక్ట్రీషియన్‌. తాను రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో పనిచేస్తున్నానని డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఇప్పిస్తానని చెప్పి 17మందిని మోసం చేశాడు. ఒక్కొక్కరి దగ్గర రూ.80 వేల నుంచి రూ.1.5 లక్షల దాకా వసూలు చేసి.. రూ.40 లక్షలు కొల్లగొట్టాడు.  


ఐదు లక్షలిస్తే ఇల్లు 

వరంగల్‌ అర్బన్‌ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలో 1022, వరంగల్‌ పశ్చిమలో 1505, వరంగల్‌ తూర్పులో 1400, స్టేషన్‌ ఘన్‌పూర్‌లో 230, హుజురాబాద్‌లో 792, హుస్నాబాద్‌ 272 .. ఇలా మొత్తం 5221 ఇళ్లకు గతంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో జిల్లా కలెక్టర్‌ 5122 ఇళ్ళకు పరిపాలనా అనుమతినిచ్చారు. 4,241 ఇళ్ళ నిర్మాణాలకు టెండర్‌లు పిలిచారు. 1546 ఇళ్ళ నిర్మాణాలకు సంబంధించి టెండర్‌ ఇంకా ఖరారు కాలేదు. ఇందులో చాలా వరకు నిర్మాణాలు పూర్తయి లబ్ధిదారులకు అందించే దశలో ఉన్నాయి.


ఇదే అదనుగా దళారులు రంగ ప్రవేశం చేశారు. పేద, మధ్య తరగతి ప్రజలను లక్ష్యంగా చేసుకుని గుట్టు చప్పుడు కాకుండా డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ళను ఇస్తామంటూ లక్షల్లో వసూలు చేశారు. ఇంటికి రూ.5లక్షల చొప్పున రేటు ఫిక్స్‌ చేశారు. బయనాగా రూ.లక్ష నుంచి రూ.3లక్షలు వసూలు చేశారు. డబ్బిచ్చినవారిని నమ్మించేందుకు బాండ్‌ పేపర్‌ల రాసిచ్చారు. ఆదిలాబాద్‌ జిల్లా జనథ్‌ మండల కేంద్రంలో ఏడాది  క్రితమే 138 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. అధికారకంగా వీటిని లబ్ధిదారులకు కేటాయించలేదు.


అయితే జనాల నుంచి కొందరు టీఆర్‌ఎస్‌ నేతలు అందినకాడికి దోచుకొని ఆ ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించారని సమాచారం. ఇటీవల తలమడుగు మండలం కజ్జర్ల గ్రామంలో ఓ టీఆర్‌ఎస్‌ నేత.. 50 ఇళ్లకు టెండర్‌ పెట్టినట్లు సమాచారం. ఆ ఇళ్లను నిర్మించకముందే స్థలం పేరుతో ఒక్కొక్కరి నుంచి రూ.1.1లక్షలు వసూలు చేసేందుకు గ్రామపెద్దల సమక్షంలో ఒప్పందం చేసుకున్నట్లు చెబుతున్నారు. 




సందేహాలు నివృత్తి చేసి మరీ వసూలు

లబ్ధిదారులను తామే ఎంపిక చేసి ఇళ్లు కేటాయిస్తామని ప్రభుత్వమే చెబుతోంది కదా? అప్పుడు మాకెలా ఇల్లు ఇపిస్తారు? దళారులకు చాలా చోట్ల ఇలాంటి ప్రశ్నలు ఎదురవుతున్నా.. తమ మాటల చాతుర్యంతో వారిని బురిడీ కొట్టిస్తున్నారు. అసలు ఈ దందా నడిపిస్తోందే ఉన్నతాధికారులని వారిని నమ్మిస్తున్నారు. ఇందుకుగాను డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ళ నిర్మాణాలను పరిశీలించేందుకు వస్తున్న కొందరు అధికారుల పేర్లు, రెవెన్యూ శాఖలోని ఉన్నతాధికారుల పేర్లను వాడుకుంటున్నారు.


‘‘మీరు మాకు ఇచ్చే డబ్బులో 90శాతం అఽధికారుల చేతుల్లోకే వెళుతుంది. మాకు మిగిలేది కొంతే’’నని వారికి లెక్కలు కూడా చెబుతున్నారు. ఇళ్ల కోసం లబ్ధిదారుల పేర్లను డ్రా తీసి ఎంపిక చేస్తారట కదా? అని అడిగితే.. ‘‘ఏ పద్ధతిలో ఎంపిక చేసినా మీకు ఇళ్లు రావడం ఖాయం. అందుకు మాదీ పూచీ’’ అని నమ్మిస్తున్నారు. ఎలాగో అలా నమ్మించి డబ్బులు వసూలు చేస్తున్న ఈ ముఠాలు.. దందా విషయాన్ని బయటకు చెబితే మాత్రం పరిస్థితి తీవ్రస్థాయులో ఉంటుందని డబ్బిచ్చినవారిని హెచ్చరిస్తుండటం కొసమెరుపు. 


Updated Date - 2020-11-28T07:44:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising