పోడు రైతుల కష్టాల ‘సాగు’
ABN, First Publish Date - 2020-11-09T08:45:09+05:30
రాష్ట్ర ప్రభుత్వం ధరణి వెబ్‌సైట్ ద్వారా భూ లావాదేవీలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్న వేళ.. తరతరాలుగా సాగు చేసుకుంటున్న తమ భూములకు హక్కులు రాక గిరిజన, గిరిజనేతర పోడు రైతులు ..
హక్కు పత్రాలు లేక ప్రభుత్వ పథకాలకు దూరం
హరితహారం పేరుతో అధికారుల వేధింపులు
ఆసిఫాబాద్, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ధరణి వెబ్‌సైట్ ద్వారా భూ లావాదేవీలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్న వేళ.. తరతరాలుగా సాగు చేసుకుంటున్న తమ భూములకు హక్కులు రాక గిరిజన, గిరిజనేతర పోడు రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఆరేళ్ల క్రితం వరకు అంతా సజావుగానే సాగినా.. హరితహారం ప్రారంభించిన నాటి నుంచి ఈ రైతులకు కష్టాలు మొదలయ్యాయి. పోడు రైతుల జోలికి వెళ్లొద్దని ప్రభుత్వం చెబుతున్నా.. హరితహారం పేరుతో పోడు భూముల్లో మొక్కలు నాటుతూ అటవీ అధికారులు రైతులను ఇబ్బంది పె డుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాము సాగు చేసుకుంటున్న భూములకు శాశ్వత హక్కులు కల్పించాలన్న డిమాండ్ గిరిజనేతర రైతుల నుంచి వినిపిస్తోంది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అనధికారిక గణాంకాల ప్రకారం సుమారు 50 వేల ఎకరాలకు పైబడిన విస్తీర్ణంలో 20 వేల మందికి పైగా గిరిజనేతర రైతులు అటవీ భూముల్లో పోడు వ్యవసాయం చేస్తున్నారు. ఇందులో అధిక భాగం కాగజ్‌నగర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉండగా.. ఆసిఫాబాద్ ఏజెన్సీలోనూ వందలాది మంది గిరిజనేతర రైతులు 70-80 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నారని చెబుతున్నారు.
కానీ.. 1/70 చట్టం అమల్లోకి రాక ముందు నుంచి సాగు చేసుకుంటున్న వారిలోనూ ఇంకా చాలామందికి హక్కులు కల్పించలేదని చెబుతున్నారు. అప్పట్లో అవగాహన రాహిత్యంతో ఆదివాసుల ఉనికి లేని ప్రాంతాలనూ అధికారులు షెడ్యూల్డ్ ఏరియాల్లో చూపించారని అంటున్నారు. ఇలాంటి గ్రామాల్లోనే ప్రస్తుతం గిరిజనేతర రైతులు పెద్ద సంఖ్యలో ఉంటున్నారు. గిరిజన చట్టాల ప్రకారం.. వీరికి భూములపై హక్కులు వచ్చే పరిస్థితి లేకపోవడంతో పంట రుణాలు, ప్రభుత్వ పథకాలేవీ అందడం లేదు.
ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతర రైతులూ అధికమే
ఏజెన్సీలో స్థిరపడిన గిరిజనేతర రైతులకు పోడు వ్యవసాయమే జీవనాధారం. జైనూర్ మండలంలోని జంగాం, జామ్ని, పవర్‌గూడ, పొలాసా రాశిమెట్ట, కొండిబాగూడ, ఆశాపెల్లి, నందునాయక్ తండా, జైనూర్, పొచంలొద్ది తదితర గ్రామాల్లో గిరిజనేతరులు పోడు వ్యవసాయం చేసుకుంటున్నారు. ఆ గ్రామాల్లో వెయ్యి మంది రైతులు ఉండగా.. 3,212 ఎకరాల పోడు భూములు ఉన్నాయి. కానీ.. వీరికి భూమి హక్కు పత్రాలు మాత్రం లేవు.
గిరిజన రైతులకూ తప్పని తిప్పలు
సిర్పూర్ (యూ) మండలంలోని ముంజిగూడ, బాంబేర్, చిత్రకర్ర, బాబ్జిపేట, కాకడబొడ్డి తదితర గ్రామాల్లో పోడు వ్యవసాయం చేసుకుంటున్న 84 మంది ఆదివాసీ రైతులకు ఇప్పటికీ పట్టాలు లేవు. తిర్యాణి మండలంలోని మారుమూల ప్రాంతాల్లో పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనుల పరిస్థితీ ఇలాగే ఉంది. బెజ్జూరు మండలంలో 700 ఎకరాలకు పైగా, సిర్పూర్ (టి) రేంజ్ పరిధిలో 1,000-1,500 ఎకరాల్లో పోడు భూములు సాగవుతున్నాయి. చింతలమానేపల్లి మండలంలోని కేతిని, దిందా, గూడెం, చిత్తాం, కర్జెల్లి, రన్‌వెల్లి, గంగాపూర్, కోర్సిని, డబ్బా, ఆడెపల్లి తదితర గ్రామాల్లో పోడు వ్యవసాయంపైనే రైతులు అధికంగా ఆధారపడి జీవనం సాగిస్తున్నారు.
2దశాబ్దాల్లో 20 వేల ఎకరాల అటవీ ప్రాంతం కనుమరుగు
గడచిన 2 దశాబ్దాల్లో జిల్లాలోని 15 మండలాల్లోని సుమారు 20 వేల ఎకరాలకు పైగా అటవీ ప్రాంతం కనుమరుగైపోయింది. 2006లో అప్పటి ప్రభుత్వం ‘రికగ్నైజేషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్’ కింద పోడు సాగు చేసుకుంటున్న రైతులకు తాత్కాలిక హక్కులు కల్పించింది. దీన్ని అవకాశంగా తీసుకున్న కొంతమంది బడా భూస్వాములు.. అటవీ భూములను భారీగా కబ్జా చేసేశారు. వేలాది ఎకరాల్లో అడవులను నరికేశారు. నిరుపేద రైతులు మాత్రం తలా ఒకటి రెండు ఎకరాల భూమిలోనే వ్యవసాయం చేసుకుంటున్నారు. బడా భూస్వాముల జోలికి వెళ్లని అధికారులు.. సామాన్యులపై మాత్రం తమ ప్రతాపం చూపిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Updated Date - 2020-11-09T08:45:09+05:30 IST