2లక్షల యాంటీజెన్ టెస్టులు
ABN, First Publish Date - 2020-07-08T08:43:58+05:30
2లక్షల యాంటీజెన్ టెస్టులు
నారాయణగూడ ఐపీఎంలో పరీక్షా యంత్రాల ఏర్పాటు
తొలివిడతలో పోలీసులు, వైద్య సిబ్బంది, జర్నలిస్టులకు పరీక్షలు
హైదరాబాద్‌లో నేటి నుంచే ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు ?
హైదరాబాద్/హైదరాబాద్ సిటీ/మియాపూర్, జూలై 7 (ఆంధ్రజ్యోతి): కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుండటంతో యాంటీజెన్, యాంటీబాడీ పరీక్షలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2 లక్షల యాంటీజెన్ పరీక్షలు, 25వేల యాంటీబాడీ టెస్టులు చేసేందుకు ప్రణాళిక సిద్ధమైంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఇప్పటికే హైదరాబాద్ నారాయణగూడలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం) కేంద్రంలో పరీక్ష యంత్రాలను కూడా సిద్ధం చేశారు. పరీక్షలు నిర్వహించే వైద్య సిబ్బందికి శిక్షణ కూడా పూర్తయింది. తొలివిడతలో వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులు, మీడియా ప్రతినిధులకు ఈ పరీక్షలు చేసే అవకాశం ఉందని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి కరోనా వ్యాప్తి ప్రారంభమైన తొలినాళ్లలోనే ఇన్ఫెక్షన్ల తీవ్రతను అంచనా వేసేందుకు యాంటీజెన్ టెస్టులు చేయాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. అప్పట్లోనే 25వేల పరీక్ష కిట్ల కోసం ఆర్డర్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత దానిపై వైద్యశాఖ యూటర్న్ తీసుకుంది. 25 వేల కిట్ల కోసం పెట్టిన ఇండెంట్‌ను రద్దు చేసింది. యాంటీజెన్ పరీక్షలపై తమకు నమ్మకం లేదని, వాటిలో కచ్చితత్వం తక్కువని వెల్లడించింది. అంతటితో ఆగకుండా.. యాంటీబాడీ పరీక్షలు చేయ డం వృథా అంటూ ఐసీఎంఆర్‌కు లేఖ రాసింది. కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో భారీ సంఖ్యలో రివర్స్ ట్రాన్స్‌క్రిప్షన్- పాలిమరేజ్ చైన్ రియాక్షన్(ఆర్టీ-పీసీఆర్) పద్ధతిలో పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేకుండా పోయింది.
ఇప్పుడు యాంటీజెన్ పరీక్షల వైపే మొగ్గు
మూలం దొరకని కేసులు నమోదవుతుండటం, వైర స్ సామాజిక వ్యాప్తి దశకు చేరిందేమోనని సందేహా లు వ్యక్తమవుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంది. గతంలో వద్దనుకున్న.. యాంటీజెన్ పరీక్షలనే చేసేందుకు సిద్ధమైంది. గ్రేటర్ హైదరాబాద్‌లో బుధవారం(జూలై 8) నుంచే ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇందుకు రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఎంపిక చేసిన పట్టణ ప్రాథమిక చికిత్సా కేంద్రాల్లో(యూపీహెచ్‌సీ) శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రతిరోజు 20 నుంచి 25 మందికి పరీక్షలు చేయనున్నారు. అనుమానిత లక్షణాలు కలిగినవారు, పాజిటివ్ వచ్చినవారి సన్నిహితులకు తొలివిడతలో టెస్టులు చేస్తారు. రక్త నమూనాలు సేకరించిన అరగంటలోనే వారికి ఇన్ఫెక్షన్ ఉందా? లేదా? అనేది నిర్ధారిస్తారు. గ్రేటర్ హైదరాబాద్‌లో దాదాపు 85 యూపీహెచ్‌సీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లో 50, రంగారెడ్డి జిల్లాలో 15, మేడ్చల్ జిల్లాలో 20 యూపీహెచ్‌సీలను ఎంపిక చేశారు.
పరీక్ష తర్వాత ఆర్టీ-పీసీఆర్ చేస్తారా?
మన శరీరంలోకి చేరిన రోగ కారకాన్ని యాంటీజెన్(ప్రతిజనకం) అంటారు. దీన్ని తిప్పికొట్టేందుకు ఆ వెంటనే రోగ నిరోధక వ్యవస్థ మోహరించే రక్షక భటులే యాంటీబాడీలు(ప్రతిరక్షకాలు). యాంటీజెన్‌ను గుర్తించడం ద్వారా ఇన్ఫెక్షన్ సోకిందా? లేదా ? అనేది నిర్ధారించేందుకు యాంటీజెన్ పరీక్షలు చేస్తారు. వైరస్ సోకిన కొద్ది గంటల్లో ఈ టెస్టు చేస్తే పాజిటివ్‌గా చూపిస్తుం ది. ఒకవేళ వైరస్ ఎటాక్ చేయకపోతే నెగెటివ్ వస్తుంది. సాధారణంగా యాంటీజెన్ టెస్టుల్లో పాజిటివ్ వచ్చిన వారికి మళ్లీ ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తారు. అందులో కూడా పాజిటివ్ వస్తే వారికి కరోనా వైరస్ సోకినట్లుగా నిర్ధారించి చికిత్స అందిస్తారు. కానీ మన దగ్గర చేయబోయే యాంటీజెన్ టెస్టుల్లో పాజిటివ్ వచ్చిన వారికి తిరిగి ఆర్‌టీ- పీసీఆర్ టెస్టులు చేస్తారా ? అనే దానిపై వైద్య ఆరోగ్యశాఖ వద్ద స్పష్టత లేదు.
Updated Date - 2020-07-08T08:43:58+05:30 IST