టి.కాంగ్రెస్‌లో హాట్ టాపిక్‌గా మారిన ఆ ఇద్దరి వైఖరి..!
ABN, First Publish Date - 2020-10-04T16:21:30+05:30
ఒకరు మాటలతోనే మంట పుట్టిస్తారు. పదునైన విమర్శనాస్త్రాలతో ప్రత్యర్థి పార్టీలకు చుక్కలు చూపిస్తారు. ఏ పార్టీలో ఉన్నా తన మార్క్ రాజకీయం కనబరుస్తారు.
ఒకరు మాటలతోనే మంట పుట్టిస్తారు. పదునైన విమర్శనాస్త్రాలతో ప్రత్యర్థి పార్టీలకు చుక్కలు చూపిస్తారు. ఏ పార్టీలో ఉన్నా తన మార్క్ రాజకీయం కనబరుస్తారు. ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన ఆ నాయకురాలు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. మరొకరు మైదానంలో పరుగుల వరద పారించిన స్టార్ క్రికెటర్. అంతేకాదు రాజకీయ చదరంగంలోనూ రాణించారు. గత సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో తళుక్కుమన్న ఆ నాయకుడిని హస్తం పార్టీ నాయకులు దుర్భిణి వేసి చూసినా కనిపించడం లేదట. ఇంతకీ ఆ లేడీ ఫైర్ బ్రాండ్ ఎందుకు సైలెంట్ అయ్యారు? మరో స్టార్ క్యాంపెయినర్ కనిపించకపోవడానికి కారణం ఏమిటి?
తెలంగాణ కాంగ్రెస్‌లో స్టార్ క్యాంపెయినర్లు విజయశాంతి, అజారుద్దీన్ క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉండటం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. పార్టీ కార్యక్రమాలకు అంటీముట్టనట్లుగా ఉంటున్న వారు.. ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మాణికం ఠాగూర్ నిర్వహించిన సమావేశాలకు గైర్హాజరు కావడం హాట్‌టాపిక్‌గా మారింది. ఆయన మూడురోజులు హైదరాబాద్‌లో మకాం వేసి పార్టీ నాయకులతో బిజీబిజీగా సమావేశాలు చేపడుతున్నా.. మర్యాద పూర్వకంగానైనా కలువకపోవడంపై భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. ఇంతకీ వారిద్దరు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ను లైట్ తీసుకున్నారా? లేక కాంగ్రెస్‌తో కటీఫ్‌కు రెడీ అయ్యారా? అన్న ఊహాగానాలకు తెరలేచింది.
గాంధీభవన్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు..
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళనకు నడుం బిగించిన హైకమాండ్.. ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ నుంచే ఆ ప్రక్రియ మొదలుపెట్టింది. రాష్ట్రంలో జరుగుతున్న పార్టీ పరిణామాలపై వాస్తవాలు దాస్తున్నారన్న ఫిర్యాదుతో ఆయనను తొలగించి ఆ స్థానంలో తమిళనాడు ఎంపీ మాణికం ఠాగూర్‌ను నియమించింది. ఛార్జ్ తీసుకున్న కొన్ని రోజులకే హైదరాబాద్‌లో నియోజకవర్గ స్థాయి నేతల నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు సమావేశాలు, సమీక్షలతో బిజీబిజీగా గడిపారు. రాబోయే ఎన్నికల కోసం అభిప్రాయాలు సేకరించి, వ్యూహరచన చేశారు. కొత్త ఇన్‌ఛార్జ్‌కు స్వాగతం చెప్పడానికీ, ఆయన దృష్టిలో పడటానికీ కాంగ్రెస్ నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కానీ పార్టీలో క్రియాశీలక స్థానాల్లో ఉన్న విజయశాంతి, అజారుద్దీన్‌లు మాత్రం గాంధీభవన్ వైపు కన్నెత్తి కూడా చూడకపోవడం పార్టీ వర్గాల్లో చర్చకు దారితీసింది.
హస్తం పార్టీకి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరేందుకు...
2018 అసెంబ్లీ ఎన్నికలకు స్టార్ క్యాంపెయినర్‌గా, పార్లమెంట్ ఎన్నికలకు ప్రచార కమిటీ ఛైర్ పర్సన్‌గా ఫైర్ బ్రాండ్ రాములమ్మకు హైకమాండ్ బాధ్యతలు అప్పగించింది. ఆ రెండు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆమె విస్తృత ప్రచారం చేశారు. ఆ తర్వాత నుంచి క్రమంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అడపాదడపా సీఎం కేసీఆర్‌పై సోషల్ మీడియా వేదికగా విమర్శలు, సెటైర్లతో విరుచుకుపడుతున్నారు. అయితే టీపీసీసీ వ్యవహార శైలి వల్లే రాములమ్మ అజ్ఞాతవాసంలో ఉంటున్నారన్నది ఆమె వర్గీయుల వాదన. పార్టీ ప్రచార కమిటీ చైర్ పర్సన్‌గా ఉన్న ఆమెకు ముఖ్యమైన సమావేశాలకూ ఆహ్వానించడం లేదని చెబుతున్నారు. రాష్ట్ర నాయకత్వం తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడంతోనే ఆమె అలకబూనిందంటున్నారు. మరోవైపు ఏఐసీసీ ఇన్‌చార్జ్‌ను కలిసి తన సమస్య చెప్పుకునేందుకు అవకాశం ఉన్నా ఎందుకు ఉపయోగించుకోవడం లేదని పార్టీలో అంతర్గతంగా వినిపిస్తున్న టాక్. అయితే హస్తం పార్టీకి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరేందుకు రాములమ్మ ప్రిపేర్ అవుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ కారణం చేతనే ఏఐసీసీ ఇన్‌ఛార్జ్‌కు ప్రియారిటీ ఇవ్వడం లేదన్న చర్చ సాగుతోంది. కరోనా వైరస్ విజృంభన దృష్ట్యా విజయశాంతి ఎవ్వరినీ కలవడం లేదని ఆమె వర్గీయులు చెప్పుకొస్తున్నారట.
అనధికారికంగా టీఆర్ఎస్‌లో...
ఇక మరో స్టార్ క్యాంపెయినర్ అజారుద్దీన్ కాంగ్రెస్‌లో ఉన్నారో? లేరో సొంత పార్టీ నాయకులకే అర్థం కాని పరిస్థితి. 2018 అసెంబ్లీ ఎన్నికల ముందు మైనార్టీలను ఆకర్షించేందుకు ఆయనకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కట్టబెట్టారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో స్టార్ క్యాంపెయినర్ జాబితాలో చేర్చారు. చాలాకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడైన తర్వాత ఆయన ఎక్కువగా టీఆర్ఎస్ నాయకులకు సన్నిహితంగా ఉంటున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో తరుచూ సమావేశమవుతున్నారు. ఈ తరుణంలో అజారుద్దీన్ గులాబీ గూటికి చేరుతారనే ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. కానీ హెచ్‌సీఏ అభివృద్ధి కోసం కేటీఆర్‌ను కలిసినట్లు ఆయన చెప్పుకొచ్చారు. హెచ్‌సీఏ ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ మద్దతుతోనే ఆయన విజయం సాధించారనే వాదనలున్నాయి. అప్పటినుంచే ఈ క్రికెటర్ టీఆర్ఎస్ జట్టులో అనధికారికంగా చేరిపోయారని పార్టీ నాయకులు చెవులు కొరుక్కుంటున్నారట. తన కుమారుడి వివాహానికి అధికార పార్టీ నేతలను ఆహ్వానించిన అజారుద్దీన్...కాంగ్రెస్ నాయకులకు మాట మాత్రమైనా చెప్పలేదట. ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మాణికం ఠాగూర్‌ను కలిసేందుకు రాకపోవడంతో.. గులాబీ పార్టీకి దగ్గరయ్యారనే అనుమానాలు బలపడుతున్నాయట. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా అజారుద్దీన్ స్థానంలో మరొకరికి అవకాశం కల్పించాలనే డిమాండ్లు వినిపిస్తున్నట్లు సమాచారం.
వివరణ ఇస్తారో.. హ్యాండ్ ఇస్తారో...
ఇక ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మొదటి రెండు రోజుల సమావేశాలకు ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరు కాలేదు. సీఎల్పీ భేటీలో మాత్రం ఇద్దరు నాయకులు పాల్గొన్నారు. దుబ్బాక ఉప ఎన్నిక సన్నాహక సమావేశానికి గైర్హాజరుపై జగ్గారెడ్డిని నేరుగా ప్రశ్నించారట ఠాగూర్. హాజరుకాకపోవడానికి గల కారణాలను ఆయన ఇన్‌ఛార్జ్‌కు వివరణ ఇచ్చుకున్నారట. పీసీసీ చీఫ్‌ను మార్చవద్దని, ఒకవేళ మార్పు అనివార్యమైతే తనకు అవకాశం ఇవ్వాలని తన మనసులో మాట బయటపెట్టారట. మరి స్టార్ క్యాంపెయినర్లు రాములమ్మ, అజారుద్దీన్‌లు మాణికం ఠాగూర్‌కు వివరణ ఇస్తారో లేక హస్తం పార్టీకే హ్యాండ్ ఇస్తారో అని పార్టీలోని కొందరు నాయకులు చెవులు కొరుక్కుంటుండటం కొసమెరుపు.
Updated Date - 2020-10-04T16:21:30+05:30 IST