పాజిటీవ్ కేసుల్లో ఎక్కువ మంది అక్కడి నుంచి వచ్చిన వారే... సీఎం కేసీఆర్
ABN, First Publish Date - 2020-03-27T23:40:43+05:30
విదేశాల నుంచి వచ్చిన వారి నుంచే కరోనా ఇతరులకు సంక్రమించిందని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు.
హైదరాబాద్: విదేశాల నుంచి వచ్చిన వారి నుంచే కరోనా ఇతరులకు సంక్రమించిందని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. అక్కడి నుంచి వచ్చిన వారికి తెలియకుండానే కుటుంబ సభ్యులకు పాకిందన్నారు. రాష్ట్రంలోని 59 పాజిటీవ్ కేసుల్లో ఎక్కువగా విదేశాల వారు, వారి కుటుంబ సభ్యులే ఉన్నారని సీఎం చెప్పారు. కరోనా నిర్ధారణకు విజయ డయాగ్నస్టిక్, అపోలో కేంద్రాలకు ఐసీఎంఆర్ వాళ్లు అనుమతి ఇచ్చారని.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎవరికీ ఇవ్వలేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర ఉన్న సౌకర్యాలు ఉపయోగించుకున్నాకే... ప్రైవేట్ వారి సాయాన్ని తీసుకుంటామన్నారు. అనవసరంగా ఇతరులను నమ్మొద్దన్నారు.
సీసీఎంబీలో రోజుకు 800 మందిని పరీక్షించొచ్చన్నారు. ఐదు కేంద్రాలు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయని.. ఒకటి తాజాగా అందుబాటులోకి వస్తుందన్నారు. ప్రజలను దోపిడీ నుంచి రక్షించడానికి.. ప్రజలకు ఆ దుస్థితి రావొద్దన్న ఉద్దేశంతో.. ప్రభుత్వ సిబ్బందితోనే పరీక్షలు చేయిస్తున్నామన్నారు. సరిపోనప్పుడు ప్రైవేట్ వాళ్లను ఉపయోగించుకుంటామన్నారు.
Updated Date - 2020-03-27T23:40:43+05:30 IST