తెలంగాణలో ఆయుష్మాన్ భారత్
ABN, First Publish Date - 2020-12-31T06:20:21+05:30
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం ఆయుష్మాన్ భారత్‌ను తెలంగాణలో అమలు చేయాలని
ఆరోగ్యశ్రీతో కలిపి రాష్ట్రంలో అమలు
ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం
రెండేళ్ల తరువాత అంగీకరించిన రాష్ట్రం
ప్రధాని మోదీకి తెలిపిన సీఎస్
ఆరోగ్యశ్రీ కింద రూ.5 లక్షలు కవర్
ఆయుష్మాన్ భారత్‌కు రూ.2 లక్షలు
పథకానికి కేంద్రం నుంచి 200 కోట్లు
హైదరాబాద్, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం ఆయుష్మాన్ భారత్‌ను తెలంగాణలో అమలు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ఇప్పటికే అమలవుతున్న ఆరోగ్యశ్రీతో కలిపి కేంద్ర పథకాన్ని అమలు చేయనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలియజేశారు. బుధవారం ప్రధాని నరేంద్రమోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఈ విషయం తెలిపారు.
కాగా, ఆయుష్మాన్ భారత్ పథకం ప్రారంభమైన రెండేళ్ల తర్వాత దాని అమలుకు రాష్ట్ర సర్కారు ముందుకొచ్చింది. కేంద్ర ప్రభ్వుం 2018 సెప్టెంబరు 23న ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రవేశపెట్టింది. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారు దీనికి అర్హులుగా పేర్కొంది. ఆయుష్మాన్ భారత్‌లో ఎంప్యానల్ అయిన ఆస్పత్రుల్లో వీరు రూ.2 లక్షల వరకు ఉచితంగా వైద్య చికిత్సలు పొందవచ్చు. అయితే ఈ పథకంలో చేరేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిన్నటిదాకా అంగీకరించలేదు. ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి రాష్ట్రంలోని 79 లక్షల కుటుంబాలు వస్తుండగా, ఆయుష్మాన్ భారత్ పరిధిలోకి కేవలం 20 లక్షల కుటుంబాలే వస్తాయి. దీనికితోడు ఆరోగ్యశ్రీ కింద ఒక కుటుంబానికి ఏడాదికి రూ.5 లక్షల వరకు ఎంప్యానెల్ ఆస్పత్రుల్లో చికిత్స పొందే అవకాశం ఉండగా, ఆయుష్మాన్‌లో రూ.2 లక్షల వరకు మాత్రమే చికిత్స పొందే వీలుంటుంది. ఈ కారణాల వల్ల కేంద్ర వైద్య పథకంలో చేరేందుకు కేసీఆర్ సర్కారు నో చెప్పింది. అయితే ఆయుష్మాన్ భారత్ పథకం అమలుకు సంబంధించిన సాప్ట్‌వేర్‌ను కేంద్రం ఆరోగ్యశ్రీ నుంచే తీసుకుంది. దాని అమలు విషయంలోనూ ఆరోగ్యశ్రీ సహకారం పొందింది.
రెండు పథకాలు కలిపి అమలు...
ఆయుష్మాన్ భారత్‌ను రాష్ట్రంలో అమలు చేసినా.. ఆరోగ్యశ్రీని కూడా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ కింద 923 జబ్బులకు చికిత్స అందిస్తున్నారు. ఆయుష్మాన్ భారత్‌లో ఇన్ని జబ్బులకు చికిత్స లేదు. ఇక ఆరోగ్యశ్రీలో కిడ్నీ, లివర్, బోన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ లాంటివి చేయడంతోపాటు జీవితకాలం మందులు వంటివి కూడా ఇస్తున్నారు. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.1000 కోట్లు ఖర్చు పెడుతోంది. కానీ, ఆయుష్మాన్ భారత్‌లో ఇటువంటి శస్త్రచికిత్సలు లేవు. అయితే ఈ పథకాన్ని అమలు చేస్తే కేంద్రం నుంచి రాష్ట్రానికి అదనంగా రూ.200 కోట్ల వరకు వస్తాయని వైద్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. కాగా ఆయుష్మాన్ భారత్‌లో చేరడమంటూ ఏమీ ఉండదని, దానిని అమలు చేస్తూనే ఆరోగ్యశ్రీ కూడా ఉంటుందని వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు అంటున్నారు. రెండింటిని కలపి అమలు చేస్తామని చెబుతున్నారు.
అంటే రూ.2 లక్షల కంటే ఎక్కువ ఖర్చు అయ్యే శస్త్రచికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధి కింద అందిస్తారు. ఆలోపు ఉంటే ఆయుష్మాన్ భారత్ కింద వైద్య సేవలందించే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. అయితే రెండింటిని ఒకేసారి అమలు చేసే విషయంలో ప్రాక్టికల్‌గా కొన్ని సమస్యలు ఎదురవుతాయని, వాటిని ఎలా అధిగమించాలనే దానిపై త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందనని అధికారులు అంటున్నారు.
వలస కార్మికులకు వరం....
ఆయుష్మాన్ భారత్‌ను రాష్ట్రంలో అమలు చేయడం వల్ల వలస కార్మికులకు ఎక్కువ ప్రయోజనం చేకూరనుంది. ఆయుష్మాన్ కార్డుతో దేశంలో ఎక్కడైనా ఎంప్యానెల్ ఆస్పత్రిలో వైద్యం చేయించుకునే వీలుండడంతో ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన తెలంగాణ కార్మికులు అక్కడే వైద్యసేవలు పొందవచ్చు. ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులు కూడా తెలంగాణలో ఆయుష్మాన్ భారత్ కార్డుతో వైద్యం పొందవచ్చు.
ఇన్నాళ్లు అమలు చేయనందుకు క్షమాపణ చెప్పాలి: సంజయ్
ఆయుష్మాన్ భారత్‌ను ఇన్నాళ్లు అమలు చేయనందుకు సీఎం కేసీఆర్.. రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఆయుష్మాన్‌ను ఎగతాళి చేసిన సీఎం వైఖరి కారణంగా వేలాది మంది పేదలు కరోనా వ్యాధికి కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకోలేక ప్రాణాలు కోల్పోయారని, వందలాది కుటుంబాలు అప్పుల పాలయ్యాయని ఆరోపించారు. ఆయుష్మాన్ భారత్‌ను అమలు చేయాలని తాము మూడేళ్లుగా కోరుతున్నా కేసీఆర్ పెడచెవిన పెట్టారన్నారు. తాము ఆరోగ్యశ్రీని ఎప్పుడూ వ్యతిరేకించలేదని, అదే సమయంలో దేశవ్యాప్తంగా అమలవుతున్న ఆయుష్మాన్ భారత్‌ను రాష్ట్రంలో కూడా అమలు చేయాలని కోరామని ఆయన తెలిపారు.
Updated Date - 2020-12-31T06:20:21+05:30 IST