నూతన విద్యా విధానానికి శ్రీకారం
ABN, First Publish Date - 2020-10-04T07:59:11+05:30
ఇజ్రాయెల్, జపాన్‌లో మాదిరిగా మన దేశంలోని విద్యావిధానాన్ని మార్చడంతో పాటు ..
ఐటీఐల అభివృద్ధికి ప్రత్యేక చొరవ
మల్లేపల్లిలో మోడల్ ఐటీఐ కాలేజీ
ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
మంగళ్‌హాట్/హైదరాబాద్, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): ఇజ్రాయెల్, జపాన్‌లో మాదిరిగా మన దేశంలోని విద్యావిధానాన్ని మార్చడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపట్టామని కేంద్రం హోంశాఖ సహయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. 32 సంవత్సరాల తరువాత విద్యా విధానంలో మార్పు ప్రారంభమైందని ఆయన పేర్కొన్నారు. మల్లేపల్లిలో రూ.2 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ మోడల్ ఐటీఐ కాలేజీని శనివారం రాష్ట్ర మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించి మాట్లాడారు. దేశంలోని ప్రతి రాష్ట్రం నుంచి ఒక్కో ఐటీఐ కాలేజీని మోడల్ కాలేజీగా తీర్చిదిద్దేందుకు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనులు ప్రారంభించిందన్నారు. 29 రాష్ట్రాల్లో 29 ఐటీఐ మోడల్ కాలేజీలను అందుబాటులోకి తీసుకువస్తున్నామని తెలిపారు. రూ.7 కోట్లు కేంద్రం కేటాయించిన నిధులు, రూ.3 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో మోడల్ కాలేజీలు నిర్మించామని వెల్లడించారు.
రానున్న రోజుల్లో యువత గౌరవంగా జీవించేందుకు మోడల్ ఐటీఐలు మార్గదర్శనం అవుతాయన్నారు. మంత్రులు తలసాని, మహమూద్ అలీ మాట్లాడుతూ 22 ట్రేడ్లు ఉండగా మరో ఆరు ట్రేడ్లను పెంచడం సంతోషంగా ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఐటీఐల అభివృద్ధికి కృషి చేస్తున్నాయని చెప్పారు. 27 ఎకరాల స్థలంలో ఉన్న మల్లేపల్లి ఐటీఐ ప్రాంగణంలో మోడల్ ఐటీఐని అందుబాటులోకి తేవడంతో విద్యార్థులకు మరింత ఉపయోగకరంగా ఉంటుందని వారు పేర్కొన్నారు. మల్టీ నేషనల కంపెనీల సహకారంతో ఐటీఐలో మరిన్ని మార్పులు తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తున్నామని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. కేంద్రం నుంచి ఐటీఐ అభివృద్ధికి నిధులు మంజూరయ్యాయని ఆయన వెల్లడించారు.
బలపడుతున్నాం.. అందుకే టీఆర్‌ఎస్ టార్గెట్
రాష్ట్రంలో బీజేపీ రోజురోజుకూ బలపడుతోందని, అందుకే టీఆర్‌ఎ్‌సకు టార్గెట్ అయిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. టీఆర్‌ఎ్‌సకు ప్రత్యర్థి కాంగ్రెస్ కాదని, బీజేపీయేనని చెప్పారు. జీహెచ్‌ఎంసీ, ఎమ్మెల్సీ ఎన్నికల సన్నద్ధతలో భాగంగా శనివారం పలు నియోజకవర్గాల నాయకులతో ఆయన సమావేశాలు నిర్వహించిన సందర్భంగా మాట్లాడారు. మరోవైపు.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సన్నద్ధతపై కిషన్‌రెడ్డి, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, మంత్రి శ్రీనివాసులు, చింతల రాంచంద్రారెడ్డి తదితరులు ఓ హోటల్‌లో సమావేశమై అంతర్గత సమీక్ష నిర్వహించారు.
Updated Date - 2020-10-04T07:59:11+05:30 IST