మహిళల భద్రతపై రాజీలేదు
ABN, First Publish Date - 2020-10-04T09:53:48+05:30
మహిళల భద్రత విషయంలో రాజీ పడేది లేదని రామగుండం కమిషనరేట్ డీసీపీ(అడ్మిన్) అశోక్‌కుమార్ అన్నారు. కమిషనరేట్
షీ టీంలకు శిక్షణ కార్యక్రమంలో డీసీపీ అశోక్‌కుమార్
జ్యోతినగర్, అక్టోబరు 3: మహిళల భద్రత విషయంలో రాజీ పడేది లేదని రామగుండం కమిషనరేట్ డీసీపీ(అడ్మిన్) అశోక్‌కుమార్ అన్నారు. కమిషనరేట్ పరిధిలోని పెద్దపలల్లి, మంచిర్యాల జిల్లాల షీ టీం ఇన్‌చార్జిలతో పాటు సిబ్బందికి శనివారం ఎన్టీపీసీ ఈడీసీ మిలీనియం హాలులో శిక్షణనిచ్చారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ మహిళలు, చిన్నారుల రక్షణ కోసమే షీ టీంలను ఏర్పాటు చేశామని చెప్పారు. వారిని రక్షించే విషయంలో షీ టీంలు అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. మహిళలపై జరుగుతున్న సైబర్ నేరాలపై షీ టీంలు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. సోషల్ మీడియాలో మహిళలపై వేధింపులు, ఆన్‌లైన్‌లో బ్లాక్ మెయిల్‌లాంటి నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఆయన తెలిపారు. వీటిని అరికట్టేందుకు షీ టీం బృందాలు చురుగ్గా పని చేయాలన్నారు. నేరాల నియంత్రణకు సంబంధించి భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని షీ టీంలకు అవసరమైన మౌలిక సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. సౌకర్యాలు, సాంకేతిక పరంగా ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకు వస్తే వెంటనే పరిష్కరిస్తామన్నారు. చిన్నారులపై జరుగుతున్న అకృత్యాలను అడ్డుకునేందుకు షీ టీంలు మరింత కట్టుదిట్టంగా కృషి చేయాలని సూచించారు.
రాత్రి వేళల్లో నేరాలు ఎక్కువగా జరిగే అవకాశమున్న ప్రాంతాలను గుర్తించి స్థానిక లా అండ్ ఆర్డర్ పోలీసుల సహకారంతో ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించాలన్నారు. ఆకతాయిల ఆట కట్టించడంతోపాటు బాధితులకు అండగా ఉండాలని చెప్పారు. వారిలో మనో ధైర్యాన్ని, ఆత్మ విశ్వాసాన్ని నింపాల్సిన బాధ్యత షీ టీంలపై ఉందని డీసీపీ తెలిపారు. డయల్ 100 ద్వారా వచ్చే కాల్స్ సమాచారాన్ని అధికారులకు అందజేయాలని సూచించారు. కార్యక్రమంలో గోదావరిఖని ఏసీపీ ఉమేందర్, సీఐ సీహెచ్.వెంకటేశ్వర్లు, సీసీఎస్ సీఐలు రమణబాబు, వెంకటేశ్వర్లు, ఎస్‌బీ సీఐ సతీష్, ఐటీ కోర్ ఇన్‌స్పెక్టర్ నరేష్, పీసీఆర్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్, ఎస్సైలు శైలజ, మారుతి, ఇసాక్, చంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-10-04T09:53:48+05:30 IST