పెద్దవాగు పరిసరాల్లో పులి సంచారం
ABN, First Publish Date - 2020-11-27T04:47:03+05:30
పెంచికలపేట మండలం అగర్‌గూడ గ్రామ సమీపంలోని పెద్దవాగు ప్రాంతంలో గురువారం పెద్దపులి కనిపించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.
పెంచికలపేట, నవంబరు 26: పెంచికలపేట మండలం అగర్‌గూడ గ్రామ సమీపంలోని పెద్దవాగు ప్రాంతంలో గురువారం పెద్దపులి కనిపించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. కొందరు యువకులకు పెద్ద వాగు ప్రాంతంలో పెద్ద పులి నీరు తాగుతూ కనిపించడంతో వారు సెల్‌ఫోన్లతో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇటీవల దహెగాం మండలం దిగిడ గ్రామంలో విగ్నేష్ అనే యువకుడిపై పెద్దపులి దాడి చేసి హతమార్చింది. తాజాగా పెంచికలపేట మండలంలో పులి కనిపించడంతో గిరిజన గ్రామాలైన మురలిగూడ, జిల్లెడ, కమ్మర్‌గాం, గుండెపల్లి, అగర్‌గూడ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ విషయమై ఎఫ్‌ఆర్‌వో వేణుగోపాల్‌ను వివరణ కోరగా అగర్‌గూడ పెద్దవాగు ప్రాంతంలో పులి సంచారం నిజమేనని పేర్కొన్నారు. ఈ పులి గతంలో యువకుడిపై దాడి చేసింది కాదని, ఇది స్థానికంగా సంచరించేదేనని తెలిపారు. అడవిలోకి పశువులను మేతకు తీసుకువెళ్లవద్దని పరిసర గ్రామాల ప్రజలకు ఎఫ్‌ఆర్వో సూచించారు.
Updated Date - 2020-11-27T04:47:03+05:30 IST