ప్రజలకు చేరువలో టీబీ నిర్ధారణ సంచార బృందం
ABN, First Publish Date - 2020-12-12T04:50:44+05:30
గ్రామీణ ప్రాంతాలలోని క్షయ వ్యాధిగ్రస్తులు సరైన సమయంలో పరీక్షలు, చికిత్సలు నిర్వహించకుండా ఆశ్రద్ద వహిస్తున్నారని గుర్తించిన ప్రభుత్వం ప్రజలకు చేరువలో క్షయ వ్యాధి నిర్ధారణ సంచార బృందాలను ఏర్పాటు చేసింది.
గ్రామీణ ప్రాంతాలలో పెరుగుతున్న వ్యాధిగ్రస్తులు!!
ఉట్నూర్, డిసెంబరు 11 : గ్రామీణ ప్రాంతాలలోని క్షయ వ్యాధిగ్రస్తులు సరైన సమయంలో పరీక్షలు, చికిత్సలు నిర్వహించకుండా ఆశ్రద్ద వహిస్తున్నారని గుర్తించిన ప్రభుత్వం ప్రజలకు చేరువలో క్షయ వ్యాధి నిర్ధారణ సంచార బృందాలను ఏర్పాటు చేసింది. ఆదిలాబాద్ జిల్లాలోని 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిదిలో 124 ఆరోగ్య ఉప కేంద్రాలు పని చేస్తున్నాయి. క్షయ వ్యాధి గ్రస్తులకు నిరంతరం వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు కావాల్సిన మందులను 104 సంచార బృందాల ద్వారా కావాల్సిన మందులను ప్రతి నెల అందిస్తున్నట్లు గానే కావాల్సిన పరీక్షల కోసం సంచార వాహానాన్ని కూడ ఏర్పాటు చేయడంతో ప్రజలకు వైద్య సేవలు మరింత అందుబాటులోకి వస్తున్నాయి.
అందుబాటులో సీబీనాట్ పరీక్షలు
సంచార క్షయ వ్యాధి నివారణ బృందం ద్వారా ఉపరితిత్తుల్లో వచ్చే క్షయ వ్యాధి కాకుండా ఇతర అవయవాలపై వచ్చే క్షయ వ్యాధిని గుర్తించడానికి సీబీనాట్ పరీక్షలు ఈ సంచార వైద్య బృందంలో అందుబాటులో ఉన్నాయి. ఆర్థిక పరంగా ప్రజలు నష్టపోకుండా ఉండడానికి సీబీనాట్ పరీక్షలతో పాటు ఎక్స్‌రే, తెమడ పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. గత నవంబర్ వరకు ఈ సంవత్సరం 1050 మందికి క్షయ వ్యాధి సోకినట్లు జిల్లా అధికారులు గుర్తించారు. అయితే, గురువారం నార్నూర్‌లో సంచార బృందం ద్వారా 35 మందికి పరీక్షలు నిర్వహించ గా ఐదుగురు క్షయ వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించి వారికి మందులు అందించారు. శుక్రవారం ఉట్నూర్ మండలంలోని దంతన్‌పల్లిలో డాక్టర్ కోవ అనురాధ ఆధ్వర్యంలో వైద్య బృందం 38మందికి పరీక్షలు నిర్వహించగా అందు లో ఐదుగురికి పాజీటివ్ వచ్చినట్లు డాక్టర్ ఈశ్వర్‌రాజ్, కోవ అనురాధలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురికి వైద్య సేవలు అందించారు. శనివారం ఇంద్రవెల్లి, సోమవారం పిట్టబొంగరం, సిరికొండ, 15న బజార్‌హత్నూర్, సోనాల, 16న సిరిచెల్మ, 17న తాంసీ, భీంపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిదిలోని గ్రామాలకు వెళ్లి క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారని అడిషనల్ డీఎంహెచ్‌వో డాక్టర్ కుడిమెత మనోహర్ తెలిపారు. జిల్లా క్షయ వ్యాధి నిర్ధారణ అధికారి ఈశ్వర్‌రాజ్ ఆధ్వర్యంలో ఈ బృందం అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిదిలో క్షయ వ్యాధి పరీక్షలు నిర్వహించడానికి కృషి చేస్తుందని అన్నారు.
Updated Date - 2020-12-12T04:50:44+05:30 IST