ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గడ్డి మందు అక్రమ దందా

ABN, First Publish Date - 2020-07-31T11:15:45+05:30

ప్రమాదకరమైన గ్లైపొసేటట్‌ రసాయనిక మందులు కుమరం భీం జిల్లాను కుప్పలు తెప్పలుగా ముంచెత్తుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జిల్లాలో కుప్పలు తెప్పలుగా గ్లైపొసేట్‌ నిల్వలు

గుజరాత్‌ నుంచి మహారాష్ట్ర మీదుగా భారీగా దిగుమతి

అమ్మకాలపై నిషేధం ఉన్నా దొడ్డిదారిన రైతులకు విక్రయం

ప్రమాదకర క్యాన్సర్‌ కారకాలు

భూమిలో ఏళ్ల తరబడి అవశేషాలు ఉంటాయంటున్న నిపుణులు


(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్‌)

ప్రమాదకరమైన గ్లైపొసేటట్‌ రసాయనిక మందులు కుమరం భీం జిల్లాను కుప్పలు తెప్పలుగా ముంచెత్తుతున్నాయి. కలుపు నివారణ పేరిట ఇప్పటికే గ్లైసిల్‌(బీటీ-3) విత్తనాలను రైతులకు అంటగట్టిన పలువురు స్మగ్లర్లు  ఎంతో హానికరమైన  గ్లైపోసెట్‌ రసాయనాలను అదే రీతిన పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమంగా తెచ్చి రహస్య ప్రాంతాల్లో నిలువ చేసి యథేచ్ఛగా విక్రయాలు జరుపుతున్నారు. కేవలం   పది రోజుల వ్యవధిలోనే జిల్లాలో కనీసం 50 వేల లీటర్లకు పైగా గ్లైపోసెట్‌ రసాయనిక ఎరువుల మందులు దిగుమతి అయినట్లు విశ్వనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ముఖ్యంగా ఆసిఫాబాద్‌, వాంకిడి, జైనూరు, కాగజ్‌నగర్‌, కౌటాల, రెబ్బెన కేంద్రాలుగా ఈ మందు క్రయ విక్రయాలు జరుగు తున్నట్లు అనుమానిస్తున్నారు. వ్యవసాయాధికారులు కూడా ఇదే విషయాన్ని రూడీ చేయడం ఎంతైనా ప్రస్తావనార్హం. గ్లైపోసెట్‌ రసాయనాలను కేవలం జన్యుపరమైన మార్పులు చేసిన విత్తనాలు నాటిన పంటలు మాత్రమే తట్టుకునే పరిస్థితి ఉంది. అయితే కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్న ఈ మందులను రైతులు కలుపును నివారించి ఖర్చు తగ్గిస్తుందన్న గుడ్డి నమ్మకంతో కొనుగోళ్లకు ఎగబడుతుండడంతో వ్యాపారులు భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. 


కొరవడిన నిఘా

రాష్ట్రంలో గ్లైపోసెట్‌ విక్రయాలపై ఆంక్షలు కఠినతరం చేయడంతో అధికారికంగా ఫర్టిలైజర్‌ దుకాణాల్లో ఈమందు విక్రయాలు నిలిచి పోయాయి. అయితే తెర వెనక కొంత మంది వ్యాపా రులు రహస్య ప్రాంతాల్లో గోదాంలను ఏర్పాటు చేసుకుని ఖరీఫ్‌కు ముందే భారీగా గ్లైపోసెట్‌ మందులను నిల్వ చేసినట్లు సమాచారం. గతంలో రాయలసీమలోని కర్నూలు, దక్షిణ తెలంగాణలోని మహబూబ్‌నగర్‌, రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నుంచి  గ్లైపోసెట్‌ మందుల రవాణా జరిగేది. దాంతో వ్యవసాయ శాఖ విజిలెన్స్‌ విభాగం అందించిన సమాచారంతో పోలీసులు, వ్యవసాయాధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించి స్మగ్లర్లను అదుపులోకి తీసుకోవడమే కాకుండా భారీ ఎత్తున నిల్వలను సీజ్‌ చేశారు. అయినా అక్రమ వ్యాపారానికి అలవాటు పడ్డ వ్యాపారులు రూటు మార్చి ప్రస్తుతం గుజరాత్‌ నుంచి మహారాష్ట్ర మీదుగా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని కుమరం భీం, మంచిర్యాల, ఆదిలాబాద్‌ జిల్లాలకు గ్లైపోసెట్‌ను దొడ్డిదారిన దిగుమతి చేసుకుని రహస్యంగా విక్రయాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం ఆసిఫాబాద్‌ పట్టణానికి చెందిన ముగ్గురు వ్యాపారులు కలిసి రెండు లారీల పరిమాణంలో  గ్లైపోసెట్‌ను విదర్భ ప్రాంతం నుంచి దిగుమతి చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇందులో నుంచి ఇప్పటికే జైనూరు, రెబ్బెన, వాంకిడి మండలాలకు వీటిని పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల వాంకిడి మండలంలో ఓ రైతు వద్ద 400 లీటర్లకు పైగా గ్లైపోసెట్‌ పట్టుబడడం అనుమానాలకు ఊతమిస్తోంది. అదేవిధంగా చింతలమానేపల్లి మండలం బాబాసాగర్‌ గ్రామంలో అక్రమంగా నిలువ ఉంచిన 200 లీటర్ల  గ్లైపోసెట్‌ మందును గురువారం రాత్రి దాడులు జరిపి స్వాధీనం చేసుకోవడం జిల్లాలో సాగుతున్న ఈ అక్రమ దందాకు సాక్ష్యంగా నిలుస్తోంది. 


అర లీటరు నుంచి 20 లీటర్ల పరిమాణంలో..

జిల్లాలో గ్లైసిల్‌ సాగు వద్దని అధికారులు చెప్పినా పలువురు రైతులు వారి సూచనలను పాటించలేదు.  పది రోజుల వ్యవధిలోని 50 వేల లీటర్లకు పైగా  గ్లైపోసెట్‌ మందులు జిల్లాలోని నలుమూలలకు దిగుమతి అయినట్లు సమాచారం. ఈనేపథ్యంలో అసలు ఈ గ్లైపోసెట్‌ క్రయ విక్రయాలు ఎలా జరుగుతున్నాయన్న విషయాన్ని ఒకసారి పరిశీ లిద్దాం. జన్యుపరంగా మార్పులు చేసిన పత్తి విత్తనాలను సాగు చేసిన పంట పొలాల్లో ఈ మందులను చల్లినప్పుడు పత్తి మొక్కలు మినహా మిగతా గడ్డి పంటలు రసాయనిక ప్రభావంతో చనిపోతాయి. అలా ఒక పంట కాలం మొత్తం రెండు, నుంచి మూడు దఫాలుగా ఈ మందులు చల్లితే ఆ పొలంలో ఇక గడ్డి మొలవదు. ఒకసారి మందు చల్లితే రసాయనిక గాఢత వల్ల దాని ప్రభావం 21 రోజుల పాటు నేలపై ఉంటుంది. ఫలితంగా మొలిచిన గడ్డి చనిపోవడంతో కొత్తగా గడ్డి మొలిచే పరిస్థితిని నివారిస్తుందని చెబుతున్నారు. ఈ కారణంగానే రైతులు  గ్లైపోసెట్‌ కోసం ఎగబడుతున్నారు. దీన్ని సొమ్ము చేసుకు నేందుకు స్మగ్లర్లు అర లీటరు మొదలుకొని 20 లీటర్ల పరిమాణంలో క్యాన్లలో గ్లైపోసెట్‌ను విక్రయిస్తున్నారు. ఎకరానికి 1.5 లీటరు నుంచి 2 లీటర్ల వరకు చల్లుతున్నారు. ఈ లెక్కన ఒక్కో రైతు రెండు హెక్టార్లకు గాను 7.5 లీటర్ల నుంచి పది లీటర్ల వరకు ఒక దఫాలో చల్లుతున్నారు. ఇలా పంట కాలం ముగిసే సరికి మూడు సార్లు ఈ మందును చల్లాల్సి ఉంటుందని రైతులు చెబుతున్నారు. అంటే దీని ప్రకారం ప్రతియేటా ఒక్క రైతు కనీసం 20 నుంచి 25 లీటర్ల గ్లైపోసెట్‌ను వినియోగిస్తున్నట్లు లెక్క. 


అక్రమార్కులకు కాసుల వర్షం

గ్లైపోసెట్‌ మందుల కోసం డిమాండ్‌ అధికంగా ఉండడం మార్కెట్‌లో అధికారికంగా అందుబాటులో లేకపోవడం అక్రమా ర్కులకు వరంగా మారింది. మహారాష్ట్రలో ఐదు లీటర్ల క్యాన్‌ను రూ.1300కు కొనుగోలు చేసి ఇక్కడ రైతులకు రూ.1800 నుంచి రెండు వేల  రూపాయల వరకు విక్రయిస్తున్నారు. అలాగే మహారాష్ట్రలో 20 లీటర్ల గ్లైపోసెట్‌కు రూ.5,300 ధర పలుకుతుండగా అదే మందు ఇక్కడికి తీసుకువచ్చి రైతులకు రూ.7,600 నుంచి రూ.8వేల వరకు విక్రయిస్తున్నారు. ఇక స్వల్ప పరిమాణంలో అవస రమైన రైతులకు లీటరుకు రూ.500 విక్రయిస్తుంటే అర లీటరు రూ.300 ధర నిర్ణయించి దొడ్డి దారిన విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. 


భూసారానికీ ప్రమాదమే

కలుపు నివారణ కోసం ఉపయోగిస్తున్న గ్లైపో సెట్‌ మందు పర్యావరణానికి తీవ్ర ముప్పు కలగ జేస్తుందని వ్యవసాయ నిపుణులు తేల్చారు. అమె రికా వంటి పాశ్చాత్య దేశాల్లో  గ్లైపోసెట్‌ను ఐదేళ్ల క్రితమే పూర్తిగా నిషేధించగా మన దేశంలో ఇప్పటికీ దీనిపై నిషేధం లేదు. గ్లైపోసెట్‌ వాడకం వల్ల హెర్బి సైడ్‌ నియంత్రణ మాట ఎలా ఉన్నా ఈ మందు ప్రభావంతో ఇతర పంటలు కూడా తీవ్రంగా ప్రభావితమవుతున్నట్లు చెబుతున్నారు. ముఖ్యంగా  గ్లైపోసెట్‌ రసాయనిక గాఢత వల్ల నేలలోని మైక్రో ఆర్గాన్స్‌ దారుణంగా దెబ్బతింటాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా భూసారం తగ్గిపోయి ఈ నేలల్లో ఇతర పంటలు సాగు చేసినప్పుడు రసా యనిక అవశేషాల వల్ల ఆహార పంటలు, కూర గాయల పంటలు కలుషితమై పోయి క్యాన్సర్‌కు దారి తీసే పరిస్థితి అధికమవుతున్నట్లు చెబు తున్నారు. అయితే ఈ మందు విక్రయాలపై తెలం గాణలో నిషేధం ఉన్నప్పటికీ దొడ్డిదారిన రాష్ట్రానికి చేరుతోంది. దీని మూలాలు గుజరాత్‌, మహారాష్ట్రల్లో ఉండగా ఇక్కడి చీకటి వ్యాపారులు ఆయా కంపెనీలకు ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మొక్కుబడిగా లైసెన్స్‌డ్‌ దుకాణాలపై దాడులు నిర్వహించి అధికారులు చేతులు దులుపుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

Updated Date - 2020-07-31T11:15:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising