కారిడార్‌పై కసరత్తు.. హైదరాబాద్ - నాగ్‌పూర్ హైవే పొడగునా పరిశ్రమలు
ABN, First Publish Date - 2020-12-11T05:44:17+05:30
హైదరాబాద్ నుంచి నాగ్‌పూర్ వరకు గల 44వ నంబర్ జాతీయ రహదారి పొడవునా ఇండస్ర్టియల్ కారిడార్‌ను ఏర్పాటు చేసే దిశగా కార్యాచరణ మొదలుకాబోతోంది.
నిర్మల్ , ఆదిలాబాద్ ప్రాంతాలు ఎంపిక
ఇన్వెటిమెంట్ రీజయన్స్, ఇండస్ర్టీయల్ ఏరియాస్‌గా విభజన
ఇరువైపులా టౌన్‌షిఫ్‌లు, లాజిస్టిక్స్ హబ్‌ల ఏర్పాటు
భూముల ఎంపికకు సర్కారు ఆదేశాలు
కేంద్ర సర్కారు భాగస్వామ్యంతో అమలు
టీఎస్‌ఐఐసీ నేతృత్వంలో ప్రతిపాదనలు
నిర్మల్, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి) : హైదరాబాద్ నుంచి నాగ్‌పూర్ వరకు గల 44వ నంబర్ జాతీయ రహదారి పొడవునా ఇండస్ర్టియల్ కారిడార్‌ను ఏర్పాటు చేసే దిశగా కార్యాచరణ మొదలుకాబోతోంది. గతంలోనే రాష్ట్రప్రభుత్వం ఇండస్ర్టియల్ కారిడార్‌పై ప్రతిపాదనలు రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది. అయితే ఇటీవల కేంద్రప్రభుత్వం ఈ ప్రతిపాదనలకు గ్రీన్‌సిగ్నల్ జారీ చేస్తూ యాక్షన్‌ప్లాన్ రూపొందించాలని మార్గదర్శకాలు జారీ చేసింది. మొత్తం ప్రక్రియ తెలంగాణ స్టేట్ ఇండస్ర్టియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్‌కు అప్పజెప్పబోతున్నారు. అయితే ఈ ఇండస్ర్టియల్ కారిడార్‌లో భాగంగా ఏర్పాటు చేయబోయే పరిశ్రమల కోసం నిర్మల్, ఆదిలాబాద్ ప్రాంతాలను ఎంపిక చేశారు. ఈ రెండు ప్రాంతాల పరిధిలోని జాతీయ రహదారికి ఇరువైపులా ఇండస్ర్టియల్ ఏరి యాస్, ఇన్వెస్టిమెంట్ రీజియన్స్ నిర్మించబోతున్నారు. ఇందులో పార్కులు, టౌన్‌షిఫ్‌లు, లాజిస్టిక్స్ హబ్‌లను ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున పారిశ్రామిక , వాణిజ్య పరమైన రంగాలను ప్రోత్సహించనున్నారు. అయితే దీని కోసం గాను నిర్మల్, ఆదిలాబాద్ ప్రాంతాల్లోని జాతీయ రహదారికి ఇరువైపులా అనుకూలమైన భూములను సేకరించేందుకు రంగం సిద్ధం చేయాలంటూ కూడా రాష్ట్రప్రభుత్వం సంబంధిత జిల్లా ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీనికి అనుగుణంగా ప్రభుత్వ భూములు, ప్రైవేటు భూముల అనుకూలతపై సంబంధిత జిల్లా అధికారులు నివేదికలు రూపొందించనున్నారు.
అయితే ఈ ఇండస్ర్టియల్ కారిడార్‌లలో మౌలిక సౌకర్యాలు, రోడ్లు, నీటిసౌకర్యం, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన లాంటి అంశాలపై కూడా ప్రత్యేక నివేదికలు రూపొందించబోతున్నారు. దీంతో పాటు ఇప్పటివరకు ఈ నేషనల్ హైవే రహదారికి ఇరువైపులా కొనసాగుతున్న పరిశ్రమలు, ఇతర వాణిజ్యసంస్థల వివరాలను సైతం సేకరించబోతున్నారు. అవసరం అయితే వీటన్నింటినీ కొత్తగా ఏర్పాటు చేయబోతున్న ఇండస్ర్టియల్ కారిడార్‌లోనే విలీనం చేయాలని భావిస్తున్నారు. కాగా ఇండస్ర్టియల్ కారిడార్ ఏర్పాటైనట్లయితే నిర్మల్ జిల్లా అభివృద్దికి మహర్ధశ పట్టే అవకాశాలున్నాయంటున్నారు. ఈ ప్రాంత అభివృద్దితో పాటు ఇక్కడి యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.
అందుబాటులో అపారమైన వనరులు
ఇదిలా ఉండగా గోదావరినది పరివాహకంలో ఉన్న నిర్మల్ ప్రాంతంలో అపారమైన భూగర్భ వనరులతో పాటు మౌలిక సౌకర్యాలు సైతం పుష్కలంగా ఉన్నాయి. పరిశ్రమల ఏర్పాటుకు ఈ ప్రాంతం ఎంతో అనుకూలంగా ఉన్నప్పటికీ పాలకులు పెద్దగా పట్టించుకోకపోవడం శాపంగా మారుతోంది. ఇండస్ర్టియల్ కారిడార్ ఏర్పాటు పుణ్యంతోనైనా పరిశ్రమలు పెద్దఎత్తున మొదలయ్యే అవకాశాలు ఏర్పడతాయంటున్నారు. నిర్మల్ ప్రాంతానికి 44వ నంబర్‌జాతీయరహదారి, 61, 64వ నంబర్ జాతీయ రహదారులు అనుసంధానమై ఉన్నాయి. కల్యాణ్ టూ నిర్మల్ వరకు గల 64వ నంబర్ జాతీయ రహదారి, నిర్మల్ నుంచి రాయికల్ వరకు 61వ నంబర్ రహదారి 44వ నంబర్ జాతీయ రహదారితో లింకై ఉన్నందున రవాణారంగం పెద్ద ఎత్తున అందుబాటులోకి వచ్చింది. దీంతో కొత్త పరిశ్రమలు ఏర్పాటు అయితే రోడ్డు, రవాణారంగం మరింత తోడ్పాటును అందిస్తోంది. దీంతో పాటు ఇటీవల నిర్మల్ ప్రాంతంలో 400 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్‌ను ఏర్పాటుచేయడంతో కరెంటు సమస్యకు పరిష్కారం లభించింది. పరిశ్రమల ఏర్పాటుకు దీని కారణంగా విద్యుత్ సమస్య ఉండబోదు. అలాగే భూగర్బ జలాలు, గోదావరి జలాల పరివాహకం కారణంగా నీటిసమస్య కూడా తలెత్తదంటున్నారు. ఇటు బాసర, ఆదిలాబాద్, మంచిర్యాలల్లో రైల్వేస్టేషన్‌లు ఉండ డం, అలాగే ప్రధానవాణిజ్య ప్రాంతాలైన నాందేడ్, నాగ్‌పూర్‌లు కూడా సమీపంలోనే ఉండడంతో పారిశ్రామికరంగానికి ఊతం లభిస్తుంది. పరిశ్రమల ఏర్పాటుకు అన్నిరకాల వనరులు అందుబాటులో ఉన్నందున నిర్మల్ ప్రాంతం లో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు ఎంతో అనుకూలంగా ఉంటుందని ఇప్పటికే అధికారులు సైతం నివేదికలు పంపారు.
పుష్కలమైన మానవ వనరులు
నిర్మల్ ప్రాంతంలో వేలాది మంది గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్, డిప్లొమా, టెక్నికల్ గ్రాడ్యుయేట్‌లు అందుబాటులో ఉన్నారు. పోటీ, సంఖ్య కారణంగా వీరికి ఇప్పటి వరకు ఉపాధి అవకాశాలు లభించడం లేదు. చాలామంది ఇక్కడ ఉపాధి అవకాశాలు లభించక గల్ఫ్ దేశాలకు, ఇతర రాష్ర్టాలకు వలసలు వెళుతున్నారు. పరిశ్రమలతో అవసరమయ్యే సంఖ్య కన్నా మానవవనరులు ఇక్కడ అధికంగా అందుబాటులో ఉండడంతో ఉపాధిసమస్యగా మారింది. ఇండస్ర్టియల్ కారిడార్ ఏర్పాటైతే ఇలాంటి వారందరికీ ఉపాధి అవకాశాలు రెట్టింపవుతాయంటున్నారు. నైపుణ్యత కలిగిన కార్మికులు సైతం ఈ ప్రాంతంలో పెద్దసంఖ్యలో ఉన్నారు. వీరితో పాటు చత్తీస్‌ఘడ్, ఆంధ్ర, మహారాష్ట్ర సరిహద్దుల్లో కూడా కూలీలు పెద్ద ఎత్తున అందుబాటులో ఉంటారు. దీని కారణంగా ఓ వైపు ఉపాధిరంగం అభివృద్ధి చెందడమే కాకుండా, వ్యాపార వాణిజ్య రంగాలు సైతం కారిడార్ కారణంగా విస్తరించే అవకాశాలుంటాయంటున్నారు.
సమస్యగా భూ సేకరణ
కాగా ప్రస్తుతం 44వ నంబర్ నేషనల్ హైవేకు ఇరువైపులా భూముల ధరలు ఆకాశానికి చేరుకున్నాయి. రియల్ ఎస్టేట్ కారణంగా ఒక్కసారిగా భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పారిశ్రామిక ఇండస్ర్టియల్ కారిడార్ కోసం భూ సేకరణ జరపాలంటూ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు సంబంధిత అధికార వర్గాల్లో ఆందోళనకు కారణమవుతున్నాయి. ఈ ప్రాంతంలో ప్రభుత్వభూములు ఎక్కువగా అందుబాటులో లేని కారణంగా ప్రైవేటు భూములనే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అయితే నిర్మల్ జిల్లా ఏర్పాటు అయినప్పటి నుంచి ప్రైవేటు భూములు ఖరీదయ్యాయి. ప్రస్తుతం నేషనల్ హైవే చుట్టూ ఎక్కడ చూసినా ఎకరానికి కోటి రూపాయలు తగ్గకుండా ధర పలుకుతుందంటే అతిశయోక్తి కాదు. ప్రభుత్వం మార్కెట్ ధరకు అనుగుణంగా ఇంత పెద్ద మొత్తంలో ధర చెల్లించడం కష్టసాధ్యమేనంటున్నారు. అయితే ప్రాథమికంగా ఇండస్ర్టీయల్ కారిడార్ ఏర్పాటు కోసం అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను మొదట ఎంపిక చేయాలని ఆ తరువాత ప్రైవేటు భూముల వైపు దృష్టి సారించాలని సూచిస్తున్నారు. లేనట్లయితే భూ సేకరణ ప్రక్రియ ఆటంకాలతో ఇండస్ర్టియల్ కారిడార్ ఏర్పాటు వ్యవహారం ఈ మహత్తర ప్రక్రియకు ఆటంకమయ్యే అవకాశాలున్నాయంటున్నారు.
Updated Date - 2020-12-11T05:44:17+05:30 IST