అత్యవసర సేవలకు అంబులెన్స్: కలెక్టర్
ABN, First Publish Date - 2020-12-05T05:41:52+05:30
జిల్లా వైద్య ఆరోగ్య కార్యాలయ ఆవరణలో జోగుఫౌండేషన్ ఆధ్వర్యంలో అందించిన అత్యవసర అంబు లెన్స్‌ను కలెక్టర్ సిక్తాపట్నాయక్ ప్రారంభించారు.
ఆదిలాబాద్‌టౌన్, డిసెంబరు 4: జిల్లా వైద్య ఆరోగ్య కార్యాలయ ఆవరణలో జోగుఫౌండేషన్ ఆధ్వర్యంలో అందించిన అత్యవసర అంబు లెన్స్‌ను కలెక్టర్ సిక్తాపట్నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వెంటిలెటర్ వంటి అత్యాధునిక సౌకర్యం ఉన్న అంబులెన్స్‌ను జోగు ఫౌండేషన్ వారు బహుమతిగా ఇవ్వడం గొప్పవిషయమన్నారు. అత్య వసర సమయంలో ఎవరైనా ఈ అంబులెన్స్‌ను ఉపయోగించుకోవచ్చని, జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నందున ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ పేద ప్రజలకు ఉపయోగంగా ఉంటుందని అత్యాధునిక వెంటిలెటర్ సౌకర్యం ఉన్న అంబులెన్స్‌ను కేటీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని కొనుగోలు చేసి అందించడం జరిగిందని తెలిపారు. కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తగుజాగ్రత్తలు పాటించాలని, పెళ్లిళ్లు నిర్వహణలో జనం పరిమితంగా ఉండేటట్లు చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఆర్.నరేందర్, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో డా.సాధన, డీఐవో డా.విజయసారథి, డీఎంవో శ్రీధర్, డీపీఎం స్వామి, ఏవో విజయ, సూపరింటెండెంట్ వేణుగోపాల్‌రెడ్డి, శ్రీకాంత్ సీనియర్ అసిస్టెంట్, బ్రహ్మానందరెడ్డి ఓఎస్, డీఎంఅండ్‌హెచ్‌ఓ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలి..
ఆదిలాబాద్‌టౌన్, డిసెంబరు4: పల్లె ప్రగతి పనులు, రైతు వేదిక నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ రూరల్ మండలంలోని అంకోలి, వాన్వట్, మామి డిగూడ గ్రామాల్లో పల్లె ప్రగతి కార్యక్రమం కింద చేపడుతున్న పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికల నిర్మాణ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా అంకోలి గ్రామంలో రైతు వేదిక నిర్మాణ పనులను పరిశీలించి మరుగుదొడ్ల పనులను పూర్తి చేయాలన్నారు. అనంతరం అంకోలి, వాన్వట్, మామిడిగూడ గ్రామాలలోని పల్లె ప్రకృతి వనాలను సందర్శించారు. ప్రతి వనంలో 2వేల మొక్కలకు తక్కువ కాకుండా ఉండాలని, మొక్కలను ప్రతి రోజు నీటిని పోయించాలని, వనాలను బోర్డు, గేట్‌లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వనాలలో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి స్థానికులు ఉదయం నడక వ్యాయామం చేసుకునే వీలు కల్పించాలని సూచించారు. గ్రామాల్లో కల్లాల నిర్మాణాల ను వేగవంతం చేసి ఈ నెల 20లోగా శ్మశాన వాటికల నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. నిర్మాణాలకు సంబంధించిన నివేదికలను అప్ లోడ్ చేయాలని పంచాయతీ రాజ్ ఏఈ చంద్రశేఖర్‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి మోహన్, ఎంపీడీవో శివలాల్, ఎంపీవో ఆనంద్, ఏపీఓ, అధికారులు పాల్గొన్నారు.
Updated Date - 2020-12-05T05:41:52+05:30 IST