ఇమ్మర్షన్ హీటర్‌తో బాలింతను కొట్టి చంపాడు
ABN, First Publish Date - 2020-06-01T09:38:17+05:30
ఇమ్మర్షన్ హీటర్‌తో బాలింతను కొట్టి చంపాడు
- ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు... కట్నం కోసం కాటికి పంపాడు
బంజారాహిల్స్, మే 31 (ఆంధ్రజ్యోతి): ప్రేమించానన్నాడు.. పెళ్లి చేసుకున్నాడు.. ఏడాది పాటు బాగా చూసుకున్నాడు.. ఆ తర్వాత కట్నం కోసం వేధించేవాడు. పదేళ్ల తర్వాత కూడా ధోరణిని మార్చుకోకుండా.. బాలింత అయిన ఆ ఇల్లాలిని ఇమ్మర్షన్ హీటర్‌తో కొట్టి చంపాడు. బంజారాహిల్స్ రోడ్ నంబర్-2లోని ఇందిరానగర్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. స్థానికంగా నివసించే రుడావత్ అనిల్ సినిమా సెట్టింగ్‌లలో ఉపయోగపడే వస్తువులను అద్దెకిస్తుంటాడు. వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం గోడమర్రిగడ్డ తండాకు చెందిన అనితను 2009లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి నలుగురు పిల్లలు.
పెళ్లయిన ఏడాది వరకు అనితను బాగానే చూసుకున్న అనిల్.. తర్వాత కట్నం కోసం వేధించడం ప్రారంభించాడు. నెలన్నర క్రితం అనిత ఓ బాబుకు జన్మనిచ్చింది. శనివారం అర్ధరాత్రి తాగొచ్చిన అనిల్.. బాలింత అని కూడా చూడకుండా అనితపై దాడి చేశాడు. పిడిగుద్దుల వర్షం కురిపించాడు. వేడినీళ్లు కాచుకునే ఇమ్మర్షన్ హీటర్‌తో ఆమెను దారుణంగా కొట్టి చంపాడు. ఆమె చనిపోయినట్లు నిర్ధారించుకుని, అక్కడి నుంచి పరారయ్యాడు.
Updated Date - 2020-06-01T09:38:17+05:30 IST