పదేళ్లు అయిపోయింది భయ్యా.. కోహ్లీని వెంటాడుతున్న ఫ్యాన్!
ABN, First Publish Date - 2020-08-22T01:10:41+05:30
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మైదానంలో దిగిన తర్వాత ఎంత దూకుడుగా ఉంటాడో ..
న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మైదానంలో దిగిన తర్వాత ఎంత దూకుడుగా ఉంటాడో అందరీకి తెలుసు. కానీ మీడియాతో, ఫ్యాన్స్‌తో మాత్రం కొన్నేళ్లుగా సంయమనం పాటిస్తూ వస్తున్నాడు. ఏదైనా వివాదం వస్తే వెంటనే స్పందించి వివరణ ఇవ్వడమో... అంతగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేనివాటికి స్పందించకుండా ఉండడమో చేస్తున్నాడు. అయితే అతడి అంతర్జాతీయ కెరీర్ ప్రారంభమైన తొలినాళ్లలో మాత్రం మీడియాతో, జనాలతో కోహ్లీ పదే పదే వివాదాస్పద చర్యలతో వార్తల్లో నిలిచేవాడు. 2011 డిసెంబర్లో భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన సందర్భంగా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఈ టూర్‌లో భారత జట్టు ఘోర పరాజయాల కారణంగా అభిమానుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. దీంతో చెర్రెత్తుకొచ్చిన కోహ్లీ తన చేత్తో వివాదస్పద సైగలు చేస్తూ వార్తల్లో నిలిచాడు. ఇక అప్పటి నుంచి చాలాకాలం పాటు ఈ వివాదం కొనసాగింది.
ఇదే సమయంలో ట్విటర్లో ఇషాన్ అనే ఓ అభిమాని తనను దూషించడంతో కోహ్లీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘‘ఇషాన్.. నీ ట్విటర్ అకౌంట్‌పై ఫిర్యాదు చేశాను. త్వరలోనే అది డియాక్టివేట్ అయిపోతుంది. అసభ్యకరమైన భాషతో ఇకపై ట్వీట్లు చేయకు..’’ అని హెచ్చరించాడు. తర్వాత కోహ్లీ ఈ విషయం మర్చిపోయినా సదరు ఫ్యాన్ మాత్రం మర్చిపోలేదు. సరికదా ప్రతి ఏటా కోహ్లీకి ఈ విషయం గుర్తుచేస్తూనే ఉన్నాడు. ‘‘డీయాక్టివేట్ చేయిస్తానన్నావ్‌గా.. ఇంకా నా అకౌంట్ యాక్టివ్‌గానే ఉంది మరి..’’ అంటూ వెంటపడుతున్నాడు. 2012, 2016, 2017లో ఇదే మాదిరిగా కోహ్లీకి ఈ విషయం గుర్తు చేసిన అతగాడు.. తాజాగా గురువారం మళ్లీ కోహ్లీని పలకరించాడు. ‘‘పదేళ్లు అయిపోయింది కోహ్లీ భయ్యా..’’ అంటూ అతడు ట్వీట్ చేయడంతో ఇప్పుడది వైరల్‌గా మారింది. కోహ్లీ అభిమానులు ఈ స్టార్ బ్యాట్స్‌మన్ రికార్డులను ఏకరువు పెడుతుండగా.. ‘‘వీడు చచ్చేదాకా వదిలేలా లేడు, ఇకనైనా ఆ ట్వీట్ డిలీట్ చెయ్యవయ్యా కోహ్లీ..’’ అంటూ మరికొందరు ఛలోక్తులు విసురుతున్నారు. చూడాలి మరి ఇప్పటికైనా కోహ్లీ స్పందిస్తాడో లేదో!
Updated Date - 2020-08-22T01:10:41+05:30 IST