అంతటా డిజిటల్... అక్కడ మాత్రం నగదు చెల్లింపులా?
ABN, First Publish Date - 2020-05-11T17:15:15+05:30
నగదు మార్పిడితో కోవిడ్-19 వ్యాప్తి చెందే ప్రమాదం ఉండటంతో అన్ని దేశాలు వ్యాపార లావాదేవీల కోసం డిజిటల్ చెల్లింపులను...
చెన్నై: నగదు మార్పిడితో కోవిడ్-19 వ్యాప్తి చెందే ప్రమాదం ఉండటంతో అన్ని దేశాలు వ్యాపార లావాదేవీల కోసం డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తున్న విషయం విదితమే. అయితే చెన్నైలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ఒకప్పుడు కార్డులు,ఇతర చెల్లింపు పద్ధతులను అంగీకరించే పలు దుకాణాలు, సూపర్ మార్కెట్లు ఇప్పుడు నగదు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇది వినియోగదారులకు పెద్ద సమస్యగా పరిణమించింది. ఈ సందర్భంగా మడిపక్కంలో డిపార్ట్‌మెంటల్ స్టోర్ నడుపుతున్న కన్నన్ మాట్లాడుతూ నగదు ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుందనే భయం ఉన్నప్పటికీ, తమ స్టోర్‌కు సరుకు సరఫరా చేసే చాలా మంది డీలర్లు, స్టాకిస్టులు నగదు రూపంలో చెల్లింపులు కోరుతున్నారని తెలిపారు. ఏటీఎం నుంచి నగదు ఉపసంహరించుకోవడం చాలా శ్రమతో కూడుకున్న ప్రక్రియ అని పేర్కొన్నారు. గూగుల్ పే, పేటీఎమ్ ఇతర డిజిటల్ చెల్లింపులు ఉన్నప్పటికీ చిన్న షాపులు, కూరగాయల విక్రేతలు కూడా నగదు చెల్లింపులనే కోరుతున్నారని పలువురు మహిళలు వాపోతున్నారు. దుకాణాలతోపాటు అన్నిచోట్లా కార్డు చెల్లింపులను అంగీకరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
Updated Date - 2020-05-11T17:15:15+05:30 IST