ప్లాస్మా థెరపీని నిలిపివేసిన అమెరికా !
ABN, First Publish Date - 2020-08-22T13:49:03+05:30
అత్యవసర పరిస్థితుల్లో కొవిడ్-19 చికిత్సకు ప్లాస్మా థెరపీని వాడవచ్చంటూ గతంలో ఇచ్చిన అనుమతులను అమెరికా ఆహార,ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) నిలుపుదల చేసింది.
అత్యవసర చికిత్సకు ఇచ్చిన అనుమతుల నిలుపుదల
వాషింగ్టన్, ఆగస్టు 21: అత్యవసర పరిస్థితుల్లో కొవిడ్-19 చికిత్సకు ప్లాస్మా థెరపీని వాడవచ్చంటూ గతంలో ఇచ్చిన అనుమతులను అమెరికా ఆహార,ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) నిలుపుదల చేసింది. గతంలో ఈ పద్ధతిలో అత్యవసర చికిత్సకు అమెరికా పచ్చజెండా ఊపగానే.. భారత్ సహా మరెన్నో దేశాలు దాని బాటలోనే పయనించాయి.
‘‘కరోనా రోగులపై ప్లాస్మా థెరపీ ప్రభావవంతంగా పనిచేస్తోందనేందుకు ప్రాతిపదికగా నిలిచే గణాంకాలేవీ లేవు’’ అంటూ ఎఫ్‌డీఏ ఇప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకుంది. దీంతో దాన్ని అనుసరించిన దేశాలన్నీ పునరాలోచనలో పడ్డాయి. భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) చొరవచూపి ఏప్రిల్‌లోనే పలుచోట్ల ప్లాస్మా థెరపీకి సంబంధించిన ప్రయోగ పరీక్షలను ప్రారంభించింది. అయితే దానికి సంబంధించిన ఫలితాలను బహిరంగపర్చాల్సిన కీలక తరుణంలో ప్లాస్మా థెరపీ నిలుపుదలకు అమెరికా నిర్ణయించడం గమనార్హం.
‘భారత్‌లో నిర్వహించిన ప్లాస్మా థెరపీ ప్రయోగ పరీక్షల్లో సానుకూల ఫలితాలు రాలేదు’ అంటూ ఓ ప్రముఖ ఆంగ్ల వార్తాపత్రిక ఇటీవల ఓ కథనాన్ని ప్రచురించింది. ఈనేపథ్యంలో కొంచెం కూడా ఆలస్యం చేయకుండా ఆ ఫలితాలను ప్రజల ముందు ఉంచాల్సిన బాధ్యత ఐసీఎంఆర్‌పై ఉందని ఆరోగ్యరంగ నిపుణులు సూచిస్తున్నారు.
ఇక కరోనా చికిత్స కోసం ప్లాస్మా థెరపీ వాడకం బాగా పెరగొచ్చనే భారీ అంచనాల నడుమ దేశంలో పలుచోట్ల ప్లాస్మా బ్యాంకులు కూడా ఏర్పాటయ్యాయి. ఒకవేళ ఐసీఎంఆర్ ప్రయోగ పరీక్షల నివేదిక కూడా ప్లాస్మా థెరపీకి వ్యతిరేకంగా వస్తే.. వాటి భవితవ్యం ప్రశ్నార్ధకంగా మారనుంది.
కాగా, ప్లాస్మా థెరపీ చేయించుకున్న కరోనా రోగుల ఆరోగ్య నివేదికలను ఎఫ్‌డీఏ మరింత సమగ్రంగా పరిశీలించి, భవిష్యత్తులో మళ్లీ అనుమతులిచ్చే అవకాశాలూ ఉన్నాయని ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్’ క్లినికల్ డైరెక్టర్ క్లిఫర్డ్ లేన్ పేర్కొన్నారు.
Updated Date - 2020-08-22T13:49:03+05:30 IST