ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైట్‌హౌస్‌ ఫైట్‌.. అమెరికా అధ్యక్ష పీఠానికి నేడే పోలింగ్‌

ABN, First Publish Date - 2020-11-03T10:13:57+05:30

హోరాహోరీగా సాగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం ముగిసింది. మంగళవారంనాడే పోలింగ్‌. అయితే మెయిల్‌, ముందస్తు ఓటింగ్‌ ద్వారా ఇప్పటికే 9.2 కోట్ల మంది ఓట్లు వేసేశారు. ఇది మొత్తం రిజిస్టర్డ్‌ ఓటర్లలో 38 శాతం. దాదాపు 24 కోట్ల మంది రిజిస్టర్డ్‌ ఓటర్లున్న అమెరికాలో 65 శాతానికి పైగా శ్వేతజాతీయులు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • మెయిల్‌ ద్వారా, నేరుగా ఓటు వేసేందుకు అవకాశం
  • మొత్తం ఓటర్లు 24 కోట్లు.. ఇప్పటికే ఓటేసిన 9.2 కోట్లమంది
  • బైడెన్‌లో ధీమా.. ట్రంప్‌లో ఆశలు, ఆందోళన.. ప్రపంచమంతా ఆసక్తి
  • స్వింగ్‌ స్టేట్స్‌లో హోరాహోరీ.. ఫలితాలు ఆలస్యమయ్యే అవకాశం
  • భారతీయ అమెరికన్లు కీలకం.. రెండు పార్టీల వైపు మోహరింపు

వాషింగ్టన్‌, నవంబరు 2: హోరాహోరీగా సాగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం ముగిసింది. మంగళవారంనాడే పోలింగ్‌. అయితే మెయిల్‌, ముందస్తు ఓటింగ్‌ ద్వారా ఇప్పటికే 9.2 కోట్ల మంది ఓట్లు వేసేశారు. ఇది మొత్తం రిజిస్టర్డ్‌ ఓటర్లలో 38 శాతం. దాదాపు 24 కోట్ల మంది రిజిస్టర్డ్‌ ఓటర్లున్న అమెరికాలో 65 శాతానికి పైగా శ్వేతజాతీయులు. హిస్పానిక్స్‌, ఆసియన్లు, ఆఫ్రో అమెరికన్లు, ఐరోపా దేశాలవారు, ఇతర వలసదారులు మిగిలిన ఓటర్లు. వీరంతా 538 మంది ప్రతినిధులను (ఎలక్టోరల్‌ కాలేజీ సభ్యులు- ఎలక్టర్స్‌)ని ఎన్నుకుంటారు. ఈ ఎలక్టర్స్‌ కూడా డెమొక్రాట్‌, రిపబ్లికన్‌ పార్టీలు నియమించిన వారే.  మేజిక్‌ ఫిగర్‌ 270. అంటే ఎలక్టోరల్‌ కాలేజీలో 270 ఓట్లు సాధించిన వ్యక్తి అధ్యక్షుడవుతారు. అమెరికా అధ్యక్షపీఠాన్నే కాక, ప్రపంచ రాజకీయాలను కూడా గట్టిగా ప్రభావితం చేసే ఈ ఎన్నికలు ఓ రకంగా అగ్రరాజ్యం సంక్షోభ స్థితిని ఎదుర్కొంటున్న దశలో జరుగుతున్నాయి. కొవిడ్‌ మహమ్మారి దేశం యావత్తునూ కమ్మేసి ప్రజలు బయట తిరుగాడలేని స్థితిలో ఈ ప్రక్రియ సాగుతోంది.


మెయిల్‌ బ్యాలెటింగ్‌ వైపు మొగ్గడానికి కారణం కూడా ఇదే!

ప్రచారఘట్టం చివర్రోజైన సోమవారం డొనాల్డ్‌ ట్రంప్‌ (74), జో బైడెన్‌ (78)ఉధృతంగా ప్రభావ రాష్ట్రాలు (స్వింగ్‌ స్టేట్స్‌)లో సభల్లో మాట్లాడారు. రియల్‌ క్లియర్‌ పాలిటిక్స్‌ సర్వే ప్రకారం- ఇద్దరి మధ్యా ఈ ప్రభావ రాష్ట్రాల్లో తేడా కేవలం 3.7 శాతం ఓట్లే. ముఖ్యంగా  ఫ్లోరిడా (1.4 శాతం), నార్త్‌ కరోలినా (0.3శాతం), అరిజోనా (1.2శాతం) ల్లో బాగా తక్కువగా ఉన్నట్లు బీబీసీ తెలిపింది. మిగిలిన వాటిలో కూడా ఇద్దరి మధ్య ఓట్ల శాతంలో తేడా 5-6 శాతం కంటే ఎక్కువ లేదు. అందుకే ఈ ఎన్నికల్లో ఎక్కువమంది ఓటర్లు ఓటెయ్యాలని, అదే తనను గెలిపిస్తుందని ట్రంప్‌ నమ్ముతున్నారు. గతంలో బరాక్‌ ఒబామా కింద ఉపాధ్యక్షుడిగా పనిచేసిన  జో బైడెన్‌ విజయం తనదేనన్న ధీమాలో ఉన్నారు. మొత్తం 50 రాష్ట్రాలకు గాను- రెండు మినహా అన్ని రాష్ట్రాల్లో జరిపిన దాదాపు అన్ని సర్వేలూ ఆయనకు ట్రంప్‌ కంటే కనీసంలో కనీసం  8 శాతం ఆధిక్యత కట్టబెట్టాయి. అందుకే ఆయన ఆఖరిరోజున కేవలం పెన్సిల్వేనియా, ఒహాయోల్లో మాత్రమే మాట్లాడారు.  


తాను జన్మించిన పెన్సిల్వేనియాలో నువ్వా-నేనా అన్న పరిస్థితి ఉండడంతో బైడెన్‌ దీనిపై ఎక్కువగా దృష్టిపెట్టారు. రిపబ్లికన్‌ ఉపాధ్యక్ష అభ్యర్థిగా ప్రస్తుత ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ బరిలో ఉండగా, కమలా హారిస్‌ డెమొక్రట్ల తరఫున వైస్‌ ప్రెసిడెంట్‌ పదవికి పోటీపడుతున్నారు. ఏటికి ఎదురీదుతున్న ట్రంప్‌- నార్త్‌ కరోలినా, మిచిగన్‌, విస్కాన్‌సన్‌, పెన్సిల్వేనియాల్లో సుడిగాలిలా తిరిగారు. ఈ నాలుగింటిలో నాలుగేళ్ల కిందట హిల్లరీ కంటే ట్రంప్‌కే ఎక్కువ ఎలక్టోరల్‌ ఓట్ల్లు వచ్చాయి. ఆర్థికరంగంలో, అక్రమ వలసలు అడ్డుకొనే విషయంలో తన విజయాలను ట్రంప్‌ పదేపదే వల్లెవేశారు. కొవిడ్‌ సహా అన్ని రంగాల్లో ట్రంప్‌ వైఫల్యాలను బైడెన్‌ తన ప్రచార సభల్లో వినిపించారు. ప్రజాస్వామ్య హననం, శాంతిభద్రతలు అదుపుతప్పడం, నైపుణ్యమున్న విద్యావేత్తలు రాకుండా చేయడం ట్రంప్‌ పాలనలో మాయని మచ్చని బైడెన్‌ దుమ్మెత్తారు. ఈసారి బైడెన్‌-కమలా హారిస్‌ ఎక్కువగా నిర్దిష్ట ప్రచారసభల్లో పాల్గొనకుండా డ్రైవ్‌-ఇన్‌ ర్యాలీల్లో (అంటే రోడ్‌ షోలు) పాల్గొనడం విశేషం. తద్వారా కొవిడ్‌ వ్యాప్తిని తాను తగ్గించగలిగానని ఆయన చెబుతూ వచ్చారు. 


భారతీయ ఓటర్ల ర్యాలీ

ట్రంప్‌కు మద్దతుగా హ్యూస్టన్‌లో వందల మంది భారతీయ అమెరికన్లు పెద్ద కార్‌ ర్యాలీ తీశారు. మైళ్ల పొడవున ట్రంప్‌ ఫొటోతో ఉన్న కార్లు బారులు తీరడం కనిపించింది. అనేక మంది టెకీలను తీవ్రంగా దెబ్బతీసిన కొత్త ఇమిగ్రేషన్‌, హెచ్‌1బీ నిబంధనలపై ఆగ్రహంగా ఉన్న భారతీయ అమెరికన్లు ట్రంప్‌పై ఆగ్రహంగా ఉన్నారు. కనీసం 68 శాతం మంది బైడెన్‌కు అనుకూలంగా, 32 శాతం మంది మాత్రమే ట్రంప్‌కు మద్దతుగా ఉన్నట్లు ఓ సర్వే వెల్లడించింది.   కొవిడ్‌ ఉధృతి ఈ ఎన్నికల ఫలితాల్ని శాసిస్తుందని దాదాపుగా అన్ని సర్వేలూ తేల్చాయి.


రోజుల తరబడి కౌంటింగ్‌..?

పోలింగ్‌ జరిగే రోజు రాత్రి అంటే నవంబరు 3 రాత్రే (భారత కాలమానం ప్రకారం 4వ తేదీ ఉదయం) ఫలితాలు వెల్లడి కాకపోవచ్చని, కొన్ని రోజులు లేదా వారాలు కూడా పట్టొచ్చని అంటున్నారు. ట్రంప్‌కు అసహనం తెప్పిస్తున్న అంశం ఇదే. ముందస్తు బ్యాలెట్లలో అత్యధికం బైడెన్‌కు అనుకూలంగా ఉన్నట్లు కొన్ని సర్వేలు వెల్లడించడంతో ఆయన మండిపడుతున్నారు. 


ఎన్నారైలు ఎటు వైపు?

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ అమెరికన్లు కీలకంగా మారారు. ఆ దేశంలో మొత్తం రిజిస్టరైన 25,52,00,373 మంది ఓటర్లలో వీరు 19 లక్షల మంది మాత్రమే అయినప్పటికీ.. ప్రస్తుత రాజకీయాలు, ప్రచారమంతా వీరే కేంద్రంగా నడుస్తున్నాయి. మంగళవారం పోలింగ్‌ జరగనున్న నేపథ్యంలో పాలక రిపబ్లికన్‌ పార్టీ, విపక్ష డెమోక్రటిక్‌ పార్టీ రెండూ కీలక నేతలను రంగంలోకి దించి హోరాహోరీగా ప్రచారం చేయిస్తున్నారు. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, విపక్ష అభ్యర్థి జో బైడెన్‌ తమ ప్రసంగాల్లో భారతీయుల ప్రస్తావన తీసుకురాని సందర్భమే ఉండడం లేదు. పైగా రెండు పార్టీలకు భారతీయ అమెరికన్లే భారీగా విరాళాలు ఇస్తున్నారు. అమెరికాలో స్థిరపడిన మెక్సికన్‌ అమెరికన్ల తర్వాత అతిపెద్ద సమూహం భారతీయులే. 2016 ముందు వరకు వారిలో అధిక శాతం డెమోక్రటిక్‌ పార్టీకి మద్దతిస్తూ వచ్చారు. 2016లోనూ ఆ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు వారు దన్నుగా నిలబడినప్పటికీ.. ట్రంప్‌కు మద్దతిచ్చినవారి సంఖ్య కూడా భారీగా పెరిగింది. 


అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక ట్రంప్‌.. డెమోక్రటిక్‌ మద్దతుదార్లలో చీలిక తేవడంలో కొంతవరకు సఫలమయ్యారు. భారత ప్రధాని మోదీతో సత్సంబంధాలు నెరపడం.. ఆయనతో కలిసి నిరుడు హ్యూస్టన్‌లో భారీ స్థాయిలో ‘హౌడీ మోదీ’, మళ్లీ ఈ ఏడాది ఫిబ్రవరిలో అహ్మదాబాద్‌లో ‘నమస్తే ట్రంప్‌’ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా భారతీయ అమెరికన్లకు చేరువయ్యేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇది గ్రహించిన తర్వాతే బైడెన్‌ తన ఉపాధ్యక్షురాలిగా భారతీయ సంతతికి చెందిన కమలా హారి్‌సను ఎంపిక చేశారు. 2012 వరకు భారతీయులు అమెరికాలో బలీయమైన శక్తిగా లేరు. తర్వాత ఆర్థికంగా పుంజుకున్నారు.  2016లో అధ్యక్ష ఎన్నికల సందర్భంగా వారు డెమోక్రాటిక్‌ పార్టీకి ఏకంగా కోటి డాలర్లు విరాళంగా ఇచ్చారు. 


ఈ సారి అది 2.5 కోట్ల డాలర్లకు చేరడం గమనార్హం. ఒక్క  సెప్టెంబరులోనే బైడెన్‌ ఎన్నికల నిధికి వారు 33 లక్షల డాలర్లు ఇచ్చారు. ఇక రిపబ్లికన్లకు కూడా 2 కోట్ల డాలర్ల వరకు విరాళాలు అందినట్లు సమాచారం.  భారతీయ అమెరికన్ల ఓట్ల కోసం రెండు పార్టీలు పెద్దఎత్తున టీవీల్లో ప్రకటనలు ఇస్తున్నాయి.  ప్రస్తుతం కాలిఫోర్నియా సెనేటర్‌ అయిన కమలా హ్యారిస్‌.. భారతీయ అమెరికన్ల మద్దతు కూడగట్టడంలో సఫలమయ్యారని సర్వేలు చెబుతున్నాయి. 72 శాతం మంది బైడెన్‌ను సమర్థిస్తున్నారని ‘యుగవ్‌’ సర్వే ఇటీవల వెల్లడించింది.     

    - సెంట్రల్‌ డెస్క్‌

Updated Date - 2020-11-03T10:13:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising