ఫలితాలపై ట్రంప్ అనుమానాలు.. ఎన్నికల అధికారుల కీలక ప్రకటన!
ABN, First Publish Date - 2020-11-13T21:38:20+05:30
అమెరికా ఫలితాలు వెల్లడై రోజులు గడుస్తున్నా డొనాల్డ్ ట్రంప్ మాత్రం తన ఓటమిని అంగీకరించడం లేదన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అమెరికా ఫెడరల్, స్టేట్ ఎలక్షన్ సీనియర్ అధికారులు గు
వాషింగ్టన్: అమెరికా ఫలితాలు వెల్లడై రోజులు గడుస్తున్నా డొనాల్డ్ ట్రంప్ మాత్రం తన ఓటమిని అంగీకరించడం లేదన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అమెరికా ఫెడరల్, స్టేట్ ఎలక్షన్ సీనియర్ అధికారులు గురువారం రోజు కీలక ప్రకటన చేశారు. వారు చేసిన ప్రకటనలో ఏముందన్న విషయానికి వెళితే.. అమెరికాలో తాజాగా జరిగిన ఎన్నికలు, వాటి ఫలితాలపై ట్రంప్, ఆయన ప్రచారం బృందం చేస్తున్న ఆరోపణలకు ఎటువంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు.
అమెరికాలో నవంబర్ 3న జరిగిన ఎన్నికలను ఆ దేశ చరిత్రలో జరిగిన అత్యంత సురక్షిత ఎన్నికలుగా వారు అభివర్ణించారు. ‘ఎన్నికల్లో అక్రమాలు జరిగాయనడానికి గానీ.. ఓట్లను మార్చారు అని అనడానికి గానీ ఎటువంటి ఆధారాలు లేదు. అమెరికా ఎన్నికల ప్రక్రియపై అనేకమైన నిరాధారమైన వాదనలు ఉన్నాయన్న విషయం మనకు తెలిసిందే. మన ఎన్నికలు నిజాయితీగా జరుగుతున్నాయని హామీ ఇస్తున్నాం. ఎన్నికల ప్రక్రియను విశ్వసించండి. దేశ చరిత్రలోనే అత్యంత సురక్షితంగా నవంబర్ 3న ఎన్నికలు జరిగాయి’ అని ప్రకటనలో పేర్కొన్నారు. ఎలక్షన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ కోఆర్డినేటింగ్ కౌన్సిల్, సైబర్ సెక్యూరిటీ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ఏజెన్సీలు ఈ ప్రకటనను విడుదల చేశాయి. ఈ ప్రకటనపై యూఎస్ ఎలక్షన్ అసిస్టెన్స్ కమిషన్ ఛైర్మన్‌తో పాటు కొంతమంది ఇతర అధికారులు సంతకం చేశారు. ఇదిలా ఉంటే.. ఈ ప్రకటన వెలువడిన తర్వాత కూడా డొనాల్డ్ ట్రంప్.. తన వైఖరి మార్చుకోలేదు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, దేశ వ్యాప్తంగా తనకు పోలైన 2.7 మిలియన్ ఓట్లు డిలీట్ అయ్యాయని ఆరోపిస్తూ ట్వీట్ చేశారు.
Updated Date - 2020-11-13T21:38:20+05:30 IST