'కరోనా' ఆంక్షల నేపథ్యంలో.. యూకే వెళ్లలేక.. ఎన్నారై ఆత్మహత్య !
ABN, First Publish Date - 2020-04-23T03:47:17+05:30
కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు గత నెల రోజులుగా దేశవ్యాప్తంగా ప్రయాణాలపై ఆంక్షలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా భారత ప్రభుత్వం జాతీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను సైతం రద్దు చేసింది. ఇప్పుడు ఇదే ఓ ఎన్నారై ప్రాణాలు తీసింది.
జలంధర్: కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు గత నెల రోజులుగా దేశవ్యాప్తంగా ప్రయాణాలపై ఆంక్షలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా భారత ప్రభుత్వం జాతీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను సైతం రద్దు చేసింది. ఇప్పుడు ఇదే ఓ ఎన్నారై ప్రాణాలు తీసింది. విమాన సర్వీసులు నిలిచిపోవడంతో తాను అనుకున్న సమయానికి తిరిగి బ్రిటన్ వెళ్లలేనని మనస్తాపం చెందిన ఎన్నారై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన మంగళవారం పంజాబ్ రాష్ట్రం జలంధర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... పంజాబ్ రాష్ట్రం జలంధర్‌లోని రమమండిలోగల కాకి పింద్‌కు చెందిన అమర్జీత్ సింగ్(72) యూకేలో స్థిరపడ్డాడు. అతని ముగ్గురు పిల్లలు కూడా అక్కడే సెటిల్ అయ్యారు. వారికి బ్రిటన్ పౌరసత్వం కూడా ఉంది.
అయితే, ఫిబ్రవరి 29న అమర్జీత్ తన భార్య బల్బీర్ కౌర్(68)తో కలిసి స్వదేశానికి వచ్చాడు. మార్చిలో అతను తిరిగి బ్రిటన్ వెళ్లాల్సింది. కానీ మార్చి 23 నుంచి దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలులోకి వచ్చింది. దీంతో అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. తాజాగా లాక్‌డౌన్‌ను మళ్లీ మే 3 వరకు పొడిగించారు. ఈ నేపథ్యంలో తాను తిరిగి యూకే వెళ్లలేనని మనస్తాపం చెందిన అమర్జీత్ సింగ్ మంగళవారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్వస్థలమైన కాకి పింద్‌లోని తన నివాసంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం రాత్రి పడుకునే ముందు యూకేలోని తన పిల్లలతో మాట్లాడిన అమర్జీత్ మంగళవారం ఉదయం సూసైడ్ చేసుకున్నాడని భార్య బల్బీర్ కౌర్ తెలిపింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ గుర్సిమ్రత్ సింగ్ వెల్లడించారు. కాగా, అమర్జీత్ సింగ్ వద్ద ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు.
Updated Date - 2020-04-23T03:47:17+05:30 IST