హెచ్-1బీ లాటరీ పద్ధతికి స్వస్తి
ABN, First Publish Date - 2020-10-30T10:19:38+05:30
అమెరికన్లకు ఉద్యోగ భద్రత కల్పించేందుకు గత కొన్నాళ్లుగా హెచ్-1బీ వీసాల జారీలో పలు కఠిన నిబంధనలు తీసుకొస్తున్న డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఆదిశగా మరో ప్రతిపాదన చేసింది. హెచ్-1బీ వీసాల జారీలో అమలులో ఉన్న కంప్యూటరైజ్డ్ లాటరీ పద్ధతిని రద్దుచేయాలని ట్రంప్ సర్కార్..
- రద్దుచేస్తూ ట్రంప్ సర్కార్ ప్రతిపాదనలు
- ఆర్ధికవ్యవస్థ బలోపేతమవుతుందంటున్న అధికారులు
- స్థానిక ఉద్యోగులకు భద్రత లభిస్తుందన్న సర్కార్
వాషింగ్టన్, అక్టోబరు 29: అమెరికన్లకు ఉద్యోగ భద్రత కల్పించేందుకు గత కొన్నాళ్లుగా హెచ్-1బీ వీసాల జారీలో పలు కఠిన నిబంధనలు తీసుకొస్తున్న డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఆదిశగా మరో ప్రతిపాదన చేసింది. హెచ్-1బీ వీసాల జారీలో అమలులో ఉన్న కంప్యూటరైజ్డ్ లాటరీ పద్ధతిని రద్దుచేయాలని ట్రంప్ సర్కార్ ప్రతిపాదించింది. ఈమేరకు కొత్త ప్రతిపాదనకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఫెడరల్ రిజిస్టర్లో నోటిఫైచేసింది. ఈ నోటిఫికేషన్‌పై 30 రోజుల్లోగా స్పందనలు తెలియచేయాలని కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ హోంలాండ్ సెక్యూరిటీ (డీహెచ్‌ఎ్‌స) కోరింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్నవేళ ట్రంప్ సర్కార్ లాటరీ రద్దు ప్రతిపాదనను తెరమీదకు తీసుకురావడం విశేషం. కొత్త ప్రతిపాదన అంగీకారం పొందితే ఎక్కువ వేతనాలు లభించే, అధిక నైపుణ్యం గల ఉద్యోగులకే పెద్దపీట వేసేలా వీసాల జారీప్రక్రియ ఉండనుంది.
తాజా నిబంధన వల్ల ప్రతిభ ఉన్నవారు మాత్రమే అమెరికాకు వచ్చే వీలుంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం అవుతుందని, స్థానిక అమెరికన్లకు మరింత భద్రత లభిస్తుందని డీహెచ్‌ఎ్‌స వర్గాలు చెప్పాయి. ప్రతిఏడాది హెచ్1-బీ వీసాల కోసం లక్షల సంఖ్యలో దరఖాస్తులు వచ్చినా... కంప్యూటర్ ఆధారిత లాటరీ పద్ధతి ద్వారా 65 వేల దరఖాస్తులను మాత్రమే ఎంపికచేసి వీసాలు జారీచేస్తుంటారు. దీని ద్వారా అమెరికా కంపెనీలు చౌకగా లభించే విదేశీ ఉద్యోగులను తీసుకుంటుండడంతో స్థానికులకు అవకాశాలు దక్కడంలేదని ట్రంప్ ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. దీనిని దృష్టిలో పెట్టుకునే వీసాల జారీలో భారీ సంస్కరణలు చేపడుతోంది. కాగా, హెచ్1-బీ, ఎల్-1 వీసాల జారీని డిసెంబరు 31 వరకు తాత్కాలికంగా నిషేధించిన సంగతి తెలిసిందే.
Updated Date - 2020-10-30T10:19:38+05:30 IST