ట్రంప్ ఓటమి కోసం రూ. 750 కోట్లు ఖర్చు చేస్తున్న బిలియనీర్
ABN, First Publish Date - 2020-09-14T09:02:09+05:30
ప్రపంచ కుబేరులలో ఒకరైన మైఖేల్ బ్లూమ్‌బర్గ్ డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్
వాషింగ్టన్: ప్రపంచ కుబేరులలో ఒకరైన మైఖేల్ బ్లూమ్‌బర్గ్ డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ ఎన్నికల ప్రచారం కోసం కనీసం 100 మిలియన్ డాలర్లు(రూ. 734 కోట్లు) ఖర్చు చేయాలని నిర్ణయించుకున్నారు. డెమొక్రటిక్ పార్టీ నుంచి అధ్యక్ష రేసులో నిలబడి మైఖేల్ బ్లూమ్‌బర్గ్ 100 కోట్ల డాలర్లు(రూ. 7,347 కోట్లు) ఖర్చుపెట్టారు. ఆ తర్వాత తాను అధ్యక్ష రేసు నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఇక ఇప్పుడు అదే పార్టీ నుంచి జో బైడెన్ అధ్యక్ష రేసులో నిలవగా.. ఆయనను గెలిపించేందుకు మైఖేల్ భారీగా ఖర్చు చేయాలని నిర్ణయించుకున్నారు. డెమొక్రటిక్ పార్టీతో పోల్చితే రిపబ్లికన్ పార్టీ మొదట్లో ఆర్థికంగా ఆధిపత్యం కొనసాగించింది. అయితే ప్రచారాల కోసం రిపబ్లికన్ పార్టీ భారీగా ఖర్చు చేయడంతో నిధులు మొత్తం తగ్గిపోతూ వచ్చాయి. ఇదే సమయంలో డెమొక్రట్లకు రిపబ్లికన్ల కంటే ఎక్కువ ఫండ్స్ రావడం ప్రారంభమైంది.
ఆగస్టు నెలలో ట్రంప్ ప్రచారానికి 210 మిలియన్ డాలర్లు(రూ. 1,543 కోట్లు) ఫండ్స్ ద్వారా రాగా.. జో బైడెన్‌కు 364.5 మిలియన్ డాలర్లు(రూ. 2,678) వచ్చాయి. దీంతో డెమొక్రటిక్ పార్టీ ప్రస్తుతం ఆర్థికంగా ఆధిపత్యం చూపుతోంది. ఇక అమెరికాలో కొన్ని రాష్ట్రాల్లో ప్రచారానికి భారీ స్థాయిలో ఖర్చు అవుతుంది. ఆ రాష్ట్రాల్లో ఫ్లోరిడా ఒకటి. ఎన్నికల విషయంలోనూ ఫ్లోరిడా కీలక రాష్ట్రం. దీంతో ఈ రాష్ట్రంలో డెమొక్రటిక్ పార్టీ ప్రచారానికి మైఖేల్ బ్లూమ్‌బర్గ్ 100 మిలియన్ డాలర్లను సమకూర్చుతున్నారు. ఫ్లోరిడాతో పాటు మరో ప్రతిష్టాత్మక రాష్ట్రమైన పెన్సిల్‌వేనియాలో జో బైడెన్ ప్రచారం కోసం మైఖేల్ భారీ స్థాయిలో ప్రచార ఖర్చును భరించనున్నట్టు తెలుస్తోంది. మరోపక్క మైఖేల్‌కు దీటుగా అవసరమైతే తన సొంత డబ్బును ఖర్చు చేస్తానంటూ ట్రంప్ తాజాగా చెప్పుకొచ్చారు. కాగా.. అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికలు నవంబర్ మూడో తేదీన జరగనున్నాయి. రిపబ్లికన్ పార్టీ నుంచి ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ మరోమారు తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక డెమొక్రటిక్ పార్టీ నుంచి మాజీ ఉపాధ్యక్షుడు జో బైడెన్ అధ్యక్ష బరిలో నిలిచారు.
Updated Date - 2020-09-14T09:02:09+05:30 IST