కువైట్‌కు భారత వైద్య బృందం
ABN, First Publish Date - 2020-04-12T13:58:58+05:30
మహమ్మారి కరోనా ప్రపంచ వ్యాప్తంగా 200కి పైగా దేశాలకు పాకింది. ఇప్పటికే లక్షకు పైగా మందిని పొట్టనబెట్టుకుంది.
కువైట్: మహమ్మారి కరోనా ప్రపంచ వ్యాప్తంగా 200కి పైగా దేశాలకు పాకింది. ఇప్పటికే లక్షకు పైగా మందిని పొట్టనబెట్టుకుంది. అగ్రరాజ్యాలను సైతం ఈ సూక్ష్మజీవి భయపెడుతోంది. 'కొవిడ్-19' ధాటికి ప్రపంచ పెద్దన్న అమెరికా కూడా బెంబేలెత్తిపోతోంది. అత్యధిక కరోనా బాధితులతో పాటు అధిక మరణాలతో అగ్రరాజ్యం విలవిలలాడుతోంది. అటు గల్ఫ్ దేశాల్లోనూ ఈ మహమ్మారి విరుచుకుపడుతోంది. ఇప్పటికే ఈ దేశాలు 'కొవిడ్-19' వ్యాప్తిని అరికట్టేందుకు కఠిన చర్యలు చేపట్టాయి. ఇక గల్ఫ్‌లో ప్రవాస భారతీయులు కూడా అధిక సంఖ్యలోనే ఉన్నారనేది తెలిసిందే. చాలా మంది ప్రయాణాలపై ఆంక్షల వల్ల కూడా అక్కడ చిక్కుకుపోయారు.
ఈ నేపథ్యంలో జీసీసీ(గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్) దేశాధినేతలతో ప్రధాని మోదీ భారతీయుల యోగ క్షేమాలు, భద్రత విషయమై ఫోన్ ద్వారా వాకాబు చేసిన విషయం తెలిసిందే. అలాగే భారత్ నుంచి గల్ఫ్ దేశాలకు కరోనాపై పోరుకు వైద్య పరంగా ఎలాంటి సహయం కావాలన్నా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇప్పటికే ఈ మహమ్మారిపై పోరాడుతున్న దేశాలకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ సరఫరా చేస్తూ అండగా నిలుస్తున్న భారత్ తాజాగా కువైట్‌కు 15 మంది సభ్యులతో కూడిన వైద్య బృందాన్ని పంపింది. ఈ వైద్య బృందం 15 రోజుల పాటు కువైట్‌లోనే ఉండనుంది. అక్కడ 'కొవిడ్-19' టెస్టులు నిర్వహించడంతో పాటు ఈ మహమ్మారి బారిన పడి వారికి చికిత్స అందించనుంది. ఇరు దేశాల మధ్య కరోనాపై పోరు విషయమై కుదిరిన ఒప్పందం మేరకు భారత్.. వైద్య బృందాన్ని అక్కడికి పంపించడం జరిగింది.
Updated Date - 2020-04-12T13:58:58+05:30 IST