గల్ఫ్ నుంచి స్వస్థలాలకు వస్తున్న ప్రవాసులకు చేదు అనుభవం !
ABN, First Publish Date - 2020-03-27T13:26:33+05:30
మహమ్మారి కరోనావైరస్(కొవిడ్-19) నేపథ్యంలో గల్ఫ్ దేశాల నుంచి స్వస్థలాలకు వస్తున్న ప్రవాసులకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి.
దుబాయి: మహమ్మారి కరోనావైరస్(కొవిడ్-19) నేపథ్యంలో గల్ఫ్ దేశాల నుంచి స్వస్థలాలకు వస్తున్న ప్రవాసులకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఇన్నాళ్లు విదేశాల నుంచి వస్తున్నారంటే ఎంతో అప్యాయత, ప్రేమ చూపించే బంధువులు, స్నేహితులు ఇప్పుడు ఆమడ దూరం పెడుతున్నారు. ప్రవాసులు, వారి కుటుంబాలను మనవాళ్లు అనుకున్నవారు సైతం ఇలా దూరం పెట్టడం ఎన్నారైలు జీర్ణించుకోలేకపోతున్నారు. కేరళ రాష్ట్రంలోని కాసర్గోడ్ కు చెందిన ఓ వ్యక్తి ఇటీవల గల్ఫ్ నుంచి వచ్చాడు. అంతే... అతడిని చూట్టుపక్కల వారు అనుమానంగా చూడడం, అతని కుటుంబ సభ్యులను దూరం పెట్టడం మొదలెట్టారు. ఇక చాలా మంది ఇలా విదేశాల నుంచి వస్తున్న వారు వాళ్లంతట వాళ్లే స్వీయ నిర్బంధంలోకి వెళ్తుంటే.. మరికొంత మంది మాత్రం క్వారంటైన్‌కు అంగీకరించకుండా నేరుగా ఇళ్లకు చేరుతున్నారు. దీంతో అలాంటి వారికి ఇలా బంధువులు, మిత్రుల నుంచి తిరస్కారాలు తప్పడం లేదు.
ఇదే కోవలో తాజాగా ఇటలీ నుంచి వచ్చిన పతనంతిట్టకు చెందిన ఓ కుటుంబానికి కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. బంధువులు ఎవరూ కూడా ఆ కుటుంబంతో మాట్లాడానికి ముందుకు రాకపోగా, దూరం పెట్టడం చేశారు. యూరోపియన్ దేశాల నుంచి వస్తున్న ప్రవాసుల పరిస్థితి కూడా ఇలాగే ఉంటోంది. మరికొంత మంది గల్ఫ్ నుంచి వచ్చినవారు కూడా తమ బాధాకరమైన అనుభవాలను పంచుకున్నారు. ఓ వ్యక్తి మాట్లాడుతూ తన బంధువులు, మిత్రుల కోసం ఎంతో ఇష్టంగా రూ. 4000 పెట్టి చాక్లెట్స్ తీసుకువచ్చానని, కానీ తాను గల్ఫ్ నుంచి వచ్చానని ఎవరూ వాటిని తీసుకోవడానికి ముందుకు రాలేదని వాపోయాడు. ఈ విషయం తనను ఎంతో బాధించిందన్నాడు. గల్ఫ్ దేశాల నుంచి వస్తున్నవారి నుంచి ఎలాంటి వస్తువులు తీసుకోవడానికి బంధువులు, స్నేహితులు ఆసక్తి చూపించడం లేదు. గల్ఫ్ రిటర్నీలకు స్నేహితులు, బంధువులు కనీసం ఫోన్ చేయడానికి కూడా ఆలోచిస్తున్నారంటే కరోనా భయం జనాల్లో ఏ రేంజ్‌లో ఉందో తెలుస్తోంది. కాగా, ఘటనలు గల్ఫ్ నుంచి వస్తున్న ప్రవాసులను చేదు అనుభవాలను మిగిలిస్తున్నాయి.
Updated Date - 2020-03-27T13:26:33+05:30 IST