లాక్‌డౌన్‌లో మరిన్ని సడలింపులిచ్చిన గ్రీస్.. సోమవారం నుంచి..
ABN, First Publish Date - 2020-06-02T01:09:21+05:30
పర్యాటక రంగాన్ని దృష్టిలో పెట్టుకుని గ్రీస్ ప్రభుత్వం లాక్‌డౌన్‌లో మరిన్ని సడలింపులు ఇచ్చింది.
అథెన్స్: పర్యాటక రంగాన్ని దృష్టిలో పెట్టుకుని గ్రీస్ ప్రభుత్వం లాక్‌డౌన్‌లో మరిన్ని సడలింపులు ఇచ్చింది. దీంతో సోమవారం నుంచి అనేక వ్యాపార కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి. సోమవారం నుంచి హోటళ్లు, ఓపెన్ ఎయిర్ సినిమాస్, గోల్ఫ్ కోర్సులు, పబ్లిక్ స్విమ్మింగ్ పూల్స్ తెరిచేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. మరో రెండు వారాల్లో గ్రీస్‌లో సమ్మర్ టూరిజం మొదలుకానుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పర్యాటక రంగంపై దృష్టి సారించింది. ప్రభుత్వం కరోనా అంశంలో చాకచక్యంగా వ్యవహరించడంతో మరణాల సంఖ్య కూడా తక్కువగానే నమోదైంది. గ్రీస్‌లో ఇప్పటివరకు కరోనా బారిన పడి కేవలం 175 మంది మాత్రమే ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉండగా.. జూన్ 15 నుంచి అంతర్జాతీయ పర్యాటకులను దేశంలోకి అనుమతించేందుకు ఇటీవల గ్రీస్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే కేవలం 29 దేశాలకు మాత్రమే గ్రీస్‌లోకి అడుగుపెట్టేందుకు మొదటగా అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. జులై 1 నాటికి ఈ దేశాల జాబితా మరింత పెరుగుతుందని ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వ నిర్ణయంతో గ్రీస్‌లోని పర్యాటక ప్రాంతాలకు పూర్వవైభవం రానుంది. ప్రభుత్వం అనుమతిచ్చిన దేశాలలో అల్బేనియా, ఆస్ట్రేలియా, ఆస్ట్రియా, నార్తర్న్ మకెడోనియా, బల్గేరియా, జర్మనీ, డెన్మార్క్, స్విట్జర్లాండ్, ఎస్టోనియా, జపాన్, ఇజ్రాయెల్, చైనా, క్రొయేషియా, సిప్రస్, లాత్వియా, లెబనాన్, లిథుయేనియా, మాల్టా, మాంటెనెగ్రో, రొమేనియా, న్యూజిల్యాండ్, నార్వే, సెర్బియా, స్లొవేకియా, స్లొవేనియా, జెక్ రిపబ్లిక్, ఫిన్లాండ్ దేశాలు ఉన్నాయి. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న దేశాల నుంచి వచ్చేవారిపై ఎయిర్‌పోర్టులలో ప్రత్యేక దృష్టి పెడతామని అధికారులు తెలిపారు.
Updated Date - 2020-06-02T01:09:21+05:30 IST