బైడెనే గెలవాలని కోరుకుంటున్నది వాళ్లు ముగ్గురే: ట్రంప్
ABN, First Publish Date - 2020-11-03T18:03:45+05:30
‘డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్.. ఈ అధ్యక్ష ఎన్నికల్లో గెలవాలని వాళ్లు ముగ్గురే కోరుకుంటున్నారు. ఎందుకంటే బైడెన్‌ను అయితేనే సులభంగా వాళ్లు లొంగదీసుకోగలరు. అవినీతిపరుడు కనుక.. డబ్బుతో అతడిని కొనేయొచ్చని వాళ్లు
వాషింగ్టన్: ‘డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్.. ఈ అధ్యక్ష ఎన్నికల్లో గెలవాలని వాళ్లు ముగ్గురే కోరుకుంటున్నారు. ఎందుకంటే బైడెన్‌ను అయితేనే సులభంగా వాళ్లు లొంగదీసుకోగలరు. అవినీతిపరుడు కనుక.. డబ్బుతో అతడిని కొనేయొచ్చని వాళ్లు భావిస్తున్నారు. నేను గెలిస్తే వాళ్ల ఆటలు సాగవు కనుక నాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు.. వాళ్లు ముగ్గురూ జట్టు కట్టి నాపై దుష్ప్రచారాలు చేస్తున్నారు. నన్ను ఓడించాలని చూస్తున్నారు. వాళ్ల ఆటలు నా దగ్గర సాగవు..’ అంటూ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల పోలింగ్ కొద్ది గంటల్లో ప్రారంభమవుతుందనగా.. నార్త్ కరోలినా రాష్ట్రంలో ఆయన ప్రచారం చేశారు. బిగ్ మీడియా, బడా టెక్ కంపెనీలు, చైనా.. కలిసి తనకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నాయని ఆయన ఆరోపించారు.
‘నిజమేంటో ప్రతి ఒక్క అమెరికన్‌కు తెలుసు.. బైడెన్ 47 ఏళ్ల రాజకీయ జీవితంలో అమెరికన్ల ఉద్యోగాలను విదేశాలకు ఔట్‌సోర్సింగ్‌కు ఇచ్చారు.. అమెరికా సరిహద్దుల్లో విదేశీయులకు ద్వారాలు తెరిచారు. అన్ని అర్హతలు ఉన్న అమెరికన్లను కాదని విదేశీయులకు ఉద్యోగాలను కట్టబెడుతున్నా చూస్తూ ఊరుకున్నారు. మీరు కనీవినీ ఎరుగని విదేశీ యుద్ధాలకు అమెరికన్ల రక్తాన్ని ధారపోశారు. మన సంపదను విదేశాలకు దారాదత్తం చేశారు. బైడెన్ గెలిస్తే మీపై పన్నులను మరింత పెంచుతారు. ఫ్యాక్టరీలను మూసేస్తారు.. ఉద్యోగాలను విదేశాలకు ఇచ్చేస్తారు.. అబద్ధపు రాతలతో జనాలను మభ్యపెట్టి జో బైడెన్‌ను గెలిపించాలని మీడియా కూడా చూస్తోంది...’ అని ట్రంప్ ఆరోపించారు.
Updated Date - 2020-11-03T18:03:45+05:30 IST