అమెరికాలో వ్యాక్సినేషన్ షురూ..!
ABN, First Publish Date - 2020-12-15T12:51:01+05:30
అమెరికాలో ఎట్టకేలకు వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. ఫైజర్ కంపెనీ కొవిడ్-19 వ్యాక్సిన్ తొలి డోసును న్యూయార్క్‌లోని లాంగ్ ఐలాండ్ జ్యూయిష్ మెడికల్ సెంటర్‌లోని క్రిటికల్ కేర్ విభాగంలో నర్సుగా సేవలందిస్తున్న సాండ్రా లిండ్సేకు అందించారు. సోమవారం ఉదయం 9.30 గంటలకు జరిగిన ఈ కార్యక్రమాన్ని అమెరికా వార్తా చానళ్లన్నీ ప్రత్యక్ష ప్రసారం చేశాయి.
న్యూయార్క్, డిసెంబరు 14: అమెరికాలో ఎట్టకేలకు వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. ఫైజర్ కంపెనీ కొవిడ్-19 వ్యాక్సిన్ తొలి డోసును న్యూయార్క్‌లోని లాంగ్ ఐలాండ్ జ్యూయిష్ మెడికల్ సెంటర్‌లోని క్రిటికల్ కేర్ విభాగంలో నర్సుగా సేవలందిస్తున్న సాండ్రా లిండ్సేకు అందించారు. సోమవారం ఉదయం 9.30 గంటలకు జరిగిన ఈ కార్యక్రమాన్ని అమెరికా వార్తా చానళ్లన్నీ ప్రత్యక్ష ప్రసారం చేశాయి. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విటర్ వేదికగా స్పందించారు. ‘‘మొదటి వ్యాక్సిన్ వేశాం. అమెరికాకు అభినందనలు. యావత్ ప్రపంచానికి అభినందనలు’’ అన్నారు. ఇక తొలి డోసును వేయించుకున్న లిండ్సే.. ‘‘నేను చాలా గొప్ప అనుభూతిని పొందాను. ఎంతో ఉపశమనం కలిగినట్లుగా అనిపిస్తోంది. చరిత్రలోనే ఎంతో కఠినమైన సమయానికి చరమగీతం పాడేందుకు ఈ ఘట్టం పునాది వేస్తుందని ఆశిస్తున్నా’’ అని చెప్పారు. మరోవైపు కెనడాలోనూ ఫైజర్ టీకాతో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.
అంటారియో ప్రావిన్స్‌లోని టొరంటోలో ఉన్న రెకాయ్ సెంటర్ నర్సింగ్ హోంలో సేవలందించే ఇద్దరు నర్సులు, ముగ్గురు వర్కర్లకు తొలి డోసును అందించారు. మరో 2,500 మంది వైద్యారోగ్య సిబ్బందికి టీకాలు వేయనున్నారు. క్యూబెక్ ప్రావిన్స్‌లోని రెండు వృద్ధాశ్రమాల్లో ఉండే వృద్ధులకు కూడా వ్యాక్సిన్‌ను అందించారు. కాగా, అమెరికాలో వ్యాక్సిన్‌పై ఫ్రంట్‌లైన్ వర్కర్లు, వృద్ధుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. వ్యాక్సిన్ ద్వారా మరోమారు దేశాన్ని ప్రమాదంలోకి నెడుతున్నారనే సందేహాలను వారు వ్యక్తం చేస్తున్నారు. వృద్ధులకు ఇది ఎంతవరకు సురక్షితమనే పరీక్షలు చేశారా? సైడ్ ఎఫెక్ట్‌లపై పూర్తి అవగాహన ఏర్పడిందా? వ్యాక్సిన్‌తో మేలు కంటే కీడే ఎక్కువ జరిగే అవకాశం ఉందా? అనే సందేహాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువమంది వ్యాక్సిన్ తీసుకోబోమని చెప్పినట్టు అమెరికన్ నర్సెస్ ఫౌండేషన్ సహా అనేక యూనియన్ల అంతర్గత సర్వేల్లో వెల్లడైంది.
Updated Date - 2020-12-15T12:51:01+05:30 IST