‘కేసీఆర్ కూపన్స్’ ద్వారా 200కు పైగా విద్యార్థులకు సహాయం
ABN, First Publish Date - 2020-05-10T04:49:57+05:30
టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 'కేసీఆర్ కూపన్స్' కార్యక్రమం
లండన్: టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 'కేసీఆర్ కూపన్స్' కార్యక్రమం ఎంతో మంది విద్యార్థులకు ఉపయోగపడిందని ఎన్నారై టీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి తెలిపారు. యూకేలో ఇబ్బందులు పడుతున్న 200కు పైగా తెలుగు విద్యార్థులకు మొదటి విడతగా సహాయం అందించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఎన్నారై టీఆర్ఎస్ యూకే ఆధ్వర్యంలో రెండో విడతలో భాగంగా 200 మందికి పైగా విద్యార్థులకు 'కేసీఆర్ కూపన్స్' అందించామని అశోక్ గౌడ్ దూసరి పేర్కొన్నారు. కొన్ని వందల మంది విద్యార్థులు సహాయం కోసం తమను సంప్రదించారని, వారి పరిస్థితులను చూసి చలించిపోయామని అశోక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ఆశలతో విదేశాలకు వచ్చిన తోటి అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు ఇలాంటి కష్టం రావడం చాలా బాధాకరమని అన్నారు వారందరికి వీలైనంత సహాయం చేయడానికి సంస్థ కార్యవర్గ సభ్యుల సహకారమే కాకుండా ఇతర శ్రేయోభిలాషుల సహకారంతో విద్యార్థులకు సేవ చేస్తున్నామని అశోక్ తెలిపారు.
ఎన్నారై టీఆర్ఎస్ యూకే సంస్థ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా యూకేలో 500కు పైగా విద్యార్థులకు, తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో వందల మంది పేదలకు నిత్యావసరాల సరుకులు అందించడం జరిగిందని అశోక్ చెప్పారు. 'కేసీఆర్ కూపన్స్' కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్థలు, వ్యక్తుల నుంచి ప్రశంశలు అందుకోవడం సంతోషంగా ఉందని అశోక్ అన్నారు. ఈ కార్యక్రమాన్ని మొదటి నుంచి పర్యవేక్షిస్తూ తమను ముందుండి నడిపించిన ఎన్నారై టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలంకు కృతజ్ఞతలు తెలిపారు. అదే విధంగా సహకరించిన కార్యవర్గ సభ్యులకు, టీఆర్ఎస్ నాయకులకు, శ్రేయాభిలాషులకు ధన్యవాదాలు తెలిపారు.
Updated Date - 2020-05-10T04:49:57+05:30 IST