కుర్రకారు పాటల చౌరస్తా!
ABN, First Publish Date - 2020-04-12T05:43:27+05:30
కరోనాపై అవగాహన కల్పించేలా, సందేశమిచ్చేలా కొందరు పాటలు చేస్తున్నారు. అందులో యూట్యూబ్‌లో శ్రోతలను, హైదరాబాద్‌లో యువతను ఆకట్టుకుంటూ ఫేమస్ అవుతోన్న...
ఇంట్లో... పెళ్లాం చెప్పిందే ‘కరో’నా...
మన ఇంట్లో సంతోషంగా ఉండడానికి!!
‘చౌరస్తా’లో... చేయి చేయి కలపకురా....
సమాజం సంతోషంగా ఉండడానికి!!
కరోనాపై అవగాహన కల్పించేలా, సందేశమిచ్చేలా కొందరు పాటలు చేస్తున్నారు. అందులో యూట్యూబ్‌లో శ్రోతలను, హైదరాబాద్‌లో యువతను ఆకట్టుకుంటూ ఫేమస్ అవుతోన్న ‘చౌరస్తా’ బృందం చేసిన పాటలూ రెండు ఉన్నాయి. వాట్సాప్‌లో, యూట్యూబ్‌లో వినపడుతున్నాయి. రెండిటిలో ‘చేయి చేయి కలపకురా’ పాట ఈ కష్టకాలంలో ప్రజలు ఎలా ఉండాలనే సందేశాన్నిస్తే... ‘మిస్టర్ పెళ్లాం’ పాట ఇంట్లో కుటుంబ బాధ్యతలు మోసే అలుపెరగని స్త్రీమూర్తికి ఘన నివాళిగా నిలిచింది. ఈ రెండు పాటల గురించి చెప్పే ముందు... ‘చౌరస్తా’ బ్యాండ్ గురించి కాస్త చెప్పాలి. జమైకా మ్యూజిక్ జానర్ ‘రేగే’ స్ఫూర్తితో పాశ్చాత్య సంగీతంలో జానపద శైలిలో ఈతరం ప్రేక్షకులు సైతం మెచ్చేలా పాటలు వినిపించడం వీరి ప్రత్యేకత. సుమారు రెండేళ్ల క్రితం ఈ బ్యాండ్ ప్రారంభమైంది.
సామాజిక సమస్యలే ‘చౌరస్తా’ బృందం స్వరపరిచే పాటలకు ముడిసరుకు. ఇంతకు ముందు రైతు సమస్యల నేపథ్యంలో ‘సాగు బరువాయనా రైతా’, పట్నం నుండి పల్లెకు పోవాలనుకునే యువకుడి నేపథ్యంలో పల్లెతీరు ఎలా మారిందో వివరించే ‘ఊరెళ్లిపోతా మామ’ పాటల నుండి ఇప్పటి కరోనా పాటలు ‘చేయి చేయి కలపకురా’, ‘మిస్టర్ పెళ్లాం’ పాటలు చేశారు. మధ్యలో ‘మాయ’ అనే సరదా గీతాన్నీ వినిపించారు. ‘చేయి చేయి కలపకురా’కు రామ్ మిరియాల బాణీ కట్టడంతో పాటు స్వయంగా రాసి, పాడారు. ఆనంద్ గుర్రం రాసిన ‘మిస్టర్ పెళ్లాం’ పాటను యశ్వంత్ నాగ్ స్వరపరచడంతో పాటు ఆలపించారు.
బాధ్యతగా బతకమని...
‘‘పాపులారిటీ కోసం చేసిన పాట కాదిది. ప్రస్తుత సందర్భంలో ప్రజలకు అవసరమని ‘చేయి చేయి కలపకురా’ చేశా. ఒక్క రాత్రి రెండు మూడు గంటలు కూర్చుని పాట రాసి, స్వరపరిచా. మొదట పాట రాద్దామని అనుకోలేదు. ఇన్‌స్టాలో నాలుగు లైన్లు పోస్ట్ చేయాలనుకున్నా. రాశాక, ఏదో వెలితిగా అనిపించి పాట చేశా. నాకు రాయడం, పాడడం, స్వరపరచడం వచ్చు కాబట్టి ఇంట్లో కూర్చుని చేయడానికి ఇబ్బంది అనిపించలేదు. వీడియో చేసేలోపు అభిప్రాయం తెలుసుకుందామని స్నేహితులకు పంపించా. అది వైరల్ కావడంతో పాటు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ వరకూ వచ్చింది. కరోనా తీవ్రత చాలామందికి తెలియడం లేదు. టీవీల్లో చూస్తున్నాం... బడ్డీకొట్లు దగ్గర వెనుక నుండి సిగరెట్లు కొని కాలుస్తున్నారు. స్నేహితులతో సరదాగా కబుర్లు చెబుతున్నారు. పని లేకున్నా కొంతమంది రోడ్ల మీదకు వస్తున్నారు. దీని వల్ల వాళ్లకు కరోనా అంటుకోవడమే కాదు, వాళ్ల నుండి ఇంట్లో కుటుంబానికి అంటుతుంది. ఒక్కరి ఆరోగ్యం పాడైతే వాళ్ల కుటుంబం, తర్వాత సమాజం పాడవుతుంది.’’
- రామ్ మిరియాల, రచయిత-గాయకుడు-స్వరకర్త
కుటుంబం విలువ తెలుస్తోంది!
‘‘అమ్మ, అర్ధాంగి, అమ్మాయి, సోదరి... ఎవరైతే ఏమి? మన ఇంటి మహిళలు, 24/7 మన కోసం పని చేసేవాళ్లకు కృతజ్ఞతలు చెప్పాలనే ఉద్దేశంతో ‘మిస్టర్ పెళ్లాం’ పాట చేశాం. మహిళలకు ఎవరూ సాటి రారు. రోజంతా ఇంట్లో ఉంటే ఎలా ఉంటుందో మగవాళ్లకు తెలియదు. ఉద్యోగాలు, వ్యాపారాల కోసం బయటకు వెళతారు. ఇంట్లో ఉండేది తక్కువ. కరోనా వల్ల రోజంతా ఇంట్లో ఉంటే... మహిళలు వెలకట్టలేని పని ఎంత చేస్తున్నారో కూడా తెలుస్తోంది. వాళ్లకు ఘన నివాళి ఈ పాట. ఒక్క రోజులో పాటను కంపోజ్ చేశా. ఆనంద్ లిరిక్స్ రాశారు. కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించడానికి ముందు ఫొటోగ్రాఫర్ నాగరాజ్ నా దగ్గరకు వచ్చారు. అప్పట్నుంచీ తను నాతో ఉండడంతో నేను పాడేటప్పుడు షూట్ చేశారు. ఇల్లు, కుటుంబ సభ్యులు ఎంత ముఖ్యమో తెలుసుకోవడానికి అందమైన సమయం ఇది. పనిలో పడి రాత్రి రెండు మూడు గంటలకు ఇంటికి వచ్చేవాణ్ణి. నాకోసం అమ్మ భోజనం వండి పెట్టేది. కరోనా వల్ల మనకూ ఏదో జబ్బు వస్తుందని భయపడి, బాధ పడడం కంటే మన సమయాన్ని ఇంటి పనులకు వాడుకుంటే చాలా బావుంటుందని ‘మిస్టర్ పెళ్లాం’ చేశాం.’’
- యశ్వంత్ నాగ్, గాయకుడు-స్వరకర్త
వాళ్ల శ్రమను గుర్తించమంటూ...
‘‘ఇంట్లో ఏం జరుగుతుందనేది మగవాళ్లు పెద్దగా పట్టించుకోరు. రోజంతా ఇంట్లో ఉంటే ఏం జరుగుతుందనేది అర్థమయ్యాక... ఇంటిపనిలో మగవాళ్లూ పాలుపంచుకుంటే బాగుంటుంది. ఇంటిపని చేయడంలో మహిళలు మాస్టర్స్. మనమెంత చేసినా పర్‌ఫెక్ట్ కాలేము. అలాగని, ఖాళీగా కూర్చోకుండా వాళ్లు అడిగిన సహాయం చేస్తే బావుంటుంది. ఆడవాళ్లకు ఆదివారం ఉండదు, సెలవులు ఉండవు అనేది తెలిసిందే. ఇప్పుడు వాళ్ల కష్టాన్ని చాలామంది కళ్లారా చూస్తున్నారు. ఇప్పుడైనా గుర్తించండని ‘మిస్టర్ పెళ్లాం’ పాట ద్వారా చెప్పాం. ఒక్క రాత్రిలో మూడు నాలుగు గంటల్లో రాశా. ‘చౌరస్తా’ బ్యాండ్‌కి పాటలు రాస్తుంటా కదా! ‘అందరి గురించి రాస్తారు. మా గురించి రాయరా?’ అని ఒకసారి నా వైఫ్ అడిగింది. ఆమె మాటలూ ఈ పాట రాయడానికి ఒకరకంగా స్ఫూర్తి. తనతో పాటు మా అమ్మ, అక్కలకు పాట నచ్చింది. ఆఫీసు నుండి ఇంటికి వెళ్లగానే ‘బయటకు వెళ్తామా?’ అని భార్య ఎందుకు అడుగుతుందనేది ఇప్పుడు చాలామంది భర్తలకు తెలుస్తుందని అనుకుంటున్నా.’’
- ఆనంద్ గుర్రం, గీత రచయిత
Updated Date - 2020-04-12T05:43:27+05:30 IST