ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిర్లక్ష్యాన్ని ప్రశ్నించింది... కరోనాను జయించింది

ABN, First Publish Date - 2020-04-06T06:43:03+05:30

జర్మనీలో క్లయింట్‌తో మీటింగ్‌ పూర్తి చేసుకొని ఇంటికొస్తున్న సంతోషం. హైదరాబాద్‌ ఎయిర్‌ పోర్ట్‌లో దిగాకా హోం క్వారంటైన్‌లో ఉండాలని అధికారులు అన్నప్పుడు చిన్న శంక. ఎనిమిదో రోజున జ్వరంతో అంబులెన్స్‌లో వెళుతున్నప్పుడు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జర్మనీలో క్లయింట్‌తో మీటింగ్‌ పూర్తి చేసుకొని ఇంటికొస్తున్న సంతోషం. హైదరాబాద్‌ ఎయిర్‌ పోర్ట్‌లో దిగాకా  హోం క్వారంటైన్‌లో ఉండాలని అధికారులు అన్నప్పుడు చిన్న శంక. ఎనిమిదో రోజున జ్వరంతో అంబులెన్స్‌లో వెళుతున్నప్పుడు.. ప్రాణాంతక వైరస్‌ ఒంట్లో తిష్ట వేసిందన్న భయాందోళన. ఇలాంటి వేళ ఎవరి మానసిక పరిస్థితైనా ఎలా ఉంటుంది? నిర్లక్ష్యాన్ని నిలదీయాలనీ.. అలక్ష్యాన్ని ప్రశ్నించాలనీ అనుకుంటారా?  కానీ ఆమె మాత్రం తనకెదురైన చేదు అనుభవం ఇంకెవరికీ వద్దని.. ఫీవర్‌ ఆసుపత్రి కరోనా వార్డు దుఃస్థితిని వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ఆ వీడియో వైరల్‌ అయింది. వ్యవస్థలోని లోపంతో.. ఒంట్లోని వైరస్‌తో ఆమె చేసిన పోరాటం ఫలించింది. ఫీవర్‌ ఆసుపత్రి వార్డు రూపురేఖలు మారాయి. ఒంట్లోని వైరస్‌ పైనా విజయం సాధించారు. ‘నవ్య’తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆమె ప్రయాణంలోకి వెళితే..


‘‘మాది పశ్చిమబెంగాల్‌. హైదరాబాద్‌లో స్థిరపడ్డాం. ఐటీ కంపెనీలో ఉద్యోగం. ప్రాజెక్టులో భాగంగా క్లయింట్‌తో మీటింగ్‌ కోసం జర్మనీ వెళ్లాను. మార్చి 13న హైదరాబాద్‌కు తిరిగి చేరుకున్నా. ఎయిర్‌ పోర్టులో థర్మల్‌ టెస్టులో నెగిటివ్‌ వచ్చింది. రెండు వారాల పాటు హోం క్వారంటైన్‌ అన్నారు. తరచూ ప్రభుత్వ సిబ్బంది ఫోన్లు చేసి ఆరోగ్యం గురించి వాకబు చేస్తుండేవారు. మార్చి 22 వరకూ ఏ సమస్యా రాలేదు. తరువాత రోజు రాత్రి వేళ జ్వరంతో పాటు ఒళ్లు నొప్పులు వచ్చాయి. వెంటనే ఫోన్‌ చేసి సమాచారమిచ్చా.  పారాసిటమాల్‌ వేసుకొని విశ్రాంతి తీసుకోవాలని.. ఉదయమే వస్తామన్నారు. అన్నట్లే వచ్చారు. అంబులెన్స్‌లో ఫీవర్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ దారుణ అనుభవాలు ఎదురయ్యాయి. అక్కడి ఏర్పాట్లు 

పశువుల కొట్టాల్ని తలపించాయి. శుభ్రత లేదు. పరిసరాలు దుమ్ము పట్టి ఉన్నాయి. మంచినీళ్లు లేవు. దోమల బాధ. అక్కడకు తీసుకెళ్లాక ఎవరూ పట్టించుకోలేదు. తొలుత పరీక్షలేమీ చేయలేదు. అసలేం జరుగుతోందో అర్థం కాలేదు. 


ప్రపంచానికి చెప్పాలనుకున్నా!

ఓపక్క కరోనా ఆందోళన. ఏమవుతుందోనన్న టెన్షన్‌. మరోపక్క ఏ మాత్రం అనువుగా లేని పరిసరాలు. ప్రమాదకరమైన వైరస్‌ ఉన్న వ్యక్తుల్ని అపరిశుభ్రంగా ఉన్న చోట ఉంచటమా? ఇలా అయితే.. రోగులు మరింత అనారోగ్యానికి గురి కారా? అధికారుల్లో ఇంత నిర్లక్ష్యమా? అని మనసులో ఒకటే వేదన. ఫోన్‌తో వీడియో తీసి.. అధికారుల నిర్లక్ష్యం అందరికి తెలిసేలా చేయాలనుకున్నా. ఫీవర్‌ ఆసుపత్రిలో కరోనా వార్డు దుఃస్థితి తెలిపే వీడియోను సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేశాను. అది కాస్తా వైరల్‌ అయింది. తెలిసిన వారు.. తెలియని వారంతా సానుభూతిని చూపించేవారు. విషయం ప్రభుత్వం వరకూ వెళ్లింది. 


అదో కాళరాత్రి

ఆ కాళరాత్రిని ఇప్పుడు కూడా గుర్తుకు తెచ్చుకోవడం ఇష్టం లేదు. జీవితంలో ఏదైనా దారుణమైన రోజు ఉందంటే అదే. ఓవైపు ఒంట్లో నలత. రోగులు ఉండేందుకు అనువుగా లేని వాతావరణం. ఆ రోజు సరైన ఆహారం ఇవ్వలేదు. మొత్తంగా గంటలు రోజుల్లా గడిచాయి. ఆ రాత్రి త్వరగా గడిచిపోవాలని ఎన్నిసార్లు దేవుణ్ణి ప్రార్థించానో!


పాజిటివ్‌గా తేల్చి.. ఆసుపత్రి మార్చారు

పరీక్ష చేయగా పాజిటివ్‌ అని తేలింది. అప్పటికే కరోనా మీద అవగాహన ఉండటంతో ఎక్కువ భయం కలుగలేదు. కాకుంటే ఆదుర్దాగా అనిపించింది. నాకేం జరిగింది? ఏం జరగనుంది? ఎలాంటి వైద్యం అందనుంది? లాంటి ప్రశ్నలు తరచూ మదిలోకి వచ్చేవి. అప్పుడే ఫీవర్‌ ఆసుపత్రి నుంచి చెస్ట్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడి ఏర్పాట్లు  బాగున్నాయి. పరిశుభ్రమైన వాతావరణం. ఫీవర్‌ ఆసుపత్రికి పూర్తిగా భిన్నమైన పరిస్థితులున్నాయి. మనసు కాస్త కుదుటపడింది. కాకుంటే వైద్యులు వచ్చే వారు కాదు. ఏమీ చెప్పే వారు కాదు. కరోనా లాంటి వైరస్‌ ఉందన్నప్పుడు చాలానే సందేహాలు కలుగుతాయి కదా? వాటిని తీర్చే వారే కనిపించలేదు.


అందరూ ఒకేలా...

వైద్యం మొదలైంది. వివరాలేమీ చెప్పలేదు. వారిచ్చిన మందులు వేసుకోవటమే. రెండు రోజుల పాటు వచ్చినోళ్లలో డాక్టర్లు ఉన్నారో, లేదో కూడా తెలీదు. అందరూ ఒకేలాంటి ఫుల్‌ సూట్‌లో ఉండేవారు. ముఖం మొత్తం రక్షణ కవచాలు ఉండేవి.  ఎవరెవరో గుర్తు పట్టలేం. వచ్చిన వారు తమను తాము వైద్యులుగా చెప్పుకోలేదు. ఇదో పెద్ద కన్ఫ్యూజన్‌. సమస్యలు ఏమైనా ఉంటే.. ఎవరికి చెప్పుకోవాలో తెలిసేది కాదు. వచ్చేవారు. దూరంగా ఉండేవారు. వెళ్లిపోయేవారు. వారి సమస్య అర్థమయ్యేది. కానీ.. పేషెంట్ల మానసిక పరిస్థితిని కూడా అర్థం చేసుకొని ఉంటే బాగుండేది. తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చింది. నాతో పాటు మరో ఆరుగురు ఉన్నారు. వారిలో అరవై.. అరవై ఐదు ఏళ్ల వారున్నారు. తమకు బీపీ.. షుగర్‌ పరీక్షలు చేయాలని కోరారు.  పట్టించుకోలేదు. ర్యాండమ్‌ షుగర్‌ టెస్టు చేయకుంటే మరిన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయని ఆందోళన చెందేవారు. వారిని సముదాయించేదాన్ని. వారి విన్నపంలో న్యాయం ఉంది. కానీ.. ఏమీ చేయలేని పరిస్థితి. వారికైతే పరీక్షలు చేయలేదు.


పుస్తకాలు చదివా! సినిమాలు చూశా!

ఉరుకుల పరుగులు జీవితం కరోనాతో ఒక్కసారిగా మారింది.  చాలా ఫ్రస్ట్రేషన్‌గా అనిపించేది. కష్టంగా రోజులు గడిచేవి. ఇంట్లోవారితో మాట్లాడేదాన్ని. వారు ఆందోళన చెందేవారు. ధైర్యం చెప్పేదాన్ని. ఫోన్లో చాలా పుస్తకాల పీడీఎఫ్‌ లున్నాయి. కొన్ని చదివా. అప్పుడప్పుడు సినిమాలు చూసేదాన్ని. సోషల్‌ మీడియాను ఫాలో కావటంతో.. ఫీవర్‌ ఆసుపత్రిలో కరోనా వార్డు రూపురేఖలు మారినట్లు తెలుసుకున్నా. దానికి సంబంధించిన ఫోటోలు చూశాక సంతోషమేసింది. ప్రభుత్వం స్పందించి.. సమస్యను పరిష్కారించాక.. వీడియో ఉంచటం అవసరం లేదనిపించింది. అందుకే డిలీట్‌ చేశా.


ఆ ఏర్పాటు ఒక్కటి చేయాలి!

సమయానికి ఫుడ్‌ ఇచ్చేవారు. కాకుంటే.. బాగుండేది కాదు. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. నాతోపాటు ఉన్న వారిలో కొందరికి ఇళ్ల నుంచి పండ్లు వచ్చేవి. అందరికి ఇచ్చేవారు. నాకంటే వారికే అవసరం ఎక్కువ. అందుకే తీసుకోవటం ఇబ్బందిగా ఉండేది. ఆసుపత్రిలో సరైన ఆహారం లేని కారణంగా విటమిన్‌ లోపం సమస్య వచ్చింది. మందులు వాడాలన్నారు. డిశ్చార్జ్‌కు ముందు రెండు టెస్టులు చేశారు. రెండో టెస్టు ఫలితం ఆలస్యంగా వచ్చింది. చాలా టెన్షన్‌గా అనిపించింది. శనివారం (ఏప్రిల్‌ 4) ఉదయం ఫలితం నెగిటివ్‌ వచ్చిందని.. డిశ్చార్జ్‌ చేస్తున్నట్లు చెప్పారు. ఇంటికి వెళ్లేందుకు వాహన సదుపాయం లేదన్నారు. ఫ్రెండ్స్‌ను రిక్వెస్టు చేస్తే వచ్చి తీసుకెళ్లారు. ఎట్టకేలకు నా ప్రపంచానికి చేరుకున్నా. కరోనా ట్రీట్‌మెంట్‌ తీసుకున్న వ్యక్తిని కారులో ఎవరు తీసుకెళతారు? లాక్‌డౌన్‌ వేళ.. క్యాబ్‌ సౌకర్యం కూడా ఉండదు. ఇలాంటివేళ.. ట్రీట్‌మెంట్‌ అయ్యాక.. ఇంటి దగ్గర ప్రభుత్వమే దింపే ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఈ విషయాన్ని పెద్ద మనసుతో ఆలోచించాలి. చివరగా ఒక్కమాట.. కరోనా చికిత్స ప్రభుత్వం ఉచితంగానే చేస్తోంది. అందరూ కాకున్నా కొందరు కరోనా వైద్యానికయ్యే ఖర్చును భరించగలరు. అలా చేస్తే మరికొందరికి మెరుగైన సదుపాయాలు కల్పించే వీలుంటుంది కదా?’’

-చామర్తి మురళీధర్‌

Updated Date - 2020-04-06T06:43:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising