ఎంపీ కూతురు పేరు కరోనా!
ABN, First Publish Date - 2020-05-09T05:30:00+05:30
కనిపించని శత్రువుతో భూతలం పోరాటం చేస్తుంటే... ఈ విపత్కర కాలంలో పుట్టిన తమ బిడ్డలకు ఆ శత్రువు పేరే పెట్టుకుని
కనిపించని శత్రువుతో భూతలం పోరాటం చేస్తుంటే... ఈ విపత్కర కాలంలో పుట్టిన తమ బిడ్డలకు ఆ శత్రువు పేరే పెట్టుకుని మురిసిపోతున్నారు ఈతరం తల్లితండ్రులు. తాజాగా పశ్చిమబెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అపురూపా పోద్దార్ కూడా ఇదే దారిలో నడిచారు. ఆరామ్‌బాగ్ నుంచి రెండోసారి గెలిచిన ఆమె ఇటీవల ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఆ అమ్మాయికి ‘కరోనా’ అనే ముద్దు పేరు పెట్టుకున్నారు. బెంగాల్‌లోని చాలా ప్రాంతాల్లో పిల్లలకు రెండు పేర్లు పెట్టడం ఆనవాయితీ. ఒకటి అసలైన పేరు... రెండోది ముద్దు పేరు. ‘‘ఈ పాప మాకు రెండో సంతానం.
ప్రపంచమంతా కొవిడ్-19పై చేస్తున్న పోరాటం స్ఫూర్తిగా మా బిడ్డకు ‘కరోనా’ పేరు పెట్టాం’’ అంటూ చెప్పుకొచ్చారు అపురూప భర్త మహ్మద్ షకీర్ అలీ. ‘‘నా భర్త, నా కుటుంబం సైతం పాప పేరు విషయంలో చాలా ఆనందంగా ఉన్నారు’’ అంటున్నారు అపురూప. ఈ సంవత్సరంలో పుట్టిన పిల్లలకు ఆ వైరస్ పేరు పెట్టడం ఇదే ప్రథమం కాదు. అంతకు ముందు మధ్యప్రదేశ్‌లో పుట్టిన ఓ పిల్లాడికి ‘లాక్‌డౌన్’ అని, ఉత్తరప్రదేశ్‌లో మరో పిల్లాడికి ‘శానిటైజర్’ అని, అలాగే ఇతర దేశాల్లో ‘కొవిడ్ బ్రియాంట్’, ‘డెమి’ (‘పాండెమిక్’లో కొంత భాగం) అనే పేర్లు పెట్టారు వారి తల్లితండ్రులు.
Updated Date - 2020-05-09T05:30:00+05:30 IST