ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నృత్యానికి పనికిరానన్నారు!

ABN, First Publish Date - 2020-10-15T06:15:10+05:30

ఆమె నృత్యం నేర్చుకోవటం వాళ్ల నాన్నకు ఇష్టం లేదు. నృత్యంలో ఓనమాలు నేర్పిన గురువు ఆమెను నృత్యానికే పనికిరావు అన్నారు. అంత వ్యతిరేకత మధ్య కూడా తాను అనుకున్న నృత్యరీతిలో అత్యున్నత శిఖరాలు అధిరోహించారు శోభానాయుడు. ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణతో ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’లో ఆమె చెప్పిన విశేషాలివి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆమె నృత్యం నేర్చుకోవటం వాళ్ల నాన్నకు ఇష్టం లేదు. నృత్యంలో ఓనమాలు నేర్పిన గురువు ఆమెను నృత్యానికే పనికిరావు అన్నారు. అంత వ్యతిరేకత మధ్య కూడా తాను అనుకున్న నృత్యరీతిలో అత్యున్నత శిఖరాలు అధిరోహించారు శోభానాయుడు. ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణతో ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’లో ఆమె చెప్పిన విశేషాలివి..


 ‘‘మా ఇంట్లో పాటలు పాడేవారున్నారు. డ్యాన్స్‌ వచ్చిన వారు లేరు. మా ఇంట్లో డ్యాన్స్‌ అనేది బ్యాన్‌. నాకు మూడేళ్లప్పుడు ఊయలలో ఊగేప్పుడు లయబద్ధంగా చేతులు, కాళ్లు కదిపేదాన్నట.   దాంతో అయిదో ఏటనే మా అమ్మ నన్ను రాజమండ్రిలోని పి.లక్ష్మణరెడ్డి గారి దగ్గర నాట్య శిక్షణలో చేర్పించింది. ఆ తర్వాత ఏలూరుకు మకాం మార్చాం. నాన్న నన్ను డాక్టర్‌ని చేద్దామనుకున్నారు. అందుకే నా డ్యాన్స్‌ గురించి కాంప్లిమెంట్స్‌ ఇచ్చేవారు కాదు. మేము ఏలూరులో ఉన్నప్పుడు ఓ సంఘటన జరిగింది. ఏలూరులోని మా గురువుగారు చెన్నైలో నన్ను అరంగేట్రం చేయిస్తానన్నారు. దానికి డబ్బంతా మా నాన్నగారే పెట్టుకున్నారు.


విచిత్రమేంటంటే పెట్టాబేడా సర్దుకుని నేను   వారికోసం ఎదురుచూశా. మా గురువుగారు చెన్నై వెళ్లిపోయారు. మూడురోజుల తర్వాత మా గురువుగారు మా ఇంటికి వచ్చి ’మీ అమ్మాయి నాట్యానికి పనికిరాదు, ఆ ఫీచర్సే లేవు, అరంగేట్రం వేస్ట్‌’ అన్నారు. నాన్న ’సరే, ఆ మాట ముందే చెప్పి ఉండాల్సింది‘ అన్నారు. ఈ మాటలు నేను వంటింటి లోంచి విన్నా. నాకు చాలా బాధ కలిగింది. చాలా ఏడ్చా. ఎలాగైనా డ్యాన్సర్‌గా పేరు సంపాదించాలనే పట్టుదల పెరిగింది. దీనితో అరంగేట్రం చేయటానికి నాన్నకు ఒప్పించా. అమ్మతో కలిసి చెన్నైకు వెళ్లా. అక్కడ మా తాతయ్య గారి కుటుంబం ఉండేది. వారి దగ్గర ఉండి-  ఏడాది పాటు వెంపటి చినసత్యం గారి దగ్గర నృత్యం నేర్చుకున్నా. 




సత్యభామ పాత్రలో మెప్పించా! 

ఒకసారి నేను తాతయ్యతో కలిసి ’శ్రీకృష్ణ పారిజాతం‘ ప్రోగ్రామ్‌ చూశాను. సత్యభామ పాత్ర నన్ను విపరీతంగా ఆకర్షించింది. ’తాతయ్యా.. జీవితంలో ఒక్కసారైనా సత్యభామ పాత్ర చేయాలని ఉంది’ అన్నాను. ఏ ముహర్తాన అన్నానో తెలియదు కానీ.. మూడు దశాబ్దాలుగా సత్యభామ పాత్ర చేస్తూనే ఉన్నా. అందరూ సత్యభామను గర్విష్టి అంటారు కానీ ఆమె అమాయకురాలు అనిపిస్తుంది. సత్యభామ పాత్రలో నవరసాలు ఉన్నాయి. నాట్యశాస్త్ర భంగిమలున్నాయి. అందుకే నా ఉద్దేశంలో సత్యభామ పాత్రలో ఎవరైతే మెప్పిస్తారో వారే కూచిపూడి నర్తకి కింద లెక్క. ఏడాది కాలం నృత్యం నేర్చుకున్న తర్వాత నేను అరంగేట్రం ఇచ్చా. అదృష్టవశాత్తు అందరూ నన్ను మెచ్చుకున్నారు. మీడియాలో నా గురించి మంచి కథనాలొచ్చాయి. వెంటనే 12 ప్రోగ్రాములు చేసే అవకాశం దక్కింది. విదేశాల్లో కూడా ప్రదర్శనలు ఇచ్చా.   ట్రినిడాడ్‌లో నా ప్రదర్శనను ఇద్దరు దంపతులు చూశారు. నా డ్యాన్స్‌ చూసి అభిమానంతో వాళ్ల పాపకు నా పేరు పెట్టుకున్నారు. ఆ సంఘటన ఎప్పటికీ మర్చిపోలేను. 


గురువుగారి మెప్పు ..

గురువు గారు (వెంపటి చినసత్యం) చాలా కఠినమైన శిక్షకుడు. ఒకసారి చండాలిక నృత్యరూపకం చేస్తున్నాం. ‘‘చండాలిక పాత్రలో నువ్వు జీవించాలి. ఏ మాత్రం నచ్చకపోయినా తీసిపారేస్తా’’ అన్నారు. ఆ నృత్యరూపకంలో నేను ఏడ్వాలి. కానీ ఎంత సేపు ప్రాక్టీసు చేస్తున్నా- నాకు ఏడుపు రావటం లేదు. దాంతో ప్రోగ్రామ్‌ క్యాన్సిల్‌ చేయండని కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఒక్కసారిగా ఏడుపొచ్చేసింది. ఆయన దగ్గరకు వెళ్లి- ‘గురువుగారు.. ఇప్పుడు చేస్తాను’ అన్నాను. ఆయన నన్ను ఒకే ఒక్కసారి అభినందించారు.  నాకు తట్టు వ్యాధి వచ్చి.. ప్రోగ్రామ్‌ చేయలేని స్థితిలో ఉన్నా. కానీ తప్పనిసరిస్థితుల్లో ప్రోగ్రామ్‌ చేయాల్సి వచ్చింది. తట్టు అంటువ్యాధి కాబట్టి మేకప్‌మ్యాన్‌ నాకు మేకప్‌ వేయటానికి ఇష్టపడలేదు. దాంతో నేనే మేకప్‌ వేసుకొని ప్రోగ్రామ్‌ పూర్తి చేశా. అప్పుడు గురువుగారు ‘ఇప్పుడు ఆర్టిస్టువనిపించుకున్నావమ్మా’ అన్నారు. నా జీవితంలో నాకు వచ్చిన అతి గొప్ప కాంప్లిమెంట్‌ అది.’’       





అమ్మవారిని చూసినట్టు ఉండేది 

కూచిపూడి నాట్యానికి పట్టాభిషేకం చేసిన గురువు శోభానాయుడు. ప్రముఖ నర్తకి అలేఖ్య పుంజల మాటల్లో చెప్పాలంటే... నాట్యం వేరు... ఆమె వేరు కాదు. జీవితమే నటరాజ పాదాంకితం చేసిన మహోన్నత కళాకారిణి. వీరిద్దరిదీ నలభై ఏళ్ల అనుబంధం. భావోద్వేగాల బంధం. శోభానాయుడును అక్కలా భావించే అలేఖ్య ఆమెతో తన అనుబంధాన్ని పంచుకున్నారు... 

శోభానాయుడు గారికి నాట్యమే జీవితం. ఆ ప్రస్థానంలో మరుపురాని ఘట్టాలెన్నో. ఆమెతో నాది నలభై ఏళ్ల ప్రయాణం. హైదరాబాద్‌లో కూచిపూడి గురువు వెంపటి చినసత్యం గారి దగ్గర డ్యాన్స్‌ నేర్చుకోవడానికి వెళ్లినప్పుడు శోభానాయుడును కలిశాను. అక్కడ మొదలైన మా ప్రయాణం ఇన్నేళ్లు కొనసాగింది. తెలుగు విశ్వవిద్యాలయంలో ఉన్నప్పుడు... మేము కొత్తగా ఏ వర్క్‌ చేసినా ఆమెకు చూపించేవాళ్లం. ఎంతో ప్రోత్సహించేవారు. అనంతరం నేను ఫ్యాకల్టీగా చేసినప్పుడు కూడా యూనివర్సిటీకి వస్తుండేవారు. శోభానాయుడు నగరంలో ‘కూచిపూడి ఆర్ట్స్‌ అకాడమీ’ నెలకొల్పినప్పటి నుంచి ఆవిడతో అనుబంధం మరింత పెరిగింది. నాట్యంతోనే మా బంధం మొదలైనా... రాను రాను ఆవిడ నాకు మరింత సన్నిహితురాలయ్యారు. నన్ను ఎంతో ఆప్యాయంగా పలుకరించేవారు. నేను ఏ నాట్య ప్రదర్శన ఇచ్చినా... ఎన్ని పనులున్నా పక్కనపెట్టి వచ్చేవారు. ప్రత్యక్షంగా చూసేవారు. అలాగే ఆవిడ ప్రదర్శనలున్నప్పుడు ప్రత్యేకంగా ఫోన్‌ చేసి మరీ రమ్మని ఆహ్వానించేవారు.


శోభానాయుడు నాట్యగురువే కాదు... నాకు పెద్ద దిక్కులాంటివారు. నా హృదయంలో ఆవిడది ఒక అక్క స్థానం. అందుకే ఎప్పుడూ ఆమెను ‘అక్కా’ అనే పిలిచేదాన్ని. కూచిపూడి నాట్యానికి వైభవం తెచ్చిన నర్తకి శోభానాయుడు. ప్రపంచ వ్యాప్తంగా దానికి ప్రాచుర్యం కల్పించడంలో ఎనలేని కృషి చేశారు. పలు డ్యాన్స్‌ డ్రామాలు, బాలేలు రూపొందించారు. సత్యభామ, పద్మావతి, చండాలిక... ఏ పాత్రలోనైనా ఇమిడిపోతారు. పద్మావతిగా వేదికపైకి వచ్చారంటే... కళ్లు తిప్పుకోలేం. సాక్షాత్తూ ఆ అమ్మవారే మన ముందు ప్రత్యక్షమైనట్టు ఉంటుంది. మేమిద్దరం కలిసి ఎన్నో వేదికలు పంచుకున్నాం... ప్రదర్శనలు ఇచ్చాం. నా జీవితంలో ప్రతి ముఖ్యమైన ఘట్టంలో ఆమె ఉన్నారు. ‘శ్రీకృష్ణ పారిజాతం’లో నేను రుక్మిణిగా, ఆమె సత్యభామగా చేసిన సందర్భం ఎన్నటికీ మరిచిపోలేని ఘట్టం. 

మొన్నామధ్య మా అబ్బాయి పెళ్లికి ఆహ్వానిస్తే... ఎంతో దూరం నుంచి వచ్చారు. పిల్లల్ని ఆశీర్వదించారు. ఇప్పుడామె లేరంటే నమ్మలేకపోతున్నాను. ఆ బాధను దిగమింగుకోలేకపోతున్నాను. ఎంతో దగ్గరి మనిషి దూరమైనట్టుంది. ఆవిడ పుట్టినరోజునాడు ఫోన్‌ చేసి శుభాకాంక్షలు చెప్పాను. కరోనా ప్రభావం తగ్గిన తరువాత కలుద్దామనుకున్నాం. అనారోగ్యంతో నాలుగైదు రోజులుగా ఆస్పత్రిలో ఉన్నారంటే... తిరిగి వస్తారులే అనుకున్నా. ఇంతలోనే ఇలాంటి వార్త వినాల్సి వస్తుందనుకోలేదు. కనీసం కడచూపు కూడా చూడలేని పరిస్థితి ఇది. ఆమె లేరన్న నిజం తలుచుకొంటేనే గుండె బరువెక్కుతోంది. 


Updated Date - 2020-10-15T06:15:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising