మాటకు.. పాటకు.. చిరునామా
ABN, First Publish Date - 2020-10-04T05:30:00+05:30
బాలు అంటే తెలుగు మాట. బాలు అంటే తెలుగు పాట. తెలుగు సినీ సంగీత చరిత్రలో ఆయనది ఒక ప్రత్యేక అధ్యాయం. బాలు 50 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఆయనతో పాటు ప్రయాణించిన స్నేహితులెందరో! అలాంటి వారిలో ముఖ్యలు సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్, గాయకుడు మనో. వీరు నవ్య కోసం ప్రత్యేకంగా బాలుతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు...
బాలు అంటే తెలుగు మాట. బాలు అంటే తెలుగు పాట. తెలుగు సినీ సంగీత చరిత్రలో ఆయనది ఒక ప్రత్యేక అధ్యాయం. బాలు 50 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఆయనతో పాటు ప్రయాణించిన స్నేహితులెందరో! అలాంటి వారిలో ముఖ్యలు సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్, గాయకుడు మనో. వీరు నవ్య కోసం ప్రత్యేకంగా బాలుతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.
మాధవపెద్ది సురేశ్: బాలుగారి మరణం మనందరికీ తీరని లోటు..
మనో: అవునండీ. ఆయనతో మీది, నాది 40 సంవత్సరాల ప్రయాణం. ఎన్నో అద్భుతమైన మజిలీలు, అందమైన అనుభవాలు.
సురేశ్: ఆయనతో నీ తొలి పరిచయం ఎలా జరిగిందో గుర్తుందా?
మనో: 13 ఏళ్ల వయస్సులో .. అంటే 1979లో దాసరిగారు ‘ఓ ఆడది ఓ మగాడు’ చిత్రంలో నాకు ఓ వేషం ఇచ్చారు. ఆ చిత్రం పాటల రికార్డింగ్‌లో బాలుగార్ని తొలిసారిగా చూశాను. ఆ సినిమాలో బాలుగారు నాకు పాడపాడారు.
సురేశ్: ఆయన నీకు పాట పాడారు. కానీ నువ్వు ఆయనకు ఎప్పుడైనా పాట పాడావా?
మనో: లేదు. నాకా అవకాశం రాలేదు. కానీ ఆయన నటించిన ‘ప్రేమికుడు’ సినిమాలో ‘ముక్కాల ముక్కాబల’ పాట పాడాను. బాలుగారితో మీ తొలి పరిచయం ఎలా అయింది?
సురేశ్: మా అన్నయ్య మాధవపెద్ది రమేష్, నేను - ‘భావనా గాన స్రవంతి’ పేరుతో సంగీత ప్రదర్శనలు ఇచ్చేవాళ్లం. అన్నయ్య అప్పటికే ప్రముఖ దర్శకుడు చలపతిరావుగారి దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసేవాడు. ఒకసారి మా సంగీత ప్రదర్శనలలో భాగంగా బాలుగారి ప్రోగ్రామ్ పెట్టాం. ఆయన ట్రూప్‌లో హార్మోనిస్టుగా రాజయ్య (ఇప్పటి ఇళయరాజా), వాళ్ల తమ్ముడు అమర్‌సింగ్ గిటారి్‌స్టగా ఉండేవారు. బాలుగారిని దగ్గర నుంచి చూడడం అదే. ఆ సంగీత విభావరిని ఇప్పటికీ మర్చిపోలేను. నువ్వు కూడా బాలుగారిలా గాయకుడివే కదా.. ఆయన గురించి ఏం చెబుతావు?
మనో: బాలుగారు సంగీతాన్ని ప్రేమించినంతగా ఇంకెవ్వరూ ప్రేమించలేదు. సంగీత దర్శకుడు చిన్నా.. పెద్దా.. అనేది ఆయనకు అనవసరం! ‘వాళ్లు ఇచ్చే పాట నా ద్వారా బయటకు వెళ్తోంది.. దానికి ఏ మేరకు న్యాయం చేయగలను?’ అనే విషయాన్ని మాత్రమే చూసేవారు. రికార్డింగ్‌లలో మాత్రమే కాదు. కచేరీలలో కూడా అంతే. ‘అంత పేరున్న వ్యక్తే అంత నిబద్దతతో ఉంటే.. నాలాంటి వాళ్లు ఇంకెంత కష్టపడాలి’ అనిపించేది. ఆయన దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నా. మరి ఒక సంగీత దర్శకుడిగా మీ అనుభవాలేమిటి?
సురేశ్: బాలుగారు సంగీత దర్శకత్వం వహించిన అనేక సినిమాలకు కీబోర్డు ప్లేయర్‌గా పనిచేశా. 1988లో నేను తొలిసారిగా సంగీత దర్శకత్వం వహించిన ‘హైహై నాయక’ చిత్రంలో తొలి పాటను బాలుగారు, జానకిగారు పాడారు. ఆ తర్వాత నా దగ్గర అనేక పాటలు పాడారు. ‘మేడమ్’ సినిమాలో ఆడగొంతుతో బాలుగారితో ఓ పాట పాడించాను. అది కూడా పెద్ద హిట్. ఇక- ‘నృసింహ శతకం’ అనే ప్రైవేట్ ఆల్బమ్‌లో వంద రాగాలతో వంద సీస పద్యాలు పాడించా. సంగీత దర్శకుడిగా నాకు పూర్తి సంతృప్తినిచ్చిన సింగర్ ఆయన. నువ్వు కూడా కొన్ని సినిమాలకు సంగీత దర్శకత్వం వహించావు కదా.. వాటిలో ఆయన పాడలేదా?
మనో: జొన్నవిత్తుల గారు నా మీద అభిమానంతో ఒక సినిమా చేయించారు. అందులో ఒక పాట బాలుగారితో పాడించాలని పది రోజులు వెయిట్ చేశాను. ఆయనకు జ్వరం వచ్చి పాటలు పాడలేని పరిస్థితి. నాకు ఆ ప్రాప్తంలేదు. అర్జెంట్ అనడంతో ఆ పాట నేనే పాడేశాను. ఆయన సంగీత దర్శకత్వంలో నేను పాడలేదు. నా సంగీత దర్శకత్వంలో ఆయన చేత పాడించలేకపోయా! అది నా దురదృష్టం.
బాలుగారు సంగీతాన్ని ప్రేమించినంతగా ఇంకెవ్వరూ ప్రేమించలేదు. సంగీత దర్శకుడు చిన్నా.. పెద్దా.. అనేది ఆయనకు అనవసరం. ‘వాళ్లు ఇచ్చే పాట నా ద్వారా బయటకు వెళ్తోంది.. దానికి ఏ మేరకు న్యాయం చేయగలను?’ అనే విషయాన్ని మాత్రమే చూసేవారు. రికార్డింగ్‌లలో మాత్రమే కాదు. కచేరీలలో కూడా అంతే. ‘అంత పేరున్న వ్యక్తే అంత నిబద్ధతతో ఉంటే.. నాలాంటి వాళ్లు ఇంకెంత కష్టపడాలి!?’ అనిపించేది.
సురేశ్:బాలుగారు అనగానే డబ్బింగ్‌లు కూడా గుర్తుకొస్తాయి. నువ్వు కూడా డబ్బింగ్ ఆర్టి్‌స్టవే కదా! డబ్బింగ్ ఆర్టి్‌స్టగా ఆయన మీద నీ అభిప్రాయమేమిటి?
మనో: నేను డబ్బింగ్ ఆర్టి్‌స్టగా మారకముందే బాలుగారు డబ్బింగ్ చెప్పడం ప్రారంభించారు. మొదట్లో కమల్‌కు చక్రవర్తిగారు డబ్బింగ్ చెప్పేవారు. ఆ తర్వాత బాలుగారు చెప్పటం మొదలుపెట్టారు. ఆయన ప్రేరణతోనే రజనీకాంత్‌గారికి డబ్బింగ్ చెప్పటం మొదలుపెట్టా. కొన్ని సార్లు కమల్‌కు నేను కూడా డబ్బింగ్ చెప్పాల్సి వచ్చింది. నన్ను రికమెండ్ చేసింది కూడా బాలుగారే! ‘సతీలీలావతి’ సినిమాకు మనో డబ్బింగ్ చెబితేనే బాగుంటుంది’ అని కమల్‌గారికి గట్టిగా చెప్పింది ఆయనే! తమిళంలో కోయంబత్తూర్ యాసలో కమల్‌గారు డబ్బింగ్ చెబితే... నేను గోదావరి యాసలో చెప్పా. ‘బ్రహ్మచారి’ చిత్రంలో కూడా కమల్‌కు నెల్లూరు యాసలో చెప్పా.
సురేశ్: బాలుగారి డబ్బింగ్ అంటే అన్నమయ్య గుర్తుకొస్తుంది. ‘గాంధీ’ చిత్రంలో అటెన్‌బరోకు తెలుగులో డబ్బింగ్ చెప్పింది బాలుగారే! జంధ్యాలగారికి డబ్బింగ్ చెప్పింది కూడా ఆయనే! అందుకే ఆయన మాటకు, పాటకు ఒక చిరునామా అనిపిస్తుంది.
మనో: నాలాంటి అనేక మంది గాయకులకు భిక్ష పెట్టింది ఆయనే! అందుకే ఎప్పుడు ఆయనకు రుణపడి ఉంటాం.
బాలుగారి అబ్బాయి చరణ్‌తో నేను కలిసి పాడలేదు. అమ్మాయి పల్లవితో మాత్రం రహమాన్‌గారి దర్శకత్వంలో పాడా.
- మనో
పల్లవికి 13 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు ‘చిన్నారి గీతాలు’ అనే పేరు మీద ఆల్బమ్ చేశా. సంగీత దర్శకుడయిన తర్వాత చరణ్‌తో రెండు పాటలు పాడించా.
- మాధవపెద్ది సురేశ్
Updated Date - 2020-10-04T05:30:00+05:30 IST