ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బంధముక్తులకు అతీత స్థితి

ABN, First Publish Date - 2020-12-09T08:55:00+05:30

దేవుడే అయిన జీవుడు (లేదా) తనను తాను ఆత్మస్వరూపుడిగా తెలుసుకున్న జీవుడు.. ఇక్కడే.. ఈ దేహంలో ఉండగానే బంధముక్తులు లేని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బంధముక్త్యతీతం పరం సుఖం

విందతీహజీవస్తు దైవికః


దేవుడే అయిన జీవుడు (లేదా) తనను తాను ఆత్మస్వరూపుడిగా తెలుసుకున్న జీవుడు.. ఇక్కడే.. ఈ దేహంలో ఉండగానే బంధముక్తులు లేని పరమ సుఖాన్ని, ఆత్మ సుఖాన్ని పొందుతాడని దీని అర్థం. భగవాన్‌ రమణ మహర్షి లోకానికి అందించిన 30 శ్లోకాల ఆత్మజ్ఞాన గ్రంథం ‘ఉపదేశ సారం’లోని 29వ శ్లోకమిది. బంధముక్తులకు అతీతమైన పరిపూర్ణ సుఖాన్ని పొందేవారెవరో రమణులు ఈ శ్లోకం ద్వారా తెలిపారు. ‘‘నేను జీవుణ్ని, అల్పుణ్ని, పరిమితమైనవాడిని’’ అనే భావన కలిగి ఉన్నందువల్లనే మనకు ఏదో బంధంలో ఉన్న భావన కలుగుతుంది. ఈ అజ్ఞానాన్ని పోగొట్టుకుని జ్ఞానంలో నిలవడమే ముక్తి.


సాధన చేసి.. ఆద్యంత రహితం, సూక్ష్మాతిసూక్ష్మం, సర్వవ్యాపకం, సచ్చిదానంద స్వరూపం అయిన ఆత్మగా ఉన్నట్లయితే ఇక బంధం ఏమిటి? ముక్తి ఏమిటి? ఆత్మ సర్వస్వతంత్రం. అది ఒక్కటే. రెండోదేదీ లేదు. దాన్ని బంధించే మరొకటి ఉండే వీలులేదు కనుక బంధం నుంచి విడిపించుకుని ముక్తిపొందడం అన్న ప్రశ్నే లేదు. జైల్లో ఉన్నట్టు కల వస్తే.. ‘అయ్యో జైల్లో ఉన్నానే. ఎలా తప్పించుకోవాలి?’ అని మధనపడతాం. ఏవో ప్రయత్నాలు చేస్తాం. మెలకువ వచ్చాక.. ఇంట్లోనే పరుపుపై హాయిగా పడుకుని ఉన్నాక ఆ ప్రయత్నం చేస్తామా? తప్పించుకోవాలని అనుకుంటామా? లేదు. స్వప్నంలో, భ్రమలో ఉన్నంతకాలమే ఆ భావన.


మేలుకున్నాక బంధింపబడటమూ ఉండదు. బయటపడాలన్న తపనా ఉండదు. అదేకోవలో బ్రహ్మానుభూతిలో.. ‘నేను ఆత్మను’ అనే ఆత్మనిష్ఠలో నిలిస్తే ఇక బంధమూ లేదు. ముక్తీ లేదు. ఇలా ఆత్మగా ఉండడానికి, బ్రహ్మానందానుభవంలో నిలిచిపోవడానికి జీవుడు మరణం వరకూ ఎదురు చూడక్కర్లేదు. ఇక్కడే ఈ దేహంలో ఉండగానే.. ‘నేను ఆత్మను. నన్ను నేను ఇంతవరకూ మరచిపోయాను. నేను ఎల్లప్పుడూ ఆత్మనే’ అని సద్గురువు ద్వారా శ్రవణం చేసి, మనన నిధిధ్యాసనలతో అన్ని అర్హతలూ పొందిన జీవుడు ఆ అనుభూతిని పొందవచ్చు. జీవుడు ఆత్మగా మారక్కర్లేదు. ‘నేనసలు ఆత్మనే’ అని గ్రహిస్తే సరిపోతుందంతే. అయితే, అట్టివారు అరుదుగా ఉంటారు. ఉన్నవారు పూజనీయులు. వారే దైవిక జీవులు. ఆత్మభావన సహజమైపోయిన తర్వాత బంధంలో ఉన్నాననే భావన పోతుంది. అది పోతే ముక్తిని పొందాననే స్మరణా పోతుంది. ఇదే బంధముక్తులకు అతీతమైన స్థితి. 


దేవిశెట్టి చలపతిరావు

Updated Date - 2020-12-09T08:55:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising