ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కురుక్షేత్ర సంగ్రామం ఒక యజ్ఞం

ABN, First Publish Date - 2020-12-18T10:03:41+05:30

కురుక్షేత్ర సంగ్రామం ఒక యజ్ఞం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • అనుజులు ఋత్విజులుగ నీ
  • పని యిటు సేయుమని నీ వుపద్రష్టవుగా
  • విను కురు కుమార పశు విశ
  • సనమున రణయజ్ఞ మతడు సమ్మతి జేయున్‌!

హాభారత యుద్ధాన్ని నివారించే ప్రయత్నంలో భాగంగా జరిగిన కృష్ణ రాయబారం విఫలం కావడంతో.. కృష్ణుడు, కర్ణుడిని పాండవ పక్షంలోకి ఆహ్వానిస్తాడు. కర్ణుడు పాండవ పక్షంలో చేరితే దుర్యోధనుడు యుద్ధాన్ని విరమిస్తాడనేది కృష్ణుని ఆశ. కానీ.. కర్ణుడు తాను దుర్యోధనుని విడిచి రానంటూనే జరగబోయే పరిణామాలను సూచిస్తూ ఒక మాట చెబుతాడు.. 


ధర్మరాజు తమ్ములు ఋత్విజులుగా, కృష్ణుడు ఉపద్రష్టగా, కౌరవులు పశువులుగా రణయజ్ఞం చేయాలని కర్ణుడు చెప్పడాన్ని బట్టి.. జరగబోయే పరిణామాల గూర్చిన సమగ్రమైన అవగాహన అతడికి ఉన్నట్లుగా కనిపిస్తుంది. వ్యాస మహర్షి.. భారత సంగ్రామాన్ని యజ్ఞంగానే అభివర్ణించారు. సంస్కృత భారతంలో కర్ణుడు.. ఆ యజ్ఞానికి శ్రీకృష్ణుని ఆధ్వర్యం చేసేవాడుగా, అర్జునుణ్ని హోతగా, గాండీవం స్రుక్కుగా, యోధుల పరాక్రమాన్ని ఆజ్యంగా, అర్జునుడు ప్రయోగించే ఐంద్రం, పాశుపతం మొదలైన అస్త్రాలను మంత్రాలగా, భీష్ముణ్ని ఉద్గాతగా, యుధిష్టిరుణ్ని బ్రహ్మగా, రథ పంక్తులను (సమూహాలు) యూపస్తంభాలుగా, స్రవించే రక్తాన్ని హవిస్సుగా, పరిఘలు శక్తులుగా, గదలు ఇధ్మములుగా పోలుస్తూ.. కురుక్షేత్రాన్ని ఒక యజ్ఞవాటికగా వర్ణిస్తాడు. ఎప్పుడు ద్రోణుడు, భీష్ముడు, పాంచాలురు నేల కూలుతారో అప్పుడే యజ్ఞం చివరి దశ అని.. గాంధారితో కలిసి ఆమె కోడళ్లు దుఃఖించడం అవబృథ స్నానం అవుతుందని కూడా చెబుతాడు.


పరిణామాలు తెలిసీ వాటిని పట్టించుకోకుండా రాజ్యలోభం, పుత్రవాత్సల్యం అనే బంధనాలలో చిక్కి తాను సంపూర్ణంగా నశించి, అపార సేనావాహినితో పాటుగా కౌరవ కుల మారణహోమానికి తెరలేపిన ధృతరాష్ట్రుని అవివేకతకు.. దుర్మార్గమే ఆకృతిగా, కౌర్యం మనస్సుగా అవిర్భవించిన దుర్యోధనుని రాజ్యకాంక్ష తోడైంది. కర్ణశకునులు దానికి ఆజ్యాన్ని అందించారు. ఫలితంగా మహాభారత యజ్ఞం అనివార్యమైంది. తనకు అంగ రాజ్యమిచ్చి గౌరవించిన దుర్యోధనునికి కర్ణుడు ఆజన్మాంతం నమ్మకస్థుడైన స్నేహితుడై ఋణం తీర్చుకున్నాడు.


ధర్మాధర్మ వివక్షకన్నా మిత్రధర్మమే మిన్న అనే భావనతో దుర్యోధనుని దుశ్చేష్టలన్నింటినీ సమర్థించాడు. దుర్యోధనునికి సంతోషాన్ని కలిగించేందుకే ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో ఆమెను అవమానించాడు. తన మాత్సర్యం, చెడు సహవాసంలో కలిగిన అధార్మిక వృత్తి వెరసి ఒక మహా సంగ్రామానికి నాంది పలకగా అందులో తానూ తన సంతానానితో సహా మరణించాడు. లక్షల మంది మరణాలకు కారణమయ్యాడు. అలాంటి కర్ణుడు కూడా జరగబోయే పరిణామాన్ని దర్శించి దానిని ఒక యజ్ఞంగా చెప్పడం, దానిలో తాము సమిధలమయి పోతామనే సత్యాన్ని చెప్పడం ఒక విశేషం.               

- పాలకుర్తి రామమూర్తి

Updated Date - 2020-12-18T10:03:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising