జీవుణ్ని వెంటాడే మంచి, చెడు
ABN, First Publish Date - 2020-05-09T09:36:14+05:30
శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునకు గీతోపదేశ సందర్భంలో చెప్పిన శ్లోకమిది. ‘‘అర్జునా! ప్రకృతిసిద్ధమైన ఈ మూడు (సత్వ, రజో, తమో) గుణాలూ జీవుని ..
సత్త్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః
నిబద్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయమ్
శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునకు గీతోపదేశ సందర్భంలో చెప్పిన శ్లోకమిది. ‘‘అర్జునా! ప్రకృతిసిద్ధమైన ఈ మూడు (సత్వ, రజో, తమో) గుణాలూ జీవుని బంధిస్తాయి. వీటి ప్రభావము చేతనే మూర్ఖులు తాము చేసే కర్మలన్నింటికీ తామే కర్తలుగా భావిస్తారు. కానీ, జీవుడు కర్త కానేరడు. సత్వ గుణోపేతులు స్వర్గాది ఊర్థ్వలోకాలను పొందుతారు. రజో గుణ సంపన్నులు మనుష్యలోకంలో జన్మిస్తారు. తమో గుణ ప్రధానులు అధోగతి పాలై క్రిమికీటక, పశుపక్ష్యాది జన్మలు గలిగి నరక ప్రాప్తి పొందుతారు. పార్థా! సత్వగుణం నిర్మలమై, ప్రకాశవంతమై ఉంటే.. రజోగుణం కామాసక్తజనితమై కర్మలనే తాళ్లతో జీవుల్ని బందీల్ని చేస్తుంది. తమో గుణం మోహకారకమై జీవుని నిద్ర, సోమరితనంతో బంధిస్తుంది. పార్థా.. కామ, క్రోధ, లోభ, మోహాలే నరక ద్వారాలు’’ అని హెచ్చరించాడు.సాత్విక సంబంధాలైన సత్య, శౌచ, దయాదులు జీవుడికి ముక్తి కలిగిస్తాయని పార్వతీదేవితో శివుడు చెప్పాడు.
పూర్వం మనుష్యులకు పూర్వజన్మ స్మృతి ఉండడంతో అందరూ పుణ్యం చేసి స్వర్గానికి చేరేవారట. దీంతో అక్కడ రద్దీ పెరిగిపోయింది. దేవతల కోరికతో బ్రహ్మదేవుడు.. జనులందరూ పుణ్యకార్యాలు చేయకుండా వారి పూర్వజన్మ విజ్ఞానాన్ని తొలగించి.. మనుష్యులను కామక్రోధ వశులుగా చేశాడని పురాణ ప్రతీతి. అయితే.. గత జన్మ స్పృహ లేకున్నా, మనిషికి ఉన్న వరం.. బుద్ధి, జ్ఞానంతో ఆలోచించగలిగే శక్తి. ధర్మకార్యాచరణ చేయగలిగే శక్తి ఈ లోకంలో ఒక్క మానవులకు మాత్రమే ఉంది. సాత్విక గుణాలతో మాత్రమే అది సాధ్యం. మనిషి తనకుండే విచక్షణను అనుసరించి సాత్విక నియమాలను అనుసరించడం ద్వారా కామ, క్రోధ, మోహాదులను తొలగించుకుని ముక్తిమార్గంలో నడవగలడు. జంతువులు ఆ పని చేయలేవు. ‘‘జంతూనాం నరజన్మ దుర్లభం’’ ..ఎంతో పుణ్యం చేస్తే తప్ప మానవజన్మ లభించదు. అలాంటి గొప్ప జన్మ లభించిన మానవులు.. ఆనురీ ప్రవృత్తిని విడనాడి దైవ గుణ సంపత్తిని అలవాటు చేసుకోవాలి.
కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే ఆరు గుణాలే (అరిషడ్వర్గం-మనిషికి ఈ ఆరూ శత్రువులు) ఘోర నరకాలకు ప్రవేశ ద్వారాలు. ఎంత గొప్పవారైనా వాటికి లొంగితే అధోగతి పాలవుతారు. అందుకు ఉదాహరణ నహుషుడు. ఎంతో గొప్పవాడైన నహుషుడు ఇంద్రపదవిని అధిష్ఠించినా.. శచీదేవిపై మోహంతో సప్తర్షుల శాపానికి గురై పదవీభ్రష్టుడయ్యాడు. అంతేకాదు.. కొండచిలువై భూలోకంలో ఓ అరణ్యంలో పడి 10 వేల సంవత్సరాలు అలాగే తిరిగాడు. ఇలాంటివారు ఎందరో మన పురాణాల్లో కనిపిస్తారు. అరిషడ్వర్గాలకు లొంగి దుర్మార్గులైనవారు 21 నరకాలు అనుభవించాల్సి ఉంటుందని పరీక్షిత్ మహారాజుకు శుకమహర్షి బోధించాడు. కాబట్టి.. మంచి, చెడుల ప్రభావం జీవులను వెంటాడుతుందని గ్రహించి మసలుకోవాలి.
- రాయసం రామారావు, 9492191360
Updated Date - 2020-05-09T09:36:14+05:30 IST