ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మనిషిని దిద్దే మహాగ్రంథం.. భాగవతం

ABN, First Publish Date - 2020-03-16T08:35:50+05:30

బంగారాన్ని నిప్పులో వేసి పుటం పెట్టిన తర్వాతే అది చొక్కమైన బంగారమా కాదా తెలుసుకోవచ్చు. మహాభయంకరమైన యుద్ధరంగంలోనే మహావీరుని శౌర్యపరాక్రమాలు తెలుస్తాయి. ఇళ్లల్లో సంక్షోభాలు నెలకొన్నప్పుడే సమయస్ఫూర్తితో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ధనంజయే హాటక సంపరీక్షా

రణాంగణే శస్త్ర భృతాం పరీక్షా

విపత్తికాలే గృహిణీ పరీక్షా

విద్యావతాం భాగవతే పరీక్షా


బంగారాన్ని నిప్పులో వేసి పుటం పెట్టిన తర్వాతే అది చొక్కమైన బంగారమా కాదా తెలుసుకోవచ్చు. మహాభయంకరమైన యుద్ధరంగంలోనే మహావీరుని శౌర్యపరాక్రమాలు తెలుస్తాయి. ఇళ్లల్లో సంక్షోభాలు నెలకొన్నప్పుడే సమయస్ఫూర్తితో వ్యవహరించే గృహిణి చాకచక్యం తెలుస్తుంది. అలాగే.. విద్యావంతుని విద్వత్తు భాగవత పరీక్షకు నిలిచినప్పుడే తెలుస్తుందని దీని అర్థం. ఒక విధంగా విద్యావంతుడి పరీక్షాస్థానం భాగవతమేనన్నది సారాంశం. ఈ మాట ఎందుకు ప్రచారంలోకి వచ్చిందో విచారిస్తే ఎన్నెన్నో సత్యాలు తెలుస్తాయి. భాగవత పురాణంలో భగవత్సంబంధమైన కథలు, అవతార విశేషాలు, భక్తుల కథలు ఉంటాయి. వాటి గురించి తెలుసుకోవడానికి అంత పాండిత్యం అవసరమా అన్నది ప్రశ్న. కానీ, జాగ్రత్తగా గమనిస్తే భాగవతంలోని కథలన్నింటి వెనుక గొప్ప తాత్వికత, మానవ ప్రవర్తనలో రావాల్సిన మార్పులు, జీవుల వేదనలలోని అంతస్తత్వాలు కనిపిస్తుంటాయి. అయినప్పటికీ.. చూడటానికి, వినడానికి భక్తిమార్గం బోధిస్తున్న ఐతిహ్యంలా కనిపిస్తూ, అవన్నీ చాలా సులభమైన విషయాల్లా కనిపించడమే భాగవతంలోని కథలు, విశేషాల ప్రత్యేకత.


‘భక్త్యా భాగవతం జ్ఞేయం, న వ్యుత్పత్త్యా న టీకయా’

..అంటే భాగవత పురాణం పాండిత్యం వల్లనో, టీకా తాత్పర్యాలు చదవడం వల్లనో అర్థం కాదు. అది కేవలం భక్తి వల్ల మాత్రమే తెలియబడుతుంది. అష్టాదశ పురాణాలను, పంచమవేదాన్ని లోకానికి అందించిన వేద వ్యాస మహర్షికి కూడా ఏర్పడ్డ అసంతృప్తి, అసహనం భాగవత రచన వల్ల మటుమాయమయ్యాయి. భాగవతంలో కనిపించే గజేంద్రమోక్ష ఘట్టం, ప్రహ్లాద చరిత్ర, క్షీరసాగరమథనం, శ్రీకృష్ణభగవానుని అవతార విశేషాలు అన్నీ భక్తిని తెలియజేసేవి, అవతార విశిష్టతలను తెలిపేవే అయినా వాటి అంతరార్థం మాత్రం.. మనిషికి మంచి మార్గాన్ని దర్శింపజేయడమే. అందుకే పండితులైనవారు భాగవత ప్రచారం చెయ్యాలి. తెలుగులో భాగవతాన్ని అందించిన బమ్మెర పోతనామాత్యుడు ఈ విషయాన్నే చెబుతూ.. ‘‘భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు శూలికైన తమ్మి చూలికైన’’ అన్నాడు. ఆ తెలిసి పలకడమే మనిషిని ఉద్ధరించడం, మనిషికి ఆధారంగా నిలవడం, మానవలోకానికి మార్గదర్శి కావడం. అడుగడుగునా భక్తితోపాటు మనిషి ప్రవర్తనకు పెద్ద పీట వేసిన మహాభాగవతం అన్ని కాలాల్లోనూ ఆదర్శంగా నిలిచే మహాగ్రంథం.

- గన్నమరాజు గిరిజామనోహరబాబు

Updated Date - 2020-03-16T08:35:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising