అడవిలో వీరపూజ
ABN, First Publish Date - 2020-02-07T06:14:08+05:30
మేడారం జాతర... వందల ఏళ్ల ఆదివాసీల వేడుక - ఇప్పుడు సకలజనుల సంబరం. ఇది విగ్రహలు, దేవతామూర్తుల ఆనవాళ్లు కనిపించని జాతర... ఆసియా ఖండంలో అతిపెద్ద గిరిజన ఉత్సవం.
మేడారం జాతర... వందల ఏళ్ల ఆదివాసీల వేడుక - ఇప్పుడు సకలజనుల సంబరం. ఇది విగ్రహలు, దేవతామూర్తుల ఆనవాళ్లు కనిపించని జాతర... ఆసియా ఖండంలో అతిపెద్ద గిరిజన ఉత్సవం. ప్రతి రెండేళ్ళకు ఒకసారి జరిగే ఈ జాతరతో మేడారం జనసంద్రం అయింది. మొక్కులు తీర్చుకోడానికి భక్త కోటి తరలివచ్చింది.
ప్రకృతినే దేవతలుగా పూజించే పుణ్యస్థలం, గిరిజనులు ఆరాధ్య దైవంగా పూజించే సమ్మక్క-సారలమ్మలు కొలువైన ప్రాంతం తెలంగాణ రాష్టం ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం. కీకారణ్యమైన ఆ ప్రాంతంలో రెండేళ్లకొకసారి మాఘ మాసంలో నాలుగు రోజులపాటు జరిగే జాతర వైభవం వర్ణనకు అందదు.
ఎన్నెన్నో కథనాలు
సమ్మక్క- సారలమ్మల గురించి బాగా ప్రాచుర్యం ఉన్న కథ ప్రకారం, ఓరుగల్లు కేంద్రంగా కాకతీయ సామ్రాజ్యం వర్ధిల్లిన కాలంలో గోదావరి తీరాన ఉన్న దట్టమైన అటవీ ప్రాంతానికి పగిడిద్దరాజు, సమ్మక్కలు సామంతరాజులుగా ఉన్నారు. వీరికి సారలమ్మ, జంపయ్య, గంటయ్య, మూగయ్యలు సంతానం. ప్రతాపరుద్రుడి కాలంలో కరువు కాటకాల వల్ల కాకతీయులకు కప్పం కట్టలేని పరిస్థితులు ఎదురయ్యాయి. దీంతో ప్రతాపరుద్రుడి మంత్రి యుగేంద్రుని ఆదేశాల మేరకు కాకతీయ సేనలు పగిడిద్ద రాజు రాజ్యంపై యుద్ధానికి దిగాయి. ఈ యుద్ధంలో సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, జంపయ్య వీరమరణం పొందారు. సారలమ్మ, పగిడిద్దరాజులు యుద్ధ క్షేత్రంలో నేలకొరగగా, సమీపంలో ఉన్న సంపెంగ వాగులో పడిన జంపయ్య గాయపడ్డాడు. సమ్మక్క చిలకల గట్టుపై ఉన్న నెమలినార చెట్టు దగ్గర వీరమరణం పొందింది. వారి పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ జరిపే వీరపూజే మేడారం జాతర అని ఈ కథనం వెల్లడిస్తోంది. కాగా ఆదివాసీలు చెప్పుకునే కథల ప్రకారం, కొందరు గిరిజనులకు అడవిలో ఓ బాలిక కనిపించింది. ఆ బాలికను పులులు కాపలా కాస్తున్నాయి. వారు కొండదేవరను ప్రార్థించగా, ఆ పులులు మాయమయ్యాయి. ఆ బాలికకు వారు ‘సమ్మక్క’ అని పేరు పెట్టుకుని, పెంచి పెద్ద చేశారు. ఎన్నో మహిమలు చేస్తూ, ఆదివాసీల ఇలవేల్పుగా సమ్మక్క మారిందని చెబుతారు. అయితే సమ్మక్కకు సంబంధించిన చరిత్ర అంతా (ప్రస్తుత) చత్తీ్‌సఘడ్ ప్రాంతానికి చెందినదనీ, ఇప్పటికీ ఆదివాసీ పద్ధ్దతిలో సమ్మక్కకు మొక్కులు చెల్లించేది చత్తీ్‌సఘడ్‌కు చెందిన ఆదివాసీలేననీ ప్రస్తుత ఆదివాసీ పూజారులు చెబుతున్నారు.
నేడు మొక్కుల రోజు
సమ్మక్క, సారలమ్మలు కొలువుతీరి ఉండగా భక్తులు మొక్కలు చెల్లించుకొనే మూడో రోజు (శుక్రవారం) ఈ జాతరలో విశిష్టమైనదిగా భక్తులు పరిగణిస్తారు. కులమతాల భేదాలు లేకుండా భారీ ఎత్తున భక్తులు మేడారం చేరుకుని సమ్మక్క, సారలమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంంటారు. నాలుగో రోజు సాయంత్రం సమ్మక్క చిలుకలగుట్టకు, సారలమ్మ కన్నెపల్లికి, పగిడిద్ద రాజు పూనుగొండ్లకు, గోవిందరాజులు కొండాయికి తిరుగు పయనం అవుతారు. దీంతో జాతర ముగుస్తుంది.
తడక రాజనారాయణగౌడ్, భూపాలపల్లి
ప్రకృతే దేవతలు!
ఇతర సాంప్రదాయాలకు సంబంధించిన ఆలయాల్లో దేవతలు శిలా విగ్రహ రూపంలో ఉంటారు. మేడారం గద్దెల వద్ద ఇటువంటి శిలావిగ్రహాలు కనిపించవు. కలపతో చేసిన దేవుని ప్రతిమలను పూజిస్తారు. ఇక మేడారం, కన్నెపల్లిలలో ఉన్న ఆలయాల్లోనూ శిలా విగ్రహ రూపాలు ఉండవు. అక్కడ కుండలలో పసుపు, కుంకుమ రూపంలో వన దేవతలు కొలువుతీరి ఉంటారు. సమ్మక్క, సారలమ్మ గద్దెలకుపై కప్పు వేయరు. గర్బగుడి, ప్రాకారం వంటివి ఉండవు ఎవరైనా సమ్మక్క, సారలమ్మలను చేతులతో తాకి తమ బాదలు, కోరికలు చెప్పుకుని మొక్కుకోవచ్చు. కేవలం రద్దీ కారణంగా జాతర సమయంలో భక్తులను గద్దెలపైకి అనుమతించరు. ఇక్కడ అర్చనలు ఉండవు. సమ్మక్క సారలమ్మ ఆలయాలు గ్రహణ సమయాల్లో సైతం మూతపడవు.. భక్తులు మొక్కుగా ‘బంగారం’ (బెల్లం) సమర్పించడం మేడారం ప్రత్యేకత.
ఎవరి ఆలయాలు ఎక్కడంటే...
సమ్మక్క ప్రధాన ఆలయం మేడారం గ్రామంలోనే ఉంది. 1962కు పూర్వం సమ్మక్క ప్రధానం ఆలయం ఎస్‌ఎస్ తాడ్వాయి మండలం బయ్యక్కపేటలో ఉండేది. రెండేళ్ళకు ఒకసారి అక్కడ జాతర జరిగేది. కరువు కారణంగా 1962లో జాతర నిర్వహించలేని పరిస్థితి ఎదురైంది. అప్పుడు జాతరను మేడారానికి తరలించి ఇక్కడే సమ్మక్కకు ఆలయం నిర్మించారు.
సారలమ్మ ప్రధాన ఆలయం ములుగు జిల్లా ఎస్‌ఎస్ తాడ్వాయి మండలం కన్నెపల్లి గ్రామంలో ఉంది. మేడారం-కన్నెపల్లి మధ్య మూడున్నర కిలోమీటర్ల దూరం ఉంటుంది. తొలి రోజు జరిగే వేడుకల్లో సారలమ్మ మేడారం ప్రయాణం ముఖ్యమైనది. హనుమంతుడి జెండా తోడుగా రాగా సారలమ్మ మేడారం బయలుదేరుతుంది. మార్గమధ్యంలో జంపన్నవాగు గుండా కాలినడకన నడుస్తూ సమ్మక్క ఆలయానికి చేరుకుంటారు. అక్కడ సమ్మక్క-పగిడిద్దరాజుల వివాహానికి హజరై అక్కడి నుంచి గద్దెలపైకి చేరుకుంటారు.
సమ్మక్క భర్త పగిడిద్ద రాజు ఆలయం మహబూబబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లలో ఉంది. పెనక బుచ్చిరాములు పగిడిద్దరాజు ప్రధాన పూజారి. మేడారం-పూనుగొండ్ల మధ్య 70 కిలోమీటర్ల దూరం ఉంటుంది. జాతర సందర్భంగా పూనుగొండ్ల నుంచి మేడారం వరకు పడిగెరూపంలో ఉన్న పగిడిద్దరాజును కాలినడకన మేడారం తీసుకువస్తారు.
పగిడిద్దరాజు తమ్ముడైన గోవిందరాజులు ఆలయం ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండాయి గ్రామంలో ఉంది. మేడారం- కొండాయి మధ్య పదిహేను కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇదంతా అటవీమార్గం. జాతర జరిగే రోజు ఉదయం నుంచి కొండాయిలో ప్రత్యేక పూజలు నిర్వహించి, సాయంత్రం పడిగే రూపంలోని గోవిందరాజులుని మేడారానికి తీసుకువస్తారు.
జాతరలో మూడో రోజు (శుక్రవారం) అత్యంత విశిష్టమైనది. ఈ రోజు భక్తులు తమ మొక్కులు చెల్లించుకుంటారు.
Updated Date - 2020-02-07T06:14:08+05:30 IST