ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కామరహిత హృదయమే రామరాజ్యం

ABN, First Publish Date - 2020-06-24T08:25:11+05:30

మనం నిత్యజీవితాన్ని, ఆధ్యాత్మికతను విడిగా, భిన్నమైనవిగా భావిస్తూ ముందు భౌతిక జీవితం, ఆపై అధ్యాత్మ జీవితం అనుకుంటూ.. జీవితాన్ని లౌకిక భౌతిక విషయాలపై ఆపేక్షతో గడుపుతాం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మనం నిత్యజీవితాన్ని, ఆధ్యాత్మికతను విడిగా, భిన్నమైనవిగా భావిస్తూ ముందు భౌతిక జీవితం, ఆపై అధ్యాత్మ జీవితం అనుకుంటూ.. జీవితాన్ని లౌకిక భౌతిక విషయాలపై ఆపేక్షతో గడుపుతాం. మహోన్నతమైన మానవజన్మ కేవలం పుట్టి, మెట్టి, గిట్టే యాంత్రిక విధానం కాదు. అనల్పకల్పన, అమృత యోగం ఆధారంగా లభించిన అపురూప వరం మానవ జన్మ.


  • అన్ని శబ్దాలు పుట్టె నిశ్శబ్దమందు
  • అన్ని యుగాలు మొదలాయె యోగమందు
  • అన్ని జన్మల చివరాయె, నరజన్మ
  • అరయనరయ, నారాయణాన్వేషితమ్ము!


నారాయణుడిని అన్వేషించాలి. కనుగొనాలి. ఆ అనుభవాన్ని పొందాలి. అందుకే ఈ మానవ జన్మ. సౌందర్యవిలసితమైన మంగళప్రదమైన, సత్యదర్శనకు అనువైన యాగ, యోగ భూమికగా భగవంతుడు అనుగ్రహించినదే మానవ శరీరం. దానితో.. ధర్మసాధన సాగించాలి. కర్మయాగం కొనసాగించాలి. ప్రపంచంలో ఉంటూనే మంచి భావాలతో, మంచి పనులతో, మంచి సాంగత్యంలో, నిత్యజీవితం రమణీయంగా నడవాలి. ఆ ఒడుపు తెలిసేదాకా, మనకంటే ముందు ఈ ప్రపంచాన్ని తమ జీవన విధానంలో ప్రభావితం చేసి, పరమ పావన భావనామయంగా గడిపి.. తామే విలువలకు, అధ్యాత్మకు నిలువెత్తు సాకారంగా, నిరుపమాన సోదాహరణంగా నిలిచిన ధన్యజీవుల గాథలను అధ్యయనం చేయాలి. మానవుడు అసలు సచ్చిదానందుడే. ఆ ‘లోవెలుగు’ వలననే, ఇంద్రియాలు తమ పనులన్నీ సక్రమంగా చేయగలుగుతున్నాయి. ఆ వెలుగులోనే మన బుద్ధి ప్రకాశిస్తోంది. ఆ దారి స్పష్టం కనుకనే మనసుకు మంచి విషయాలు అవగాహనకు వస్తున్నాయి. ఆ విషయాలను ఆచరణాత్మకం చేయగలుగుతున్నందున, ఆనందం, శాంతి, సంస్థిత స్థితులు ఏర్పడుతున్నాయి. మనం ఎరుగవలసిన దారి ఇదే. ఈ విషయం తెలియనంతవరకూ మానవుడు ‘ధ్యాయతో విషయాన్‌ పుంసః’... నిరంతరం విషయవాసనల్లో మునిగి శబ్ద, స్పర్శ, రస, రూప, గంధాదుల వలన యాతన పడుతుంటాడు. జీవితాన్ని ఆగంగా మార్చుకుంటాడు. దివ్యానందాన్ని కోల్పోతాడు. అంధకారం, అలసట, అసూయ, అహంకారం వంటి విషయవాసనలు జీవితాన్ని ఆక్రమిస్తాయి. ‘లోవెలుగు’లో వెలుగుతున్న మన మనసును, బుద్ధిని, చిత్తాన్ని ఈశ్వరుడివైపు.. ‘అసలు విషయం’ వైపు మరల్చగలిగితే విషయవాసనలన్నీ విష్ణువాంఛలుగా మారి ఆనందాన్ని ప్రసాదిస్తాయి. అలాంటి కామరహిత హృదయమే రామరాజ్యం.


మనం ఎన్ని వందల కుండల నీళ్లను కుదుళ్లలో కుమ్మరించినా.. వృక్షం రుతువులోనే ఫలిస్తుంది. మనం వేచి ఉండాలి. నిరాశ చెందరాదు. ఆ రుతువు నిత్యవసంతం. ఆ పరమాత్మ నిత్యుడు. ఆ భావన అచలం, ఆ ఎరుక అమలం, అంతా ఏకమే. అంతా ఆత్మే. మానవజీవితం రుతుసంహారం. అంటే అన్ని స్థితిగతుల సమాహారం. దానిని సంపూర్ణంగా, స్పృహతో అనుభవించడమే మన సాధన. వెతికి వెతికి దొరికించుకోవాల్సింది మనలోనే ఉంది. మళ్లీ అది ‘మనమే’. సమస్తలోకాస్సుఖినోభవంతు.

- వీఎస్‌ఆర్‌ మూర్తి, ఆధ్యాత్మిక శాస్త్రవేత్త

Updated Date - 2020-06-24T08:25:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising