అన్యధా శరణం నాస్తి.. త్వమేవ శరణం మమ
ABN, First Publish Date - 2020-02-09T06:41:02+05:30
సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్ష యిష్యామి మా శుచః అన్నాడు గీతాచార్యుడు! ‘సమస్త కర్తవ్య కర్మలను నాకు...
సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ
అహం త్వాం సర్వపాపేభ్యో మోక్ష యిష్యామి మా శుచః
అన్నాడు గీతాచార్యుడు! ‘సమస్త కర్తవ్య కర్మలను నాకు అర్పించి, నన్ను శరణు వేడితే పాప విముక్తి కలిగిస్తాను’ అని అభయమిచ్చాడు. అవతారమేదైనా ఆ పరమాత్మ తత్వమిదే. సీతాదేవిని గాయపరచిన కాకాసురునిపై శ్రీరాముడు బాణ ప్రయోగం చేసినా.. తనను శరణాగతి వేడిన తర్వాత కాకాసురుణ్ని క్షమించాడు. రావణునిచే పరాభవము చెందిన విభీషణుడు, సాగరతీరంలో ఉన్న రాముడి శరణు వేడాడు. ఆ సందర్భంలో శ్రీరాముడు సుగ్రీవునితో ..
సకృదేవ ప్రవన్నాయ- తవాస్మీతి యాచతే
అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్వ్రతం మమ
ఆనయైునం హరి శ్రేష్ఠ దత్తమస్యాభయం మయా
విభీషణోవా సుగ్రీవ యదివా రావణః స్వయం
‘సుగ్రీవా! ఎంతటి దుర్మార్గుడైనా, పాపాత్ముడైనా భక్తిప్రపత్తులతో ‘నేను నీవాడను’ అని నన్ను శరణుగోరి నా వద్దకు వస్తే వారికి అభయమివ్వడం నేను పాటించే వ్రతం. కపీశ్వరా.. విభీషణుని నా వద్దకు తీసుకొనిరమ్ము; వానికి అభయమిచ్చుచున్నాను. విభీషణుడేగాదు, సాక్షాత్తూ రావణుడు వచ్చి నన్ను శరణు వేడినా అభయమిస్తాను’ అని చెప్పాడు. ఒకసారి రావణుడు సుగ్రీవుని ప్రలోభపెట్టి, లోబరచుకొనే ఉద్దేశంతో.. శుకుడనే రాక్షసుణ్ని గూఢచారిగా పంపాడు. వాడు చిలుక రూపంలో వచ్చి రావణుని సందేశం వినిపిస్తుంటే.. వానరులు బంధించి రెక్కలు ఊడబెరికి చంపబోయారు. అప్పుడు శుకుడు.. తనను రక్షించమంటూ రాముణ్ని వేడుకున్నాడు. భక్తవత్సలుడైన దాశరథి.. శుకుని బంధవిముక్తిగావించమని ఆజ్ఞాపించి ఆ రాక్షసుడి ప్రాణాలు కాపాడాడు. ఇక.. గజేంద్రమోక్షం కథ మనందరికీ తెలిసిందే! మొసలి నోటికి చిక్కి తనువు డస్సిపోయి, ప్రాణాలు ఠావులు తప్పుతుండగా గజేంద్రుడు చేసిన శరణుఘోష విన్న శ్రీమహావిష్ణువు.. సిరికిం జెప్పక, శంఖచక్రాలను చేదోయి సంధింపక అలవైకుంఠపురం నుంచి హుటాహుటిన గజప్రాణావనోత్సాహియైు భూమికి దిగివచ్చాడు! సుదర్శన చక్ర ప్రయోగం చేసి గజేంద్రుని మొసలి బారి నుంచి కాపాడాడు. ఆ పరమాత్మ భక్త పరాధీనుడు. వాత్సల్య మూర్తి. ‘అన్యధా శరణం నాస్తి.. త్వమేవ శరణం మమ.. తస్మాత్ కారుణ్య భావేన.. రక్ష, రక్ష జనార్దన’ అని ప్రార్థిస్తే చాలు రక్షించి తీరుతాడు.
రాయసం రామారావు, 9492191360
Updated Date - 2020-02-09T06:41:02+05:30 IST