ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నా జీవితంలో ఇప్పటివరకూ చేయలేదు.. ఈసారి ట్రై చేస్తా: నితిన్

ABN, First Publish Date - 2020-04-12T05:35:57+05:30

పెళ్లి హడావిడిలో పరుగులు తీయాల్సిన ఆ హీరో... కరోనాపై యుద్ధంలో ప్రజలను చైతన్యవంతులు చేస్తున్నారు. సామాజిక బాధ్యతతో తమ వంతు సేవ చేస్తున్నారు. నితిన్‌...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెళ్లి హడావిడిలో పరుగులు తీయాల్సిన ఆ హీరో... కరోనాపై యుద్ధంలో ప్రజలను చైతన్యవంతులు చేస్తున్నారు. సామాజిక బాధ్యతతో తన వంతు సేవ చేస్తున్నారు. నితిన్‌... ఈ వారంలో పెళ్లి పీటలు ఎక్కాల్సిన హీరో. కానీ, పెళ్లి వాయిదా వేసుకున్నారు. కరోనా ప్రభావం, పెళ్లి వాయిదా విషయాల గురించి ‘నవ్య’తో ప్రత్యేకంగా మాట్లాడారు.


తెలుగు సినిమా కుటుంబం నుండి విరాళం ఇచ్చిన తొలి వ్యక్తి మీరే. చిరంజీవి, పవన్‌కల్యాణ్‌ సహా పలువురు మిమ్మల్ని ప్రశంసించారు!

తొలుత విరాళం ఇచ్చేటప్పుడు నేనేదో గొప్ప పని చేస్తున్నానుకోలేదు. జస్ట్‌... అయామ్‌ డూయింగ్‌ మై డ్యూటీ! ఇవాళ నేను హీరోగా ఉన్నానంటే కారణం ప్రజలే. ఇప్పుడు వాళ్లు కష్టాల్లో ఉన్నారు. నా వంతుగా నేను ఏదో ఒకటి చేయాలనుకున్నాను. విరాళం ఇచ్చాను. చిరంజీవి, పవన్‌కల్యాణ్‌గారు ప్రశంసించడం సంతోషమే. అయితే... ఎవరో మెచ్చుకోవాలని చేయలేదు.


జనతా కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలు బయటకు రావొద్దని మీరూ విజ్ఞప్తి చేశారు. అసలు, ఇలా జరుగుతుందని ఊహించారా?

నిజాయతీగా చెప్పాలంటే... మనకు ఎప్పుడూ అలవాటు లేనిదిది. లాక్‌డౌన్‌ వల్ల బయటకు రాలేక కొందరు ఇబ్బందులు పడుతున్నారు. అయితే, చేతులు కడుక్కోవడం, మాస్క్‌ పెట్టుకోవడం వంటి జాగ్రత్తలు పాటిస్తూ ఇంట్లో ఉంటే కరోనా రాదు. ఇంకొక పాజిటివ్‌ సైడ్‌ ఏంటంటే... కుటుంబంతో చక్కటి సమయం గడుపుతున్నాం. మనం ఇంటి భోజనం తింటున్నాం. పక్షులు, జంతువులు స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. వాయు, నీటి కాలుష్యం తగ్గుముఖం పట్టాయి. తెలిసో, తెలియకో... ప్రకృతి విషయంలో ప్రజలంతా కలిసి తప్పులు చేశాం. కానీ, రెండు వారాల లాక్‌డౌన్‌ వల్ల ఎంతో మార్పు కనపడుతోంది. ప్రకృతి కోలుకుంటోంది. ఏప్రిల్‌ రెండో వారం అంటే వేసవి మొదలైనట్టే. ఈపాటికి వేడి మొదలవుతుంది. కానీ, ఇప్పుడు అంత వేడి లేదు. కాలుష్యం, ఇవేవీ లేవు కనుక! కరోనా రావడం దురదృష్టకరమే. అయితే... అనుకోకుండా వచ్చిన ఈ విరామం వల్ల సంతోషంగానే ఉన్నా. ఎంజాయ్‌ చేస్తున్నా. దేవుడి గిఫ్ట్‌గా భావిస్తున్నా.


షూటింగులు ఉంటే ఉదయమే నిద్ర లేవాలి. జిమ్‌కి వెళ్లాలి. తర్వాత సెట్స్‌కి వెళ్లాలి... ప్రతిదీ షెడ్యూల్‌ ప్రకారం ఉంటుంది. ఇప్పుడు ఆ టెన్షన్‌ లేదు. రోజూ మీ దినచర్య ఎలా ఉంటోంది?

(నవ్వుతూ) రెగ్యులర్‌ షెడ్యూల్‌ మొత్తం పక్కన పెట్టేశా. ఇప్పుడు నా జిమ్‌ కోచ్‌ రాలేడు. నాకు బద్దకం ఎక్కువ. ఒక్కడినే జిమ్‌ చేయలేను. అందుకని, హ్యాపీగా ప్రతిరోజూ అమ్మ చేసిన వంట తింటున్నా. అన్నం, పప్పు, ఆవకాయ్‌, ఆమ్లెట్‌... నచ్చినవన్నీ తింటున్నా. డిజిటల్‌, టీవీ మీడియమ్‌లో సినిమాలన్నీ చూస్తున్నా. ఒక్కోరోజు మిడ్‌నైట్‌ 2 వరకూ సినిమాలు చూస్తున్నా. తెల్లారి 11 గంటలకు నిద్రలేస్తున్నా. తినడం, సినిమాలు చూడడం... ఇదే నా దినచర్య.


కిచెన్‌లోకి వెళ్లి వంట చేసే ప్రయత్నం చేస్తున్నారా?

నా స్నేహితులందరూ చేస్తున్నారు. వాట్సాప్‌ గ్రూప్‌లో ఫొటోలు పోస్ట్‌ చేస్తున్నారు. అవన్నీ చూశాక నాకు ఏదొక వంట చేయాలనిపించింది. రేపో మాపో నేనూ వంటింటిలోకి వెళతా. నా జీవితంలో ఇప్పటివరకూ వంట చేయలేదు. ఈసారి ప్రయత్నం చేస్తా.


కరోనా ప్రభావం ఇండస్ట్రీపై ఎంతవరకూ ఉండొచ్చని అనుకుంటున్నారు? నష్టాలు...

సినిమా ఇండస్ట్రీపై ఎఫెక్ట్‌ పక్కన పెడితే... మొత్తం ప్రపంచమే స్థంభించిపోయింది. ప్రపంచంలో సినిమా అనేది చిన్నదే. అంత ఎందుకు? నా జీవితంలో గొప్ప వేడుక... నా పెళ్లి. నేను నా పెళ్లిని వాయిదా వేశా. ఇప్పుడు ప్రజల ప్రాణాలు ముఖ్యం. ప్రాణం కంటే ఏదీ ఎక్కువ కాదు కదా.


కరోనా లేకపోతే... ఈపాటికి మీరు పెళ్లి పనుల్లో బిజీగా ఉండేవారు

చాలా బిజీగా ఉండేవాణ్ణి. యాక్చువల్లీ... ఆదివారం (ఏప్రిల్‌ 12) నా పెళ్లి కొడుకు ఫంక్షన్‌. వెంటనే దుబాయ్‌ జర్నీ, పెళ్లి. లాక్‌డౌన్‌ ముందు పెళ్లి, సినిమాలు, షూటింగులు చిన్నవే. డబ్బులు పోతే మళ్లీ సంపాదించుకోవచ్చు. సినిమాలు పోతే మళ్లీ హిట్‌ సినిమాలు చేయవచ్చు. మనం బావుంటే మిగతావన్నీ బావుంటాయి. మనం బావుండాలంటే... ఇంట్లో ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి. బ్యాడ్‌ ఫీలింగ్స్‌ ఏవీ లేకుండా మనస్ఫూర్తిగా పెళ్లిని వాయిదా వేశా. జీవితంలో పెళ్లి చేసుకునేది ఒక్కసారే. సంతోషంగా చేసుకోవాలి కానీ... భయంగా మాస్క్‌ వేసుకుని ఎవరినీ టచ్‌ చేయకుండా చేసుకోవడం ఎందుకని నా అభిప్రాయం. మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొన్న తర్వాత చేసుకుందామని చెప్పగానే.. మా ఇంట్లో, కాబోయే శ్రీమతి శాలిని వాళ్లింట్లో... సంతోషంగా సరేనని అన్నారు.


లాక్‌డౌన్‌ పొడిగింపుపై మీ అభిప్రాయం? 

ముఖ్యమంతి కేసీఆర్‌గారి మీడియా సమావేశం చూశా. నా అభిప్రాయమూ అదే. మరో  రెండు వారాలు లాక్‌డౌన్‌ పొడిగించడమే మంచిది.  గురు, శుక్ర వారాల్లో కొత్త కేసుల సంఖ్య తగ్గిందని విన్నాను. ఇలా మరో రెండు వారాలు లాక్‌డౌన్‌ ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఒకవేళ లాక్‌డౌన్‌ తీసేస్తే... కరోనా వ్యాప్తి పెరిగితే ఎక్కువ జనాభా ఉన్న మన దేశంలో కంట్రోల్‌ చేయడం చాలా కష్టం. పంజాబ్‌, రాజస్థాన్‌, మహారాష్ట్ర ఈ నెల 30 వరకూ లాక్‌డౌన్‌ కొనసాగించాలని నిర్ణయించాయి. తెలంగాణలోనూ అదే నిర్ణయం తీసుకోవడం సంతోషం. 


చివరగా... ప్రజలకు మీరిచ్చే సలహా

స్టే హోమ్‌... స్టే సేఫ్‌! కూరగాయలు, పాలు కోసం బయటకు వెళ్లాల్సి వస్తే ఒక్కరే మాస్క్‌ వేసుకుని వెళ్లండి. నేను ఇంట్లోనే ఉన్నా... ప్రతిరోజూ కనీసం 20సార్లు చేతులు కడుగుతున్నా. శానిటైజర్‌ ఉపయోగిస్తున్నా. బయటకు వెళితే ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి? కరోనాపై యుద్ధంలో మనం చేయగలిగింది ఇదొక్కటే. ప్రభుత్వాలు చెప్పిన మాట వినండి.


డిజిటల్‌లో... ఏప్రిల్‌ 27న ‘భీష్మ’

థియేటర్‌లో ‘భీష్మ’ చిత్రాన్ని రెండుసార్లు చూశా. మూడోసారీ వెళదామనుకుంటున్న తరుణంలో థియేటర్లు బంద్‌, లాక్‌డౌన్‌ వచ్చాయి. ట్విట్టర్‌లో అభిమానులు ‘అన్నా... మళ్లీ థియేటర్‌లో సినిమా చూద్దామంటే లాక్‌డౌన్‌ వచ్చింది. ఓటీటీలో వస్తే బావుంటుంది’ అని అడుగుతున్నారు. ‘ఓటీటీలో సినిమా ఎప్పుడొస్తుందా?’ అని నేనూ వెయిటింగ్‌. నిర్మాతలు ఏప్రిల్‌ 27న వస్తుందన్నారు. లాక్‌డౌన్‌ లేకపోతే గ్యారెంటీగా ఇంకో రెండు మూడు వారాలు ఆడేది. ప్రేక్షకులు థియేటర్లలో ‘భీష్మ’ చూశారు. చూడనివాళ్లు ఓటీటీలో చూస్తారు.


సత్య పులగం

Updated Date - 2020-04-12T05:35:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising