ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నీరా కేఫ్‌లు వస్తున్నాయ్‌!

ABN, First Publish Date - 2020-08-30T19:22:24+05:30

హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్డు... హుస్సేన్‌సాగర్‌ మీదుగా చల్లటి గాలులు వీస్తున్నాయి.. సాయంత్రం ఆహ్లాదంగా ఉంది. వస్తూ పోతున్న కార్లతో సందడిగా ఉంది వాతావరణం. ఆ పక్కనే కేఫ్‌.. లోపల సంప్రదాయ కుర్చీలు, టేబుళ్లు. కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారంతా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్డు... హుస్సేన్‌సాగర్‌ మీదుగా చల్లటి గాలులు వీస్తున్నాయి.. సాయంత్రం ఆహ్లాదంగా ఉంది. వస్తూ పోతున్న కార్లతో సందడిగా ఉంది వాతావరణం. ఆ పక్కనే కేఫ్‌.. లోపల సంప్రదాయ కుర్చీలు, టేబుళ్లు. కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారంతా. సర్వర్లు చిన్న సీసాల్లో తెల్లటి పానీయాన్ని అందిస్తున్నారు. మెల్లగా తాగుతూ, రుచి చూస్తూ, ఎంజాయ్‌ చేస్తున్నారు అతిథులు. ఆ నిషా మజా దేనికీ సాటి రాదు. ఇంతకూ వాళ్లున్నది కాఫీకేఫ్‌లోనో, కాఫీహౌస్‌లోనో కాదు.. నీరాకేఫ్‌లో!. తాగుతున్నది కూల్‌డ్రింకో, హాట్‌డ్రింకో కాదు.. స్వచ్ఛమైన కల్లు. అవును.. మీరు విన్నది నిజమే! ఇదివరకు అయితే కల్లు కాంపౌండ్‌లో అపరిశుభ్ర వాతావరణంలో.. కల్లు సేవించేవాళ్లు. ఇప్పుడు జిగేల్‌మనే నీరాకేఫ్‌లో నింపాదిగా తాగొచ్చు. అలా రాబోతున్న మొట్టమొదటి కల్లు కేఫ్‌ ఇది. ఇటీవలే శంకుస్థాపన జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రయోగాత్మకంగా నిలవనుంది నీరాకేఫ్‌. ఆంధ్ర, తెలంగాణలలో కల్లుకు డిమాండ్‌ పెరిగింది. రకరకాల కల్లులను ఆస్వాదిస్తున్నారు..



శుద్ధమైన తాజా కల్లు.. అమృతపానీయం. సర్వరోగ నివారిణి. చల్లదనానికి చల్ల. ఇదేమీ ప్రాణాలను హరించే సాధారణ ఆల్కహాలు వంటిది కాదు. రసాయనాలతో మత్తెక్కించే మందు కాదు. కల్తీలేని కల్లు ఆరోగ్యదాయకమే!. ఈత, తాటి, కొబ్బరి చెట్ల నుంచి కల్లుగీయడం, బాటసారులకు విక్రయించడం .. అదొక పురాతన సంప్రదాయం, సంస్కృతిలో భాగం. ఇంగ్లీషు మద్యపానం వచ్చాక తరతరాల నుంచీ వస్తున్న ఆరోగ్యామృతంలాంటి కల్లు వెనకబడిపోయింది. పేద వర్గాలకే పరిమితం అయ్యింది. నిజానికి అసలుసిసలు భారతీయ సుర పానీయం మన కల్లు ఒక్కటే. దాని చుట్టూ ప్రకృతితో అనుబంధం, సంప్రదాయం, సంస్కృతి, కుల వృత్తుల మేళవింపు కనిపిస్తుంది. 


కల్లుగీత కూడా అత్యంత నైపుణ్యవంతమైన వృత్తి. శ్రద్ధతో చేసే పని. రమ్ము, జిమ్ము, వైను, వోడ్కాలతో పోలిస్తే కల్లు ప్రమాదకరమైనది కాదు. అయితే కల్తీ కల్లు మాత్రం ప్రాణాలను హరించేదే!. అప్పుడే చెట్టు మీద నుంచి తీసిన శుద్ధమైన కల్లులో అనేక ఔషధగుణాలు ఉన్నాయని ఆయుర్వేదం కూడా చెబుతోంది. దీనిని కూడా పరిమితంగానే తీసుకోవాలి. అతిగా తాగితే ఇబ్బందే. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో పరిశుభ్రమైన కల్లుకు డిమాండ్‌ పెరిగింది. కరోనా లాక్‌డౌన్‌లో కొన్నిరోజుల పాటు మద్యం దొరకలేదు. దాంతో మద్యపానప్రియులు కార్లు, బైకుల్లో ఊరి శివార్లలోని ఈత వనాలకు వెళ్లి కల్లును ఆస్వాదించారు. ఈ క్రమంలో ఈతకల్లుతోనే సరిపెట్టుకోకుండా.. రకరకాల కొత్త కల్లు రుచిని చూసేవాళ్లు ఎక్కువయ్యారు అంటున్నారు గీతకార్మికులు.


ఖర్జూర కల్లు..

భాగ్యనగరం నుంచి 120 కి.మీ. దూరం.. నాగర్‌కర్నూలు జిల్లా తర్నికల్‌ గ్రామం. రహదారి పక్కనే అరబ్బు దేశాన్ని తలపించే ఖర్జూర తోట. కార్లు, బైకులు ఆగుతున్నాయి. కొందరు తెల్లటి ప్లాస్టిక్‌ క్యాన్లు, ఖాళీ వాటర్‌ బాటిళ్లు, సీసాలు పట్టుకుని తోట లోపలికి వెళుతున్నారు. కొన్ని చెట్లకు గులాబీరంగు పండ్ల గెలలు, మరికొన్ని చెట్లకు మట్టి కుండలు వేలాడుతున్నాయి. ఇప్పటి వరకు ఈత, తాటి కల్లు గురించి అందరికీ తెలుసు. కానీ, ఇక్కడ దొరికే ఖర్జూర కల్లును చూస్తూనే ఆశ్చర్యం వేస్తుంది. ఆ కొత్త రుచి కోసమే అంత దూరం నుంచి వచ్చారు వీళ్లందరూ. ఎక్కడో అరబ్బు దేశాల్లో విస్తారంగా కనిపించే ఖర్జూర వనాలు ఇక్కడ పెరుగుతున్నాయిప్పుడు. అధిక ఉష్ణోగ్రతలో పండే ఖర్జూరచెట్లు తెలంగాణలోని కల్వకుర్తి, అనంతపురం జిల్లాలోని కొన్ని చోట్ల కనువిందు చేస్తున్నాయి. తర్నికల్‌లోని తోట యజమాని యాదయ్య గౌడ్‌ను పలకరిస్తే.. ‘‘తాటి చెట్లు ఎక్కాలన్నా, కల్లు గీయాలన్నా నాకు చాలా ఇష్టం. పన్నెండేళ్లు ఒక దొర దగ్గర పాలేరుగా వెట్టి చాకిరీ చేశాను. ఇంకెంత కాలం పన్జెయ్యాలె. మా కులవృత్తిని చేసుకోవాలనుకున్నాను. నాకేమో తాళ్లెక్కరాదు. మా ఊర్లోని ఓ పెద్దాయన కల్లు గీయడం నేర్పిండు.. ఆ తరువాత ఆంధ్రలోని ప్రకాశం జిల్లాకు వెళ్లి, ఒక యజమాని దగ్గర ఆరేళ్లు కల్లు గీసిన. నెల జీతం ఇచ్చిండ్రు. కొంత మొత్తం పోగయ్యాక సొంతూరు తర్నికల్‌కు వచ్చిన. వ్యవసాయ యోగ్యానికి పనికిరాని రెండెకరాల పొలం కొన్నాను. ఎడారిలో పెరిగే ఖర్జూర చెట్లు వేయొచ్చని అర్థమైంది. అందరిలా ఈత, తాటి కల్లు కాకుండా.. ఖర్జూర కల్లు కమ్మగుంటదని కొత్తగా ఆలోచించి.. ఈ పని మొదలుపెట్టిన..’’ అన్నాడు ఆయన. 


ఇరవై ఏడు బోర్లు..

ఇదంతా పద్దెనిమిదేళ్ల కిందటి సంగతి. ఖర్జూర మొక్కల కోసం యాదయ్య తిరగని ఊరు లేదు. చివరికి సంగారెడ్డి నర్సరీ ద్వారా కడియపు లంక నుంచి మొక్కల్ని తెప్పించాడు. తండ్రి ఇచ్చిన ఎకరానికి తోడు, తాను కొన్న రెండెకరాలు కలిపి.. ఖర్జూర మొక్కల్ని నాటాడు. అది చౌడు భూమి కావడంతో పాదుల్లో ఎర్రమట్టిని పోసి పెంచాడు. కష్టపడి మొక్కల్ని అయితే నాటాడు కానీ, నీటి వసతి లేక ఎండిపోసాగాయి. ఖర్జూర చెట్ల నుంచి కల్లు ధారళంగా రావాలంటే సమృద్ధిగా నీళ్లుండాలి. ఎన్ని బోర్లు వేసినా దుమ్ము తప్ప నీళ్లు రాలేదు. మళ్లీ ఈతచెట్లు ఎక్కి కల్లు గీసేవాడు. అప్పుడప్పుడు వచ్చిన డబ్బుతో బోర్లు వేయడమే పనిగా పెట్టుకున్నాడు. అలా ఎన్ని బోర్లు వేశాడో తెలుసా? ఏకంగా ఇరవైఏడు బోర్లు. అయినా చుక్క నీళ్లు పడలేదు. ఇక లాభం లేదని ట్యాంకర్లతో నీళ్లు తోలి చెట్లను బతికించుకున్నాడు యాదయ్య. ఐదారేండ్ల నుంచి ఖర్జూరచెట్లు పచ్చగా పెరిగాయి. తోట పక్కనే కల్వకుర్తి కాల్వ పారుతోంది. దాంతో బోర్లలో నీళ్లు ఉబికాయి. ఆ నీరే ఖర్జూర తోటకు ఊపిరైంది. దుందుభి నది మీద నిర్మించిన అక్విడెక్ట్‌ కట్టడంతో కల్వకుర్తి మండలానికి నీళ్లొస్తున్నాయి. ఈ కాల్వ వల్ల తర్నికల్‌ చెరువుతోపాటు తోటపల్లి, వెంకటాపూర్‌, వేపూర్‌ ఊళ్లలోని చెరువులు, కుంటలు నిండాయి. ప్రస్తుతం యాదయ్య తోటలో నాలుగుబోర్లలో నీళ్లొస్తున్నాయి. ఇక, దిగుల్లేదు. 


సూక్ష్మపోషకాలు..

పదహారు వందల ఖర్జూర చెట్లు.. చెట్టుకు ఐదు లీటర్ల కల్లు. రోజుకు ఇరవై చెట్ల నుంచీ కల్లు తీస్తున్నాడు యాదయ్య. చుట్టుపక్కల ఊళ్లందరికీ ఖర్జూర కల్లు గురించి తెలిసింది. హైదరాబాద్‌లో పేరున్న రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలు సైతం అక్కడికే వెళ్లి కల్లును ఆస్వాదిస్తున్నారు. ‘‘....కల్లుపై వచ్చిన ఆదాయంతోనే కూతురు పెండ్లి చేశాం, కొడుకును చదివిస్తున్నాం..’’ అన్నారు యాదయ్య భార్య నీలమ్మ. ఖర్జూర కల్లుకు ఎందుకంత గిరాకీ అంటే.. మిగతా కల్లుతో పోలిస్తే చాలా రుచిగా ఉంటుంది. చెరకు రసంలా అనిపిస్తుంది. మత్తు ఎక్కదు. తాగినా వాసన రాదు. రెండు రోజులైనా పులవదు. ఆరోగ్యానికి మంచిది.. అంటారు పోషకాహార నిపుణులు. ఆ విషయంపై తూర్పుగోదావరి జిల్లా పందిరిమామిడిలోని తాటి పరిశోధనా కేంద్రం సీనియర్‌ శాస్త్రవేత్త పి.సి.వెంగయ్య మాట్లాడారు. ఆయన రకరకాల కల్లుల పై అధ్యయనం చేస్తున్నారిప్పుడు. ‘‘ఖర్జూర కల్లును చెట్టు నుంచి తీసిన తరువాత నాలుగు గంటల వరకు తాజాదనం కోల్పోదు. ఫ్రిజ్‌లో ఉంచితే పన్నెండు గంటలైనా నిల్వ ఉంటుంది. ఇందులో సూక్ష్మపోషకాలైన కాల్షియం, పాస్పరస్‌, ఐరన్‌, మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. ఈ కల్లులో గ్లూకోజ్‌, ప్రక్టోజ్‌ మోతాదు తక్కువగా ఉండటం వల్ల.. మధుమేహులు కూడా తీసుకోవచ్చు. తాటి, ఈత కల్లుతో పోలిస్తే ఇందులో ప్రొటీన్‌ ఎక్కువగా ఉండి, చక్కెర తక్కువగా ఉంటుంది. జలుబు, దగ్గు నివారణకు ఇదొక ఔషధంలా పనిచేస్తుంది. శ్లేష్మం కరిగించి గొంతును పరిశుభ్రం చేస్తుంది. రక్తపోటు నియంత్రణకు సహాయపడుతుంది. నిషా కూడా తక్కువే. నెమ్మదిగా పులుస్తుంది. కొబ్బరి కల్లులో పొటాషియం శాతం ఎక్కువ. జీలుగ కల్లుకు కిడ్నీలో రాళ్లను కరిగించే శక్తి ఉంది..’’ అంటూ వివరించారాయన. ఉత్తర నైజీరియన్లు ఖర్జూరాలకు మిర్చిని జోడించి ఓ కొత్తరుచితో బీరును తయారుచేస్తారు. ఇస్లామిక్‌ దేశాల్లో రంజాన్‌ మాసంలో ఆల్కహాల్‌కు బదులుగా ఖర్జూరాలతో తయారుచేసిన షాంపేన్‌లాంటి పానీయాన్ని సేవిస్తారు. ఇంతటి విశేషాలున్న ఖర్జూర కల్లు తెలంగాణలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. 


జీలుగ కల్లు..

గిరిజనుల కల్పవృక్షం జీలుగ. పెళ్లిళ్ల సమయంలో ఆడబిడ్డకు ఒక్కో చెట్టు చొప్పున పుట్టింటి వాళ్లు కానుకగా ఇచ్చే సంప్రదాయం .. పార్వతీపురం, మారేడుమిల్లి ఏజెన్సీలో అనాదిగా వస్తోంది. జీలుగ అటవీప్రాంతాల్లో పెరిగే చెట్టు. ఈ చెట్టు నుంచి 25 నుంచి 35 లీటర్ల కల్లును తీస్తారు. బియ్యాన్ని ఉడికించి అన్నం వండుకునేందుకు నీళ్లకు బదులుగా జీలుగ కల్లును వాడతారు. తద్వార క్యాన్సర్‌ వంటి మొండి జబ్బులు రావన్నది గిరిజనుల విశ్వాసం. పూర్వం నుంచి జీలుగ కల్లును గిరిజనులు ఎక్కువగా తాగేవాళ్లు. ‘‘ఇప్పుడు పర్యాటకులు అటవీప్రాంతాల్లోకి వస్తున్నారు. బీర్లు, మందుకు విసిగిపోయిన వాళ్లు.. జీలుగ కల్లును అడిగి మరీ తాగుతున్నారు. లీటరు జీలుగ కల్లు యాభై నుంచి అరవై రూపాయలకు అమ్ముతున్నాం..’’ అంటారు విశాఖ జిల్లా జి.మాడుగులకు చెందిన రామకృష్ణ. ఒక్కో చెట్టు నుంచీ ఏటా రూ.30 నుంచీ రూ.40 వేల వరకు ఆదాయం పొందుతున్న గిరిజనులు ఉన్నారని ఆయన పేర్కొన్నాడు. 




కల్పరస తీర్థం..

తాటి, జీలుగ చెట్ల గెలల నుంచి కల్లు ఎలా వస్తుందో.. అలాగే కొబ్బరి చెట్ల నుంచి కూడా వస్తుందీ కొబ్బరి కల్లు. శ్రీలంకలో మొదలై కేరళకు వచ్చింది. కేరళలోని కేంద్రీయ పంట మొక్కల పెంపక పరిశోధనా సంస్థ (సీపీసీఆర్‌ఐ) శాస్త్రవేత్తలు కొబ్బరి చెట్టు నుంచి ఆల్కహాల్‌ లేని పానీయాన్ని సేకరించే పద్ధతిని రూపొందించారు. ఇది తాగితే మత్తు ఉండదు. కాబట్టి కల్లు అనకుండా.. కల్పరస పేరుతో పిలుస్తున్నారు. ఇందులో ఖనిజాలు, ప్రొటీన్లు అధికంగా ఉండటంతో హెల్దీడ్రింక్‌గా ప్రచారం చేశారు. కొబ్బరి పూత దశకు ముందు వచ్చే లేత పొత్తును గుర్తించి, ప్రత్యేకంగా తయారుచేసిన ఐస్‌బాక్స్‌ ద్వారా కల్పరసను సేకరిస్తారు. ఈ బాక్స్‌ వల్ల ఈగలు, చీమలు లోపలికి వెళ్లవు. ఈ పద్ధతిలో ఒక్కో చెట్టు నుంచి మూడు లీటర్ల కల్లు తీయొచ్చు. 40 నుంచి 60 రోజుల్లో వంద లీటర్ల కల్పరస లభిస్తుంది. ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటలలోపు.. సాయంత్రం ఐదు నుంచీ ఆరు లోపు సేకరిస్తారు. 






పనస వైన్‌..

తూర్పు కనుమల్లోని పెద బయలు, డుంబ్రిగుడ, అరకులో పనస చెట్లు ఎక్కువ. ఆ కాయల నుండి కూడా కల్లు తీస్తారు. కొన్నిచోట్ల పండుతొనలను పులియబెట్టి వైన్‌ తయారుచేస్తుండటం విశేషం. ఇదంతా పరిశీలించి, పనసను విలువ ఆధారిత ఉత్పత్తిగా తీర్చిదిద్దాలని ఆంధ్రప్రదేశ్‌ గిరిజన కార్పొరేషన్‌ ప్రయత్నిస్తోంది. చిత్తూరు జిల్లాలో పనసతో వైన్‌ తయారు చేయించింది. తిరుపతిలోని జీసీసీ డివిజనల్‌ మేనేజర్‌ జె.యుస్‌టస్‌ ఈ వివరాలను చెప్పారు.... ‘‘పనస పండ్ల నుండి వైన్‌ ఉత్పత్తి చేస్తే ఆ రైతుల ఆదాయం పెరుగుతుందనే ఆలోచనతో వైన్‌ చేస్తున్నాం. దీనిని శాస్త్రీయంగా నిర్ధారించుకోవడానికి మైసూర్‌లోని సెంట్రల్‌ ఫుడ్‌ టెక్నాలజీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు పంపాం. సాధారణ వైన్‌లో 12 నుంచి 15 శాతం ఆల్కహాల్‌ ఉంటే, పనస వైన్‌లో ఆల్కహాల్‌ కేవలం 2.4 శాతం మాత్రమే ఉందని తేలింది. కాబట్టి పనస వైన్‌ ఆరోగ్యానికి పెద్దగా హాని చేయదు. మత్తు ఇవ్వదు. అనుమతులు వస్తే త్వరలో ఇది మార్కెట్‌లోకి వస్తుంది..’’ అన్నారాయన. 


తాటి కల్లు..

ఈ మధ్య సూపర్‌మార్కెట్లలో తాటి బెల్లం తెగ అమ్ముడుబోతోంది. ఆయుర్వేద పరంగా ఆ బెల్లం ఆరోగ్యానికి శ్రేష్టమైనదని వైద్యులు చెబుతున్నారు. అందుకే వాడకం పెరిగింది. ఈ క్రమంలో తాటి కల్లుకు కూడా ఆదరణ బాగుంది. అయితే ఈ బెల్లం తయారీకి అవసరమైన తాటి నీరాకంటే, జీలుగ నీరా రుచికరమైనది. తాటి బెల్లానికి దీటుగా ఔషధగుణాలు, పోషకాలు కలిగి ఉండే జీలుగ బెల్లాన్ని భారీ ఎత్తున ఉత్పత్తి చేసే దిశగా ప్రయత్నాలు మొదలయ్యాయి. వంద లీటర్ల జీలుగ నీరాతో పదిహేను కిలోల బెల్లం ఉత్పత్తి అవుతుంది. 


కల్లు.. నీరా..

చక్కెరలాంటి తీయని రుచిని పంచే పానీయం నీరా. తాటి, ఈత, కొబ్బరి చెట్లతోపాటు ఖర్జూర, జీలుగ చెట్ల నుంచి ఉత్పత్తి చేస్తారు. నీరా ఆల్కహాలు లేని సహజసిద్ధమైన ద్రవం. కల్లు గీసే క్రమంలో కుండలో స్వల్ప పరిమాణంలో నీరు, మడ్డి (పాతకల్లు) కలిపి చెట్టుకు కట్టడం ద్వారా కల్లు లభిస్తుంది. అయితే నీరా గీసే ముందు అమర్చిన కొత్తకుండలో ఎలాంటి నీరు, మడ్డి వేయకుండా.. తాజాగా లభించే పానీయమే నీరా. ఏ చెట్టు నీరా అయినా రుచితోపాటు, ఆరోగ్యాన్ని పంచుతుంది. వ్యాధులను నివారించే ఔషధగుణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయని అధ్యయనాల్లో వెల్లడైంది. నీరాలోని పోషకాలు మనుషుల్లో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. రక్తకణాల వృద్ధికి దోహదపడే పోషకాలు సైతం నీరాలో ఉన్నాయి. అజీర్తి, మలబద్దకాన్ని దూరం చేస్తుందిది. మూత్ర సంబంధిత వ్యాధులు తగ్గుతాయి. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడితే.. నీరాతో కొంతవరకు సమస్యను తగ్గించవచ్చు. ‘‘...చెట్ల నుంచి కల్లు తీసే ముందు వచ్చే మొదటి దశనే నీరా. దీనికి కాస్త వేడి తగిలితే మెల్లగా పులిసి కల్లుగా మారుతుంది. కల్లుగా మారక ముందున్న నీరా పానీయం ఎలాంటి మత్తు కలిగించదు. కల్లు దుకాణాలలో కల్లుకు, నీరాకు చాలా వ్యత్యాసం ఉంది..’’ అంటాడు కల్వకుర్తికి చెందిన గీతకార్మికుడు అరవిందగౌడ్‌. 


తొలి నీరా కేఫ్‌..

... ఇన్ని రకాల కల్లుల గురించి తెలుసుకున్నాం కదా!. మార్కెట్‌లో రకరకాల మద్యపానం బ్రాండ్లు ఉన్నట్లే.. ప్రకృతిప్రసాదితమైన కల్లులకు బ్రాండ్‌ తీసుకొస్తే ... కులవృత్తి పరిశ్రమ స్థాయికి ఎదుగుతుంది. అయితే అందులో గీతకార్మికులకు భాగస్వామ్యం ఉన్నప్పుడే ఫలితం ఉంటుంది. ఈ ప్రయత్నంలో భాగమే నీరాకేఫ్‌. హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్డులో నీరాకేఫ్‌ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. ఇటీవలే మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు.  తాటిమొద్దులు, ఈత మొద్దులపై కూర్చున్నట్లు అనిపించే రీతిలో సీట్లను డిజైన్‌ చేస్తున్నారు. వాటిపై కూర్చుని ముచ్చట్లు చెప్పుకుంటూ కల్లుతో ఛీర్స్‌ చెప్పుకోవచ్చు. తలకాయకూర, బోటి, గుడాలు, పాయా వంటి తెలంగాణ వంటకాలను సైతం వడ్డిస్తారు. గీతకార్మికుల అస్తిత్వానికి ప్రతీక నీరాకేఫ్‌. ఇతర పానీయాలతో పోల్చితే నీరా ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇప్పటి వరకు కాంబోడియా, ఆఫ్రికా, ఇండోనేషియా, మలేషియా, శ్రీలంక వంటి దేశాల్లో నీరా ఉత్పత్తి అధికంగా ఉంది. హైదరాబాద్‌ నగరంలో ప్రయోగాత్మకంగా ప్రారంభమవుతున్న నీరాకేఫ్‌ మరికొన్ని నెలల్లో నిర్మాణం పూర్తి చేసుకుని.. నగరజీవులకు కొత్త రుచులు అందించనుంది. పక్కనే హుస్సేన్‌సాగర్‌.. చిటపట చినుకులు పడుతూ ఉంటే.. వెచ్చగ గొంతులోకి నీరా దిగుతూ ఉంటే.. చెప్పలేని ఆ హాయి కోసం ఎదురు చూద్దాం.. కల్లు సీసాలతో సందడి చేద్దాం.. ఛీర్స్‌. 




కోస్తాంధ్రలో కల్పరస..

కోస్తాంధ్ర తీరం కొబ్బరి చెట్లకు ప్రసిద్ధి. ఏటా కొబ్బరిసాగులో రైతులకు నష్టాలు వస్తుంటాయి. అందుకే ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. కోనసీమలోని కొందరు రైతులు కేరళలోని కేసరఘడ్‌కు వెళ్లి, కొబ్బరి చెట్ల నుంచి కల్లును తీసే అత్యాధునిక పద్ధతుల్లో తర్ఫీదు పొందారు. మొదట్లో కొబ్బరి కల్లును నీరా అని పిలిచేవారు. ఇందులో ఆల్కహాలు ఉండదు. అందుకని సీపీసీఆర్‌ఐ శాస్త్రవేత్తలు కొబ్బరికల్లుకు కల్పరస అన్న పేరు పెట్టారు. రైతులు సహకార సంఘాలుగా ఏర్పడి దీన్ని ఉత్పత్తి చేస్తే చక్కటి ఆదాయం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఒక్కో చెట్టు నుండి నెలకు మూడువేల రూపాయలు ఆదాయం వస్తుంది. అబ్కారీ శాఖ నుండి ఈ పానీయానికి మినహాయింపు ఇస్తూ జీవో నెంబరు 72ను తీసుకొచ్చింది ప్రభుత్వం. .. కొబ్బరి చెట్లు ఎక్కే సాధనాలు లేక కొంత ఇబ్బంది ఉంది. వీటిని ప్రభుత్వం సమకూరిస్తే కొబ్బరి రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది.. అన్నారు తూర్పుగోదావరి జిల్లా, అమలాపురంలోని రైతుమిత్ర రూరల్‌ టెక్నాలజీ పార్క్‌ కన్వీనర్‌ అడ్డాల గోపాలకృష్ణ. కేరళలో ఇప్పటికే కల్పరస నుండి విలువ ఆధారిత ఉత్పత్తులు చేస్తున్నారు. ఇందులో అధిక పోషకవిలువలు ఉన్నాయి. కేరళలోని కొన్ని ఆలయాల్లో కల్పరసను తీర్థంగా కూడా భక్తులకు అందిస్తున్నారు. ఇక, శ్రీలంకలో అయితే నాలుగు అతిపెద్ద కొబ్బరి కల్లు ఉత్పత్తి సంస్థలు ఏటా అరవై మిలియన్ల లీటర్ల కల్లును విక్రయిస్తున్నాయి. తెలుగురాష్ట్రాల్లో కూడా కల్పరసకు మరింత ప్రాచుర్యం తీసుకొస్తే.. కొబ్బరి రైతులకు ఊరట కలుగుతుంది. అటు సేవన ప్రియులకు ఆరోగ్యకరమైన పానీయం లభిస్తుంది. 






కల్లులో మంచి సూక్ష్మజీవులు..

ఏ చెట్టు నుండి తీసిన కల్లులో అయినా రెండున్నర శాతం ఆల్కహాలు తప్పనిసరిగా ఉంటుంది. కల్లులోని ఓ సూక్ష్మజీవి మానవుడి కడుపులో ఉన్న క్యాన్సర్‌ కారక సూక్ష్మజీవిని నాశనం చేస్తుందనీ, దీంతోపాటు కిడ్నీ వ్యాధి కారక సూక్ష్మజీవులను ఈ జీవి నిరోధిస్తుందనీ పరిశోధనల్లో గుర్తించాం. మా శాస్త్రవేత్తల బృందం రెండేళ్లపాటు.. ఖమ్మం, వరంగల్‌, ఆదిలాబాద్‌ తదితర ప్రాంతాల్లో యాభై రకాల కల్లు నమూనాలను సేకరించి, పరిశోధన చేసింది. ఫలితంగా పద్దెనిమిది రకాల సూక్ష్మజీవులు.. మనిషిలోని రోగకారక సూక్ష్మజీవులను నిర్మూలిస్తున్నట్లు తేలింది. పరిశోధన పత్రాలను కూడా ప్రచురించాం. దీనిని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ సైతం ఽద్రువీకరించింది.  జీర్ణవ్యవస్థలోని సహజసిద్ధ సూక్ష్మజీవులతో సహజీవనం చేయడం, వ్యాధి కారక సూక్ష్మజీవులను నిరోధించడం, ప్రతికూల పరిస్థితులను తట్టు కోవడం వంటి లక్షణాలు అన్ని రకాల తాజా కల్లులలో (కల్తీలేని) ఉన్నాయి.

                                                                     

- ప్రొఫెసర్‌ భూక్యా భీమా, మైక్రోబయాలజీ శాఖ, ఉస్మానియా విశ్వవిద్యాలయం



- శ్యాంమోహన్‌, 9440595858 

Updated Date - 2020-08-30T19:22:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising