లంచ్ బాక్స్ భద్రంగా...
ABN, First Publish Date - 2020-07-01T05:30:00+05:30
‘కొవిడ్ - 19’ ప్రభావం లంచ్‌బాక్స్‌ల మీదా పడింది. ఆఫీసుల్లో ఉద్యోగులు, లంచ్ బాక్స్‌లు మార్చుకుని రుచి చూసే సంస్కృతికి కాలం చెల్లిపోయింది. వైరస్ సోకే వీలు లేని లంచ్ ఏర్పాట్లే అంతటా! ఈ కొత్త సంస్కృతిలో భాగంగా...
‘కొవిడ్ - 19’ ప్రభావం లంచ్‌బాక్స్‌ల మీదా పడింది. ఆఫీసుల్లో ఉద్యోగులు, లంచ్ బాక్స్‌లు మార్చుకుని రుచి చూసే సంస్కృతికి కాలం చెల్లిపోయింది. వైరస్ సోకే వీలు లేని లంచ్ ఏర్పాట్లే అంతటా! ఈ కొత్త సంస్కృతిలో భాగంగా.... పెద్ద పెద్ద ఆఫీసుల్లో భోజనాలన్నీ ఆన్లైన్ ప్లాట్‌ఫామ్ ఆధారంగానే నడుస్తున్నాయి. ఉద్యోగుల భద్రతే ప్రధానంగా సాగుతున్న ఈ నూతన ధోరణి విశేషాలివి...
వర్చ్యువల్ పార్టీ!
ఆఫీసుల్లో ఉద్యోగులందరూ గుంపులుగా చేరి, సరదాగా పార్టీ చేసుకునే పరిస్థితి లేదు. అయితే ఆ సరదాలను వదులుకోవడం ఇష్టం లేని సంస్థలు ప్రత్యామ్నాయాల కోసం వెతుకులాట మొదలుపెట్టాయి. రెబెల్ ఫుడ్స్ అనే ఫుడ్ డెలివరీ సంస్థ, ఓ వినూత్న ఆన్లైన్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఉద్యోగులందరూ వర్చ్యువల్‌గా కలిసి పార్టీ చేసుకునే సౌలభ్యాన్ని కలిగిస్తోంది. ఇందుకోసం ‘ది వర్క్ కెఫె డాట్ కామ్’ అనే ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఉద్యోగుల డాటా బేస్ అప్డేట్ చేస్తే చాలు. ఆ సంస్థ అటు ఆఫీసులో పని చేస్తున్న ఉద్యోగులకు, ఇటు ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఉద్యోగులకు ఒకే సమయంలో పిజ్జాలను డెలివరీ చేస్తుంది. డెలివరీ చేసే ఆహారంతో పాటు, అందించే బిల్లో, పదార్థాలను తయారుచేసే పనివాళ్ల ఆరోగ్య హామీ పత్రం వివరాలు కూడా ఉంటాయి. వైరస్ అంటుకునే వీలు లేకుండా పదార్థాలను అలా్ట్ర వయొలెట్ బాక్స్‌లో డెలివరీ చేస్తారు.
అంతటా మిషన్లే!
వంటకు ముందు కూరగాయలను కడగడం, తరగడం లాంటి పనులకూ మిషన్లనే వాడుతోంది ‘ఈట్ ఫిట్’ అనే ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ. ఇందుకోసం ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐ.ఒ.టి) అనే పరికరాలు, వైర్లెస్ సెన్సర్లను కూడా వాడుతోంది. వైర్లెస్ సెన్సార్లు, వంట సిబ్బంది ధరించే రంగు టోపీలను గుర్తించి, వారి కదలికలను నమోదు చేస్తూ ఉంటాయి. ఈ విధంగా మాంసాహార, శాకాహార వంటవాళ్లు పరిధులకు కట్టుబడి కదులుతూ ఉంటారు. కాబట్టి పదార్థాలు కలిసిపోయే సమస్యా ఉండకుండా ఈ సంస్థ జాగ్రత్తలు తీసుకుంటోంది. అలాగే పదార్థాలను బయో డిగ్రేడబుల్ పైపొరతో ప్యాక్ చేస్తోంది.
పి.పి.ఇ సూట్లలో...
ఆఫీసుల్లోని ప్యాంట్రీ సేవలు కూడా ‘కొవిడ్ - 19’కు తగ్గట్టు రూపం మార్చుకుంటున్నాయి. దానిలో పని చేసే ఉద్యోగులు యూనిఫామ్‌ల పైన,పి.పి.ఇ సూట్లను ధరిస్తున్నారు. అలాగే కొన్ని సంస్థల్లో ప్యాంట్రీ సర్వీసుల నుంచి కాఫీ, టీలు తయారుచేసే బెవరేజ్ మిషన్లను తొలగించారు.
Updated Date - 2020-07-01T05:30:00+05:30 IST