నితీశా? తేజస్వియా..? బిహార్ హీరో ఎవరు?
ABN, First Publish Date - 2020-11-03T06:49:22+05:30
బిహార్ భవిష్యత్ పాలకులను నిర్దేశించే అత్యంత కీలకమైన పోలింగ్ మంగళవారం జరగనుంది. సీమాంచల్, పట్నా పరిసరాల్లోని మొత్తం 17 జిల్లాల్లోని 94 నియోజకవర్గాలకు జరిగే ఈ పోలింగ్ మూడు దశల పోలింగ్‌లో రెండోది...
- ఆ రాష్ట్ర భవితను తేల్చే రెండో దశ నేడే
- 94 సీట్లలో పోలింగ్.. జేడీయూకి అగ్ని పరీక్ష
- అధిక స్థానాలతో పాగాకు బీజేపీ కసరత్తు
- పూర్వ వైభవానికి ఆర్జేడీ- కాంగ్రెస్ యత్నం
పట్నా, నవంబరు 2: బిహార్ భవిష్యత్ పాలకులను నిర్దేశించే అత్యంత కీలకమైన పోలింగ్ మంగళవారం జరగనుంది. సీమాంచల్, పట్నా పరిసరాల్లోని మొత్తం 17 జిల్లాల్లోని 94 నియోజకవర్గాలకు జరిగే ఈ పోలింగ్ మూడు దశల పోలింగ్‌లో రెండోది. నవంబరు 7న ఆఖరిదశ జరగనున్నప్పటికీ అది కేవలం విజయం సాధించే కూటమికి, సమీప ప్రత్యర్థి కూటమికి ఉన్న అంతరాన్ని తెలియజేసేదే. రెండో దశ మాత్రమే అందరికీ కీలకం. మరోసారి సీఎం పీఠాన్ని దక్కించుకోవాలని ఆరాటపడుతున్న జేడీయూ అధినేత నితీశ్‌కుమార్ (69) తీవ్రస్థాయిలో ప్రభుత్వ వ్యతిరేక సెగ తగులుతోంది. తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ వారసుడిగా ఎప్పుడో తెరపైకొచ్చిన ఆర్జేడీ అగ్రనేత తేజస్వీ యాదవ్ (31) ఆయనకు గట్టి సవాల్ విసురుతున్నారు. మరో వారసుడు, రాంవిలాస్ పాశ్వాన్ కుమారుడు చిరాగ్ పాశ్వాన్ ఎన్‌డీఏ నుంచి బయటకు వచ్చి .జేడీయూకు పక్కలో బల్లెంలా మారారు. నితీశ్ పార్టీ కంటే ఎక్కువ సీట్లు సాధించి ఈసారి ఎలాగైనా బిహార్ గద్దెను దక్కించుకోవాలని బీజేపీ చూస్తోంది. మహాకూటమి తరఫున సీఎం అభ్యర్థి అయిన తేజస్వీ యాదవ్ తన సిటింగ్ స్థానమైన- వైశాలి జిల్లాలోని రాఘవపూర్ నుంచి పోటీలో ఉన్నారు. ఆయన ప్రత్యర్థి సతీశ్ కుమార్ 2010లో రబ్డీ దేవిని అక్కడే ఓడించి జైంట్ కిల్లర్‌గా పేరుతెచ్చుకున్నారు. అయితే 2015లో తేజస్వీ చేతిలో ఓడిపోయారు. ఈసారి కూడా తేజస్వీ విజయం ఖాయమని సర్వేలు చెబుతున్నాయి. ఆయన సోదరుడు తేజ్‌ప్రతాప్ యాదవ్ సమస్తిపూర్‌లోని హసన్‌పూర్ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అయితే ఆయన విజయం సందేహమే. ఇక నితీశ్ కేబినెట్లోని ఐదుగురు మంత్రుల భవిత కూడా ఈ దశలో తేలనుంది. ముఖ్యంగా ఏడుసార్లు నెగ్గిన సీనియర్ మంత్రి నంద కిశోర్ యాదవ్ పట్నా సాహిబ్ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు. ఈ స్థానం నుంచే బాలీవుడ్ నటుడు శతృఘ్న సిన్హా రెండుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. బీజేపీ నుంచి కాంగ్రె్‌సలోకి మారాక 2019లో ఓడిపోయారు. ఇపుడు ఆయన కుమారుడు లవ్ సిన్హా దీని పక్కనే ఉన్న బంకిపూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు.
అసెంబ్లీకి పోటీచేయని నితీశ్
ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ గత 35 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా అసెంబ్లీకి పోటీచేయలేదు. 1977లో తొలిసారి తన సొంత జిల్లా నలందాలోని హర్నౌత్ నుంచి పోటీచేసి ఓడిపోయారు. 1985లో అదే సీటునుంచి పోటీచేసి గెలిచారు. అదే ఆఖరు... మళ్లీ శాసనసభ బరిలో దిగలేదు. అయితే ఆయన ఆరుసార్లు- 1989, 1991, 1996, 1998, 1999, 2004ల్లో లోక్‌సభకు పోటీచేసి గెలుపొందారు. 2005లో రాష్ట్ర రాజకీయాల్లోకి మళ్లీ వచ్చి సీఎం అయినప్పుడు కూడా విధాన పరిషత్ సభ్యుడిగానే ఉండడానికి ఇష్టపడ్డారు తప్ప శాసనసభకు పోటీచేయలేదు.
Updated Date - 2020-11-03T06:49:22+05:30 IST