పాకిస్థాన్‌కు భారత్ గట్టి సమాధానం
ABN, First Publish Date - 2020-10-02T01:26:07+05:30
పొరుగునే ఉంటూ నిష్కారణంగా శత్రుత్వాన్ని పెంచుకుంటున్న పాకిస్థాన్‌కు భారత్ గట్టి సమాధానం చెప్పింది. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో
న్యూఢిల్లీ : పొరుగునే ఉంటూ నిష్కారణంగా శత్రుత్వాన్ని పెంచుకుంటున్న పాకిస్థాన్‌కు భారత్ గట్టి సమాధానం చెప్పింది. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో కోర్టు తీర్పుపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన పాకిస్థాన్‌ను తీవ్రంగా దుయ్యబట్టింది. ప్రజాస్వామిక విలువలను అర్థం చేసుకునే శక్తి పాకిస్థాన్‌కు లేదని స్పష్టం చేసింది.
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో 28 ఏళ్ళ అనంతరం స్పెషల్ సీబీఐ కోర్టు బుధవారం తీర్పు చెప్పింది. ఈ కేసులో నిందితులందరినీ నిర్దోషులుగా తీర్పు చెప్పింది. దీనిపై పాకిస్థాన్ స్పందిస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది. నిందితులను నిర్దోషులుగా ప్రకటించడాన్ని పాకిస్థాన్ ఫారిన్ ఆఫీస్ బుధవారం ఖండించింది. మైనారిటీలకు, మరీ ముఖ్యంగా ముస్లింలకు రక్షణ కల్పించాలని, వారి ప్రార్థనా స్థలాలకు భద్రత కల్పించాలని భారత ప్రభుత్వాన్ని కోరింది.
ఈ నేపథ్యంలో భారత దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిథి అనురాగ్ శ్రీవాస్తవ గురువారం మాట్లాడుతూ, భారత దేశం పరిపక్వతగల ప్రజాస్వామిక దేశమని, కోర్టు తీర్పుల పట్ల ప్రభుత్వం, ప్రజలు విధేయత వ్యక్తం చేస్తారని తెలిపారు. అధికార వ్యవస్థ తన ఇష్టానుసారం ప్రజలను, కోర్టులను నోరు మెదపకుండా చేసే నిర్బంధ వ్యవస్థకు ఈ ప్రజాస్వామిక విలువలను అర్థం చేసుకోవడం కష్టమని పేర్కొన్నారు.
Updated Date - 2020-10-02T01:26:07+05:30 IST