వ్యాక్సిన్.. వచ్చే ఏడాదే
ABN, First Publish Date - 2020-09-14T06:52:29+05:30
కొవిడ్-19 వ్యాక్సిన్ వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో అందుబాటులోకి వస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. అత్యవసర
మొదటి త్రైమాసికంలో అందుబాటులోకి
తొలి వ్యాక్సిన్ నేనే తీసుకుంటా: హర్షవర్ధన్
న్యూఢిల్లీ, సెప్టెంబరు 13: కొవిడ్-19 వ్యాక్సిన్ వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో అందుబాటులోకి వస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. అత్యవసర అనుమతులు ఇచ్చే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. వ్యాక్సిన్ భద్రతపై ప్రజల అనుమానాలు పోగొట్టేందుకు తొలి వ్యాక్సిన్ తానే వేయిం చుకుంటానని సోషల్ మీడియా అభిమానులతో నిర్వహించిన ‘సండే సంవాద్’లో స్పష్టం చేశారు.
మెజారిటీ ప్రజలకు టీకా వేసేలా సవివర ప్రణాళికలను నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ నేతృత్వంలోని ‘నేషనల్ ఎక్స్‌పర్ట్ గ్రూప్ ఆన్ వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ కొవిడ్-19’ రచిస్తోందని వెల్లడించారు. వాక్యిన్ ఎంతవరకూ సురక్షితం, ధర, సరఫరా, ఉత్పత్తి వంటి అంశాలపై కమిటీ చర్చిస్తోందన్నారు. కరోనా వారియ ర్స్‌కు, వృద్ధులకు తొలుత వ్యాక్సిన్ వేసేలా అత్యవసర అనుమతులిచ్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. వివిధ వ్యాక్సిన్లకు సంబంధించి ‘కొయలిషన్ ఫర్ ఎపిడమిక్ ప్రిపేర్డ్‌నెస్ ఇన్నోవేషన్స్ (సెపి)’తో భారత్ కలిసి పనిచేస్తోందని మంత్రి తెలిపారు.
వైద్యులదీ అదే మాట..
భువనేశ్వర్‌లో జరిగిన ‘ఒడిశా ఆలోచన చక్ర’ వెబినార్‌లో పాల్గొన్న పలువురు వైద్యనిపుణులు కూడా కరోనా వ్యాక్సిన్ వచ్చే ఏడాది మార్చి-ఏప్రిల్ నాటికిగానీ అందుబాటులోకి రాదని అభిప్రాయపడ్డారు. భారతీయుల ఆశలన్నీ ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్, భారత్ బయోటెక్ రూపొందిస్తున్న కోవాగ్జిన్‌పైనే ఉన్నాయి. ఆక్స్‌ఫర్డ్ టీకాకు సంబంధించి 2, 3 దశల పరీక్షలు సమాంతరంగా మనదేశంలో జరుగుతున్నాయి. కోవాగ్జిన్ ఫేజ్-1 ట్రయల్స్ సెప్టెంబరు రెండో వారంలో ముగిశాయి. ప్రభుత్వం కోవాగ్జిన్‌పైనే దృష్టి పెట్టినట్టు డాక్టర్ బిధు కల్యాణ్ మొహంతీ అభిప్రాయపడ్డారు. కాగా, వ్యాక్సిన్ రాగానే వైరస్ రాత్రికిరాత్రి మాయమైపోదని, జాగ్రత్తలు పాటించా ల్సిందే అన్నారు.
కరోనా కణాల గుట్టువిప్పే ఫొటో
విడుదల చేసిన అమెరికా శాస్త్రవేత్తలు
ఊపిరితిత్తుల్లో కరోనా వైరస్ సంఖ్య ఎలా పెరు గుతోంది? శ్వాసకోశ మార్గంలో ఎలా పాగా వేస్తోం ది? ఈ గుట్టు విప్పే ఫొటోలను అమెరికాలోని నార్త్ కరోలినా వర్సిటీ విడుదల చేసింది. గొంతు, శ్వాసనాళం నుంచి ఊపిరితిత్తుల దాకా ఉండే కణాలపై ‘సిలియా’అనే అతిసూక్ష్మ వెంట్రుకల్లాంటి నిర్మాణాలు ఉంటాయి. ఇవి చిన్నపాటి చీపురుల్లా కదులుతూ ఊపిరితిత్తుల నుంచి హానికారక పదార్థాలు, చీము, వైర్‌సలను బయటికి నెట్టేస్తుంటాయి. కరోనా ఇన్ఫెక్షన్‌తో ‘సిలియా’ల పనితీరు మందగించి, వాటి అం చులకు చీము తంతువులు అంటుకొని ఉంటుంది.
రష్యా మొత్తానికీ వ్యాక్సిన్ పంపిణీ
ఇతర దేశాల కన్నా ముందు కరోనా వ్యాక్సిన్(స్పుత్నిక్ వి) సిద్ధమైందని ప్రకటించిన రష్యా.. ఆ వ్యాక్సిన్‌ను తమ దేశంలోని అన్ని ప్రాంతాలకూ పంపింది. తొలి బ్యాచ్ వ్యాక్సిన్లు సోమవారం నాటికి అన్ని ప్రాంతాలకూ అందుతాయని రష్యా ఆరోగ్యమంత్రి మిఖాయిల్ మురష్కో తెలిపారు. గమలేయా రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ రూపొందించిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ 40 వేల మందిపై భారీగా జరుగుతున్నాయి.
మరోవైపు రష్యా చిన్నారులు మళ్లీ బడికెళ్తున్నారు. అక్కడ 5449 కరోనా కేసులే నమోదయ్యాయి. 2020-21లో ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మందికిపైగా ఈ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెస్తామని రష్యన్ డైరెక్ట్ ఇన్వె్‌స్టమెంట్ ఫండ్(ఆర్‌డీఐఎఫ్) తెలిపింది.
Updated Date - 2020-09-14T06:52:29+05:30 IST