నిజమైన వార్తలను గుర్తించడం కష్టంగా మార్చిన సామాజిక మాధ్యమాలు : తాజా అధ్యయనం
ABN, First Publish Date - 2020-04-05T23:42:58+05:30
సామాజిక మాధ్యమాలు అందరికీ చేరువవుతున్నాయి. వీటిలో వార్తలు, వినోదం కూడా అందుబాటులో ఉంటోంది
వాషింగ్టన్ : సామాజిక మాధ్యమాలు అందరికీ చేరువవుతున్నాయి. వీటిలో వార్తలు, వినోదం కూడా అందుబాటులో ఉంటోంది. అందుకే వీటిపై ఎక్కువగా ఆధారపడేవారు చతురోక్తిని కానీ, కల్పిత వ్యాఖ్యను కానీ నిజమైన వార్తగానే పొరబడేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ‘న్యూ మీడియా అండ్ సొసైటీ’ జర్నల్‌లో ప్రచురితమైన తాజా అధ్యయనం దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించింది.
సామాజిక మాధ్యమాల్లో వార్తలు, వినోదం చూసేవారు నిజమైన వార్తల పట్ల దృష్టి సారించే అవకాశం తక్కువ ఉంటుందని, సెటైర్‌ను కానీ, ఫిక్షన్‌ను కానీ నిజమైన వార్తగానే సులువుగా పొరబడే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఈ అధ్యయన నివేదిక తెలిపింది. అయితే కరెంట్ అఫైర్స్, ఎంటర్‌టైన్‌మెంట్ తదితర విభాగాలుగా వర్గీకరించుకుని సమాచారాన్ని తెలుసుకునేవారు, తాము చదువుతున్న సమాచారం విశ్వసనీయత, మూలాలను అంచనా వేయడంలో సమస్యలు ఎదుర్కొనడం లేదని పేర్కొంది.
ఈ అధ్యయన నివేదిక రచయిత జార్జి పియర్సన్ మాట్లాడుతూ ఫేస్‌బుక్, ట్విటర్ వంటి సోషల్ మీడియా సైట్స్ నుంచి వార్తలను చదవడం వల్ల ఏర్పడే అపాయాలు తమ అధ్యయనంలో వెల్లడైనట్లు తెలిపారు. జార్జి పియర్సన్ ఓహియో విశ్వవిద్యాలయంలో సీనియర్ లెక్చరర్, కమ్యూనికేషన్స్ విభాగంలో రీసెర్చ్ అసోసియేట్ కూడా.
మీడియా కంటెంట్‌కు సోషల్ మీడియా సైట్లు వన్-స్టాప్ షాప్‌లవంటివని జార్జి తెలిపారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, మేమ్స్, క్యాట్ పిక్చర్స్ వంటివాటి ద్వారా అప్‌డేట్స్ వస్తూ ఉంటాయన్నారు. అందుకే తమ దృష్టి సోషల్ మీడియాపై పడిందన్నారు.
సోషల్ మీడియాలో కంటెంట్ కలగూర గంపలా తయారవుతుందని, దాంతో అన్నీ ఒకేలా కనిపిస్తాయని అన్నారు. దేనిని తీవ్రంగా పట్టించుకోవాలో, దేనిని వినోదంగా తీసుకోవాలో తేల్చుకోవడం కష్టమవుతుందని అన్నారు. వినోదం అని దేనిని పరిగణించాలో తెలుసుకోవడం కష్టమవుతుందన్నారు.
న్యూస్ పోస్ట్‌లు, ఎంటర్‌టైన్‌మెంట్ పోస్ట్‌లు ఒకే పేజీపై కనిపించినపుడు, వాటిని చూసేవారు వాటి మూలాలు ఏమిటి? ఆ కంటెంట్ విశ్వసనీయత ఏమిటి? అనే వాటి పట్ల తక్కువ శ్రద్ధ చూపుతున్నట్లు వెల్లడైందన్నారు. విశ్వసనీయతగల వ్యక్తి లేదా సంస్థ నుంచి ఈ సమాచారం వచ్చినట్లు ధ్రువపరచుకునే ప్రయత్నాలేవీ వీరు చేయడం లేదని తేలిందన్నారు. సెటైరికల్, ఇతర రూపాల్లోని బూటకపు వార్తలు ఎక్కువగా షేర్ అవుతుండటానికి కారణాల్లో ఇది కూడా ఒకటి కావచ్చునన్నారు. ఈ బూటకపు వార్తలను నిజమైనవనే భావనతో ఎక్కువ మంది షేర్ చేస్తున్నారన్నారు.
కంటెంట్‌ని వర్గీకరించే టూల్స్‌ను సోషల్ మీడియా కంపెనీలు అభివృద్ధిపరచుకోవాలని సూచించారు. ఇది అమలయ్యే వరకు యూజర్లు మరింత శ్రద్ధతో విశ్వసనీయ వార్తలను గుర్తించాలని తెలిపారు. ప్రస్తుతం సమాచార వేదికలు, ముఖ్యంగా సామాజిక మాధ్యమాలు, మంచి పత్రికా రచనా ప్రవర్తనకు విఘాతం కలిగిస్తున్నట్లు తెలిపారు.
Updated Date - 2020-04-05T23:42:58+05:30 IST